ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు మావన చర్మ కణాలను ఉపయోగించి, కృత్రిమ మెదడు కణజాలాన్ని(బ్రెయిన్ ఆర్గనాయిడ్స్) అభివృద్ధి చేస్తున్నారు. వైద్య పరిశోధనలు, ఔషధ పరీక్షలతో పాటు భవిష్యత్తులో బయోలాజికల్ కంప్యూటింగ్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే దిశగా ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే ఈ సూక్ష్మ మెదడు కణాలు చైతన్యాన్ని కలిగివున్నాయా లేదా అనే కోణంలో శాస్రీయ, నైతిక చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మానవ కణాలను ‘ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్'(ఐపీఎస్సీఎస్)గా మార్చి, వాటిని నాడీ కణాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కణాలు విద్యాయుత సంకేతాల ద్వారా పరస్పరం సంభాషించుకుంటూ, సమాచారాన్ని విశ్లేషించగలవు.
మెదడు అభివృద్ధిని, వ్యాధుల తీవ్రతను అధ్యయనం చేయడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. జంతు ప్రయోగాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, మానవ శరీర కణాల ఆధారిత పరిశోధనలకు ‘యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్'(ఎన్ఐహెచ్) భారీగా నిధులు కేటాయిస్తున్నది. ఈ ప్రయోగాల్లో భాగంగా కార్టికల్ ల్యాబ్స్ వంటి సంస్థలు మానవ, ఎలుకల నాడీ కణాలను కంప్యూటర్లకు అనుంధానించాయి. ‘డిష్బ్రైన్’ వ్యవస్థ ద్వారా ఈ కణాలకు ‘పాంగ్’ వంటి క్లాసికల్ వీడియో గేమ్లను ఆడేలా శిక్షణ ఇచ్చారు. కణాలు విద్యుత్ సంకేతాలకు అనుగుణంగా స్పందిస్తూ, అభ్యాస సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. దీనిని పరిశోధకులు ‘సింథటిక్ బయలాజికల్ ఇంటెలిజెన్స్’ అని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఈ కణాలు స్వతహాగా ఆలోచించగలవని, లేదా స్పృహ కలిగి ఉన్నాయని దీని అర్థం కాదని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఆర్గానాయిడ్స్ మరింత పెద్దవిగా, సంక్లిష్టంగా మారితే వాటి నైతిక హోదా, మానవ హక్కుల గురించిన ప్రశ్నలు తెలెత్తుతాయి. వైద్య పరిశోధనల కోసం తమ కణాలను విరాళంగా ఇచ్చేవారికి భవిష్యత్తులో వాటిపై ఏ విధమైన హక్కులు ఉంటాయనే అంశంపై చట్టపరమైన చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. సంప్రదాయి సిలికాన్ ఆధారిత కృత్రిమ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా సజీవ నాడీ కణాలతో కూడిన కంప్యూటర్లను రూపొందించే ‘ఆర్గనాయిడ్స్ ఇంటెలిజెన్స్'(ఓఐ) రంగంలో ఈ పరిశోధనలు నూతన శకానికి నాంది పలుకుతున్నాయి.