ఉద్యమంలో చొరబడటం.. చేతిలోకి తీసుకోవడం.. ద్రోహం చేయడం 70 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఇదే కాంగ్రెస్ పోషించిన పాత్ర. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు చివరిదాక కట్టుబడిన దాఖలా లేదు. రాష్ట్ర సాధనకు రోడ్‌మ్యాప్ వేసిన నాయకుడు అంతకన్నా లేడు. ఎవరో రేపిన ఉద్యమ వేడిని ఎన్నికల పెనంగా వాడేసుకోవడం, అధికారం దక్కగానే మాట మార్చేయడం తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర అంతా ఇంతే!
Congress | ఎన్నికల రుతువు చాలా విచిత్రమైనది. తెలంగాణ పేరిట ప్రతీ ఎన్నికల సీజన్లో మోసం చేయటం కాంగ్రెస్ పార్టీ అలవాటు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడూ బసవన్నలు, ఉత్సవ విగ్రహాలు.. ఢిల్లీ అధిష్ఠానానికి విధేయులు, ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల అనుయాయులు మాత్రమే. ఇవన్నీ ఆరోపణల్లాగా అనిపించవచ్చు కానీ, వారి ఆచరణ మాత్రం అదే విషయాన్ని ఎత్తి చూపుతుంది. ‘అధిష్ఠానం కొంచెం బిజీగా ఉంది అందుకే తెలంగాణ గురించిన ఆలోచన కొంత లేట్ అవుతుంది’, ‘వేరే రాష్ర్టాల్లో ఎన్నికలున్నాయి.. అందుకే ఇప్పుడే తెలంగాణ గురించి మాట్లాడలేం’, ‘ఎన్నికలు అయిపోగానే తెలంగాణ గురించి ముందడుగు వేస్తాం’. ఇట్లా రకరకాల సాకులతో తెలంగాణను పోస్టుపోన్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్. కాలయాపన టెక్నిక్‌లు కాంగ్రెస్ అమ్ముల పొదిలో ఎన్నో ఉన్నాయి. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో మొదలుపెట్టి, కమిటీలు, కమిషన్లు, కోర్టు తీర్పులు… ఇట్లా అన్నిరకాల డిలే టాక్టిక్స్, అంటే నీరుకార్చే పద్ధతులను ప్రయోగించారు.
వాళ్లు కొట్టుకుంటే ఇక్కడ దెబ్బలు..
కాంగ్రెస్ పార్టీలో జరిగే అంతర్గత సంక్షోభానికి కూడా బలైంది తెలంగాణనే. 1969లో కేంద్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం వస్తే దెబ్బతిన్నది తెలంగాణ ఉద్యమం. ఇందిరాగాంధీ, నిజలింగప్పల మధ్య ఆధిపత్య పోరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి బలపడ్డాడు. దాని ఫలితమే 1969 ‘జై తెలంగాణ’ ఉద్యమంలో ఉద్యమకారులను కాల్చిపడేసినా కేంద్ర కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టు కాలేదు. చివరికి 1969 ఆగస్టు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణను సమర్థిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు, కె.రామచంద్రారెడ్డి, రాజమల్లు ఆధ్వర్యంలో 20 మంది తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసి ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తెలంగాణలో 200 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్నది’ అని ఆరోపించినా, తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు పాల్వాయి గోవర్ధనరెడ్డి, జేవీ సుధాకర్‌రావు, ఈశ్వరీబాయి అరెస్టయినా ఇందిరా గాంధీకి పట్టలేదు, బ్రహ్మానందరెడ్డి ఆధిపత్యమే కొనసాగింది. తెలంగాణ కోసం ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి 1971 పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించినా ఆర్నెల్లు కాగానే కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చిన పాపం అటు ఇందిరాగాంధీ, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పంచుకోవాల్సిందే. 10 మంది ఎంపీల్లో ఇద్దరు తప్ప మిగతా అందరూ కాంగ్రెస్ అధిష్ఠానానికి లొంగిపోయారు. వారి వెంటే అధ్యక్షుడు చెన్నారెడ్డి కూడా తలొగ్గి ఉద్యమాన్ని చల్లబరచడంలో తన వంతు పాత్ర పోషించారు. 1971లలో తగ్గుముఖం పట్టిన ఉద్యమం మళ్లీ 30 ఏండ్లకు ఒక ప్రజా ఉద్యమంగా మొదలయ్యే వరకు తెలంగాణ సమాజం అనుభవించిన వివక్షకూ, అన్నిరకాల పరాయీకరణలకు కాంగ్రెస్‌దే బాధ్యత.
2004 ఎన్నికల్లోనూ మోసం
1998ల నుంచి తెలంగాణలో ప్రత్యేక ఉద్యమానికి కావలసిన వాతావరణం పెరుగుతూ వచ్చింది. మరోవైపు టీడీపీపై వ్యతిరేకత పెరుగుతున్న కాలం. అపుడే కాంగ్రెస్ జెండాతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండు ముఖ్య అంశాలతో ముందుకొచ్చాడు. ఒకటి నక్సలైట్లతో చర్చలు జరిపి శాంతిని స్థాపించడం, రెండోది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సమర్థన. ప్రతీ కాంగ్రెస్ నాయకుడి లాగానే ఈ రెండు అంశాలను కూడా తనకు అనుకూలంగా మలుచుకొని అధికారంలోకి వచ్చి తర్వాత ఘోర తెలంగాణ విరోధిగా మారాడు. తెలంగాణ ఏర్పాటుకు ఒక మార్గం అనుకున్న 2004 ఎన్నికలు కాంగ్రెస్ చేసిన మోసానికి సాక్ష్యంగా నిలిచాయి.
టీఆర్ఎస్ వరంగల్ బహిరంగసభకు వచ్చిన 15 లక్షల మంది ప్రజలను చూసి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం భయపడిపోయింది, ప్రత్యేకంగా సోనియాను ఆలోచింపజేసేలా చేసింది. తెలంగాణ నినాదం కాంగ్రెస్‌ను అధికారానికి చేరువ చేస్తుందని తెలిసిపోయింది. అప్పటినుంచి ప్రతీ ఎన్నికలో మొదట కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం, ఎక్కడా పోటీలో లేని బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశాన్ని ఎన్నికల్లో తురుపుముక్కగా వాడుకున్నాయి.
సాగదీతకు సాకులు..
ఎన్నికల ప్రణాళికలో అస్పష్టంగా తెలంగాణ విషయంలో ‘మొదటి స్టేట్ రీ ఆర్గనైజింగ్ కమిటీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తామని’ ప్రకటించి పొత్తు కుదుర్చుకున్నది. తర్వాత యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చింది కాంగ్రెస్. రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగంలో కూడా ‘కాన్సెన్సస్’ అంటే ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేపడుతామని పేర్కొన్నది కాంగ్రెస్. ఇక్కడినుంచే మోసం మొదలవుతుంది. కాన్సెన్సస్ అనే పదాన్నే రాజశేఖర్‌రెడ్డి ఆయుధంగా మార్చుకొని తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం మొదలుపెట్టిండు. అప్పటినుంచి తెలంగాణ ఏర్పడేవరకు ఈ కాన్సెన్సస్ పదమే తెలంగాణ వ్యతిరేకులకు ఆయుధంగా నిలిచింది.
2005 మార్చిలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటుచేసి 8 వారాల్లో నివేదికను ఇవ్వాల్సి ఉంటే 80 వారాలైనా నివేదిక లేదు. పైగా రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాను ఉపయోగించుకొని తెలంగాణ వ్యతిరేక చర్యలు ఎన్నో చేశాడు. లోక్‌సభలో దాదాపు 440 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుకాకపోవటానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? విచిత్రమేమంటే అన్ని రాజకీయపక్షాలు తెలంగాణకు తమ సమ్మతిని లిఖిత పూర్వకంగా ఇస్తే కాంగ్రెస్ మాత్రం కుంటిసాకుతో లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు. ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం, ఇటు తెలంగాణ కాంగ్రెస్ వాళ్లను మభ్యపెడుతూ, ఇంకోవైపు సీమాంధ్ర లాబీయింగ్‌కు మద్దతు ఇస్తూ పబ్బం గడుపుకొన్నది.
కత్తి అందించేది కాంగీయులే!
2004 కరీంనగర్ సభలో సోనియాగాంధీ ‘తెలంగాణ ప్రజల మనోభావాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది’ అని చెప్పిన మాటను నమ్మిన తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన బహుమతి గులాంనబీ ఆజాద్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల చేతిలో తెలంగాణ భవిష్యత్తును పెట్టడం. 1972లో ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజా సమితిని చీల్చినట్టే, టీఆర్ఎస్ సభ్యులను చీల్చి కాంగ్రెస్‌లో కలుపుకొని తెలంగాణ ఉద్యమం పీక పిసికే ద్రోహానికి ఒడిగట్టిన రాజశేఖరరెడ్డిని తెలంగాణ కోరుకునే వారెవ్వరూ ఏనాడూ కలలో కూడా సమర్థించరు. కానీ, వైఎస్ హయాంలో తెలంగాణ ఏమైపోతే ఏంటి? ప్రజలు ఏ గంగలో కలిస్తే మాకేంటి? అనుకొని వైఎస్ చుట్టూ తిరిగి కోట్లు కుమ్మేసుకొని ఆయన పాలనను ‘రాజన్న రాజ్యం’ అని ఇప్పటికీ ప్రేమగా చెప్పుకొనే భృత్య, వ్యర్థ, బానిస నాయకులకు తెలంగాణ కాంగ్రెస్‌లో కొదవలేదు.
2009 ఎన్నికల్లో తొలగిన కాంగ్రెస్ ముసుగు
‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్నా, ఏరు దాటినాక బోడి మల్లన్నా‘ అనే సామెత కాంగ్రెస్‌కు బాగా వర్తిస్తుంది. 2004లో గెలుపు కోసం తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్, ఐదేండ్లు ఏం చేయకుండా, 2009లో మళ్లీ తెలంగాణ హామీని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు తెలంగాణ తెస్తామనే హామీతో ఎన్నికల్లో ముందుకొచ్చినాయి. మొదటి దశలో తెలంగాణలో ఎన్నికలు పూర్తికాగానే ‘హైదరాబాద్‌కు పోవాలంటే వీసా తీసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రా, రాయలసీమలలో ఓటర్లను బెదిరించి’ రాజశేఖర్‌రెడ్డి ఓట్లు అడుక్కుంటే ఎదిరించినవాళ్లు లేరు. ఏదేమైనా ఎన్నికల్లో తెలంగాణను మోసం చేయడం కాంగ్రెస్‌కు రెగ్యులర్ అలవాటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రజారాజ్యం పుణ్యాన చీలినప్పటికీ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి కేవలం 8 సీట్ల ఆధిక్యం వచ్చింది. కాంగ్రెస్ దగా మళ్లీ పునరావృతమైంది. 1971, 2005లో లాగానే గెలిచిన 10 మంది టీఆర్ఎస్ సభ్యులను చీల్చి తెలంగాణ కోసం పనిచేసే పార్టీ కూడా ఉండకుండా చేసే విఫల ప్రయత్నం చేసింది.
అతి పెద్ద ద్రోహి..కాంగ్రెస్సే!
తెలంగాణ సాధనకు పార్లమెంటరీ ప్రక్రియ ఒక ముఖ్య సాధనమైనా, ద్రోహం జరిగిన ప్రతీసారి తెలంగాణ ఉద్యమం మాత్రం ప్రజా సమస్యల నుంచే ఫీనిక్స్ పక్షిలా ఉవ్వెత్తున లేస్తూనే వచ్చింది. ఎన్నికల ద్వారా, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా రాష్ట్ర సాధనకు మార్గం ఏర్పడుతుందన్న నమ్మకంతోనే తెలంగాణ ఉద్యమం ఆ దిశగా చూసింది. ఈ ఆశను, ఆకాంక్షను ఒక బలహీనతగా భావించిన అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల పేరుతో మోసం చేస్తూనే వచ్చాయి. అయితే ఈ ద్రోహంలో అతిపెద్ద వంతు మాత్రం, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక కాలం అధికారానికి అతుక్కొని ఉన్న కాంగ్రెస్ పార్టీదే.
డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్