కుటుంబ పెత్తనాన్ని పరాయి మనిషికి అప్పగిస్తే ఎవరికెంత గౌరవం ఇవ్వాలో ఆయనకు తెలిసే అవకాశం ఉండదు. ఆ ఇంటి విధివిధానాలను పక్కనబెట్టి తన ఇష్టానుసారంగా ముందుకు సాగుతాడు. అలాగే ఓ పార్టీ పగ్గాలను కూడా ఔట్‌సైడర్ చేతిలో పెడితే దాని అసలు రూపమే మారిపోతుంది.
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ రెండున్నరేండ్ల ఆ నేత పాలనలో జరిగిన పర్యవసానాలు ఇప్పుడు ఆ పార్టీకే తలనొప్పిగా పరిణమించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇప్పుడు రియల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్‌గా రెండు ముక్కలైంది. మంత్రివర్గంలో సీఎం సహా తుమ్మల, పొంగులేటి, జూపల్లి, వివేక్, సురేఖ, సీతక్క.. ఇలా ఏడుగురు బయటి పార్టీల్లోంచి వచ్చినవాళ్లు కాగా మిగతా తొమ్మిది మంది మంత్రులు ముందు నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న నేతలు. ఒకవేళ వారిలో ఎవరైనా ఎన్నికల్లో ఓటమిపాలైతే వారి పరిస్థితి భయంకరంగానే ఉండేది. అందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్‌రెడ్డి రాజకీయ జీవితమే సజీవ సాక్ష్యం.
40 ఏండ్లుగా పార్టీని కాపాడుతూ వచ్చిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుండి ముక్కోణపు పోటీ కారణంగా ఓడిపోయినందుకు ఒంటరిపక్షిగా మిగిలిపోయారు. చివరకు ఈ అవమానాలను భరించలేనని పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిస్థితి జీవన్‌రెడ్డి ఒక్కరిదే కాదు, ఎన్నికల్లో ఓడిపోతే ప్రతి సీనియర్‌కు ఎదురయ్యేదే. జీవన్‌రెడ్డి అభిప్రాయాన్ని తీసుకోకుండానే జగిత్యాల నుంచి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌ను పార్టీలో కలిపేసుకున్నారు. జీవన్‌రెడ్డి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పైపై ప్రయత్నాలు ఎన్నో చేశారు. కాంగ్రెస్ సీనియర్లలోనూ ఐక్యత దెబ్బతిన్నది. రేవంత్‌ను ఎదిరించే దమ్ములేక వారు తమ సహచరుడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోయారు. ఈ లెక్కన మంత్రివర్గంలో ఉన్న ఆయన సహచరులు, రియల్ కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనకు అన్యాయం చేసినట్లే. ఇన్ని చిక్కుల మధ్య చివరకు జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడక తప్పలేదు. ఇప్పటికీ ఆయన ఇంట్లో గోడలపై ఇందిర, రాజీవ్, రాహుల్ గాంధీతో దిగిన ఆయన ఫొటోలు కాంగ్రెస్‌తో ఉన్న మానసిక అనుబంధానికి గుర్తుగా వేలాడుతున్నాయి. ఆయన కోపం వారిపైన కాదు, వాటిని తొలగిస్తే మరింత క్షోభకు గురవుతారని ఊరుకున్నామని కుటుంబ సభ్యులు అంటున్నారు.
జగిత్యాలలో జరిగినట్లే ఓడిన సీనియర్లను అడక్కుండానే గెలిచిన బయటి పార్టీ వారికి రేవంత్ దళం కండువా కప్పేవారు. ఈ దుస్థితి చూస్తుంటే ఈసారి గెలిచిన కాంగ్రెస్ పాతకాపులు పెద్ద గండాన్ని దాటారని చెప్పాలి. లేకపోతే ఇన్నేండ్ల వారి కాంగ్రెస్ బంధం కూడా బద్దలయ్యేదే! జూనియర్‌కు పెత్తనమిస్తే సీనియర్లను కాంగ్రెస్ ఏకంగా సబ్ జూనియర్లను చేస్తున్నది. అందుకు ఉదాహరణ జీవన్‌రెడ్డి ఒక్కరే కాదు. ఎందరో సీనియర్ల పరిస్థితి ఇలాగే ఉన్నది.
1980లో యూత్ కాంగ్రెస్ నేతగా మొదలై కాంగ్రెస్ మంత్రిగా కొనసాగిన సీనియర్ నేత జి. చిన్నారెడ్డికి 2023లో టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. నిలబడి గెలిస్తే మంత్రి కావలసినవాడు ఆయన. ప్రస్తుతం పార్టీ పెద్దగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్తు నిరాశాజనకమే. టీపీసీసీ తొలి అధ్యక్షుడైన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య 2023లో టికెట్ దక్కక అవమానకరంగా 43 ఏండ్ల తర్వాత పార్టీని వీడవలసి వచ్చింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాల ప్రాంతంలో కాంగ్రెస్‌కు బలమైన నేత. పాతికేండ్లుగా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్‌కు ఎంతో బాసటగా నిలిచారు. 2023లో గెలువగానే ఆయన మంత్రి పదవిని ఆశించారు. బుజ్జగింపులతో రెండేండ్ల్లు ఓపిక పట్టారు. సమీకరణాలు కుదరలేదంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయన కోపాన్ని దిగమింగుకున్నారు. చివరకు గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి ఇచ్చేదే లేదని చెప్పకనే చెప్పినట్లు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించారు. అయితే, తనకు ఆ పదవి వద్దంటూ ఆయన ఆ బాధ్యతలను ఇంతవరకు చేపట్టలేదు. మంత్రి పదవి ఇవ్వకుంటే కుదరదని ఆయన భీష్మించుకు కూర్చున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2023లో మంచిర్యాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తే ప్రేమ్‌సాగర్‌రావుకు మంత్రి పదవి ఖాయమని అన్నారు. గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్రేమ్‌సాగర్‌రావు ఢిల్లీ వెళ్లి ఖర్గేను కలిసినా ఫలితం లేకపాయె. మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కూడా మంత్రి పదవి కోసం అలకలతో, అనుచరుల నిరసనలతో తన అసహనాన్ని ప్రకటిస్తూ వచ్చారు. చివరకు నిరుడు అక్టోబర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహాదారు పదవిని ఆయనకు చేపట్టారు. అయినా రేవంత్ నిర్ణయాలపై ఆయన కోపం చల్లారలేదు. మాజీమంత్రి జానారెడ్డి తన కొడుకు జయవీర్‌రెడ్డికి ‘సాగర్’ ఎమ్మెల్యే సీటు ఇప్పించుకొని ఈ బాధలకు దూరంగా ఉన్నారు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లు వచ్చే ఎన్నికల్లో రియల్ కాంగ్రెస్ సభ్యులకు టికెట్ దొరకడమే డౌటు. ఒకవేళ దొరికినా ఓడితే మాత్రం మూడు రంగుల జెండాతో ఋణం తీరినట్టే!
-బద్రి నర్సన్