చుంచుపల్లి, సెప్టెంబర్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణ చర్యలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో 42 బ్లాక్ స్పాట్లు గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుండి ఆగస్టు 31 వరకు జిల్లాలో 349 రోడ్డు ప్రమాదాలు జరగగా 164 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ఆగస్టులోనే 36 ప్రమాదాల్లో 14 మంది మృతి చెందినట్లు తెలిపారు. అతివేగం, హెల్మెట్–సీటు బెల్ట్ వినియోగం లేకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రహదారులపై పశువుల సంచారం తదితర కారణాలను అరికట్టాలని సూచించారు.
బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రహదారి మార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గుంతలను పూడ్చి, రహదారుల వెంట పొదలను తొలగించాలని ఆదేశించారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా సమీప ఆస్పత్రులు, అంబులెన్స్‌లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీటీఓ వెంకటరమణ, డీపీఓ అనూష, డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్, ఐఆర్‌ఏడీ జిల్లా మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు.