కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బరితెగిస్తున్నది. అధికారం చేపట్టిన ఐదు నెలలకే తమ అసలు రూపం చూపుతూ.. దాడుల విష సంస్కృతి తెరపైకి తెస్తున్నది. ప్రత్యర్థి పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు రెచ్చి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మేయర్ పదవిని దక్కించుకున్న తర్వాత నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అనేక సంఘటనలకు ఆజ్యం పోసిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయం విరుచుకుపడి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి దిగిన సంఘటన మర్చిపోకముందే.. కిసాన్‌నగర్‌కు చెందిన ఓ బీఆర్ఎస్ కార్యకర్తపై కత్తులు, బీరు బాటిళ్లతో దాడికి దిగడం, ఎమ్మెల్యే గంగుల లక్ష్యంగా వ్యక్తిగత దూషణలకు దిగడం బీజేపీ అరాచకానికి అద్దం పడుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్ : కరీంనగర్ మేయర్ స్థానాన్ని అత్తెసరు మెజార్టీతో అధికారాన్ని దక్కించుకున్న తర్వాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు నగరంలో రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్వరాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో ప్రశాంత వాతావరణం ఉండి, అభివృద్ధి పథంలో దూసుకుపోయిన కరీంనగర్, ఇప్పుడు అలజడులకు నిలయంగా మారుతున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లో అధికారంలో వచ్చిన ఐదు నెలల్లో అభివృద్ధి మాట ఏమో కానీ, రాజకీయంగా విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్టు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం అవుతున్నది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావిస్తూనే, రూ. కోట్ల నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన బీజేపీ ప్రజల కనీస సమస్యలు కూడా పట్టించుకోవడం లేదని ఎక్కడికక్కడా నిలదీస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని భావిస్తున్న ఆ పార్టీ నాయకులు ఏదో రకంగా అలజడులు సృష్టించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత దాడులకు దిగి ప్రశ్నించే గొంతులను నొక్కాలనేది బీజేపీ నాయకుల వ్యూహంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్కు పెట్టని కోటగా ఉన్న కరీంనగర్లో ఆ పార్టీ క్యాడర్‌ను దెబ్బ తీయాలన్న కుట్ర కోణం కూడా ఈ దాడుల వెనక ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని తరుచూ విమర్శిస్తున్నాడని ఆరోపిస్తూ తొలుత బీజేపీ నాయకులు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా దాడికి తెగబడ్డారు. క్యాంపు కార్యాలయంలో విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో నగర ప్రజల్లో భయాందోళన వ్యక్తమైంది. పోలీసుల సమక్షంలోనే ఈ దాడికి తెగబడడం యావత్ రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన మరువక ముందే కిసాన్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్‌పై స్థానిక బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు తన అనుచరులతో కలిసి దాడి చేయడం కలకలం సృష్టించింది. కత్తులు, బీరు బాటిళ్లతో దాడి చేయడంతో నగరంలో మరోసారి అలజడి రేగింది. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారు.

పోలీసులు స్పందించిన తీరుపై ఎమ్మెల్యే గంగుల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ కక్షలు మంచిది కాదని ఆయన రెండు పార్టీల కార్యకర్తలకు హితవు పలికారు. ఈ గొడవలు ఇంతటితో సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలోనే మరో ఉదంతం కలకలం రేపింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గంగులను టార్గెట్ చేయడానికి స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు.. ఎమ్మెల్యేపై తీవ్రమైన పదజాలంతో ఓ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. తమ నాయకుడిని దూషించడాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బండారి వేణు ఇంటి ముట్టడికి యత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు జ్యోక్యం చేసుకొని ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్పొరేటర్ వేణును ముందస్తుగా అరెస్ట్ చేశారు. అంతే కాకుండా అటు బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. కార్పొరేటర్ వేణు ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, నాయకులు తిరుపతినాయక్, వసంతరావు, సుంకిశాల సంపత్‌రావు, ఆరె రవిగౌడ్, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నదని, రూ. కోట్ల నిధులు తెచ్చి నగరాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నాయకులు తరుచూ గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చ లేదని, పైగా కొత్తగా తలెత్తే ప్రజల సమస్యలను కూడా పరిష్కరించే పరిస్థితిలో కార్పొరేషన్ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. డివిజన్ల వారీగా ప్రజలే ప్రశ్నించేలా కృషి చేస్తున్నారు. ఆరోపణలను తిప్పి కొడుతూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బీజేపీ నాయకులు.. ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే తమపై వ్యక్తి గత దాడులు, దూషణలకు దిగుతున్న బీజేపీ నాయకులు, నగరంలో అలజడి సృష్టించి, అభివృద్ధి విషయాన్ని మర్చిపోయేలా చేస్తున్నారని మరో పక్క రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులకు, వ్యక్తిగత దూషణలకు స్వస్తి పలికి, నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని బీజేపీ నాయకులకు హితవు పలుకుతున్నారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడిన బీజేపీ కార్పొరేటర్ బండారి వేణుపై పరువునష్టం దావా వేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలార్ సిద్ధమయ్యారు. ఈ మేరకు న్యాయ నిఫుణులతో ఆయన సంప్రదింపులు చేశారు. ముందుగా పరువు నష్టం దావాకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో న్యాయ పరంగా నోటీసులు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తదనంతరం న్యాయవాదుల సూచనలు, సలహాల మేరకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
కరీంనగర్ రాంనగర్, ఆగస్టు 12 : ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై బీజెపీ కార్పొరేటర్ బండారి వేణు అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్‌గౌడ్ కరీంనగర్ టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగించేలా.. అనేక మంది అనుచరుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు. అంతే కాకుండా పార్టీ మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని, వేణుపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు బండారి వేణుపై కేసు నమోదు చేసినట్టు సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు.