వశీకరణ జరగడంతో తనకు తెలియకుండానే నలుగురు వార్డర్ల మరణానికి కమలాకర్ కారణమయ్యాడు. దీంట్లో కమలాకర్ తప్పేమీ లేదని గ్రహించిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ హిజ్ టీమ్.. కమలాకర్‌ను హిప్నొటైజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టడానికి సీసీటీవీ ఫుటేజీని పరీక్షించారు. ఖైదీలు గ్రౌండ్లోకి రాకముందు కమలాకర్‌తో ముగ్గురు ఖైదీలు వేర్వేరుగా మాట్లాడినట్టు వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఆ ముగ్గురిని తన క్యాబిన్లోకి పిలిపించుకొన్నాడు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్.
ఆముగ్గురు వచ్చీరాగానే అక్కడే ఉన్న రుద్ర వారి నడవడికను జాగ్రత్తగా గమనించసాగాడు. ముగ్గురూ వచ్చిన వెంటనే లై డిటెక్టర్ డివైజ్‌కు వాళ్ల శరీరాన్ని కనెక్ట్ చేసి.. ‘కమలాకర్‌తో ఏం మాట్లాడారు?’ అని అడుగుతూ డైరెక్ట్‌గా పాయింట్లోకి వచ్చాడు కరణ్. ‘నీతో.. ఆ పోలీస్ సార్ (రుద్ర) ఏం మాట్లాడాడు?’ అని కమలాకర్‌ను అడిగానని మొదటి ఖైదీ చెప్పగా, రెండో ఖైదీ మాట్లాడుతూ.. ‘నీకు ఉరి శిక్ష ఎలా వాయిదా పడింది?’ అని అడిగినట్టు చెప్పాడు. మూడో ఖైదీ మాట్లాడుతూ.. ‘జైళ్లో నలుగురు చనిపోయారట.. నీకు తెలుసా?’ అని అడిగినట్టు చెప్పాడు. ముగ్గురు ఖైదీలు నిజమే చెప్పినట్టు లై డిటెక్టర్ తేల్చింది.
ముగ్గురి సమాధానాలు విన్న కరణ్.. మూడో ఖైదీని దగ్గరికి పిలిచాడు. లై డిటెక్టర్ డివైజ్‌ను ఆఫ్ చేయమని చెప్పిన కరణ్.. మూడో ఖైదీ చెంప ఛెల్లుమనిపించాడు. ‘నలుగురు చనిపోయారని ఎవరు చెప్పారు?’ అంటూ అతని గల్లా పట్టుకొని నిలదీసిన కరణ్.. రుద్ర వైపునకు తిరిగి.. ‘రుద్ర.. ‘ఆ నలుగురి’ని చంపాడు కాబట్టే, వీడికి ఆ విషయం తెలిసింది. వీడే వెనకుండి ఇదంతా చేస్తున్నాడు. ఒక్కసారి కమలాకర్‌ను పిలిచి వీడితో మాట్లాడాకే, నీకు మైకం కమ్మినట్టు అయ్యిందా? అని అడిగితే, సరిపోతుంది. హీ ఈజ్ ది బ్లాక్ షీప్’ అంటూ చెప్తూ పోయాడు. కరణ్ ఆదేశాలతో క్యాబిన్లోకి వచ్చిన కమలాకర్.. ముగ్గురు ఖైదీలను చూశాడు. కమలాకర్‌ను చూసిన మూడో ఖైదీ.. ‘ఈ పోలీస్ సార్.. నన్ను బ్లాక్ షీప్ అంటున్నారు.. నిజానికి, ఐ యామ్ నాట్ బ్లాక్ షీప్’ అన్నాడు. మూడో ఖైదీ మాటలను అంగీకరించినట్టు తలూపిన కమలాకర్.. ‘సార్.. హీ యిజ్ నాట్ బ్లాక్ షీప్.. దీజ్ టూ పీపుల్ ఆర్ బ్లాక్ షీప్స్’ అంటూ మిగతా ఇద్దరు ఖైదీలను చూస్తూ బాంబు పేల్చాడు కమలాకర్.
ఆ వెంటనే మూడో ఖైదీ.. మిగతా ఇద్దరి దగ్గరికి వెళ్లి.. ‘మీ వల్ల నన్ను అనుమానించారు. మీరే బ్లాక్ షీప్స్.. ఇప్పటికైనా నిజం చెప్పండి’ అంటూ గద్దించాడు. అప్పటికే నిశ్చేష్టులుగా మారిపోయిన ఇద్దరు ఖైదీలు.. ‘యెస్.. వుయ్ ఆర్ ది బ్లాక్ షీప్స్’ అంటూ ఒప్పుకొన్నారు. అలర్టయిన రుద్ర.. ఇద్దరు ఖైదీలను బంధించి పక్క రూమ్‌లో కూర్చోబెట్టమని సిబ్బందిని పురమాయించాడు. అనంతరం.. మూడో ఖైదీని దగ్గరకు పిలిచి అనుమానించినందుకు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ‘మీ పేరేంటీ?’ అని అడిగాడు. ‘డోలో’ అని సమాధానమిచ్చాడు మూడో ఖైదీ. ‘సరే.. బ్లాక్ షీప్స్ వాళ్లేనని తేలింది. అయితే, నాకు ఒక డౌట్.. క్లియర్ చేస్తారా?’ అని సూటిగా ప్రశ్నించాడు రుద్ర. అడగమన్నట్టు సైగ చేశాడు డోలో. ‘జైళ్లో నలుగురు చనిపోయిన విషయం.. ఎవ్వరికీ తెలియదు. మరి, మీకెలా తెలుసు?’ అని పాయింట్లోకి వచ్చాడు. ‘వరండాలో నలుగురు వార్డర్లు వాళ్లకు వాళ్లే కాల్చుకొని చనిపోవడం నేనే కాదు అక్కడే ఉన్న మరో ఐదారుగురం ఖైదీలం చూశాం. కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే, బొమ్మలా ఓ షాక్‌లో ఉన్నట్టు నిలబడిపోయాడు. దీంతో అసలు ఆ విషయం అతనికి గుర్తుందా? లేదా?? అని జైళ్లో నలుగురు చనిపోయారట.. నీకు తెలుసా? అని అడిగా’ అంటూ డోలో చెప్పడం పూర్తి చేయకముందే.. క్యాబిన్ మొత్తం సౌండ్ వచ్చేలా.. రుద్ర గట్టిగా చప్పట్లు కొట్టాడు.
‘వావ్.. వావ్.. వావ్.. పోలీసుల కంటే దొంగలు కొన్నిసార్లు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారని విన్నా.. ఇప్పుడు కండ్లారా చూస్తున్నా! ‘ఆ నలుగురు’ ఖైదీల క్రూయల్ సూసైడ్స్ విషయం తెలిసినప్పటికీ.. దాన్ని దారిమళ్లిస్తూ.. ఈ నలుగురు వార్డర్ల మరణంగా ప్లేటు ఫిరాయించి అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చిన డోలో గారికి టేక్ ఏ బోవ్’ అంటూ నవ్వాడు. రుద్ర అసలేం మాట్లాడుతున్నాడో.. అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కావట్లేదు. ‘మిస్టర్ రుద్ర.. నా కండ్లలోకి ఓ సారి’ అని డోలో అనబోతుండగానే.. అతని చెంప ఛెల్లుమనిపించాడు రుద్ర. పక్కనే ఉన్న కరణ్‌తో మాట్లాడుతూ.. ‘కరణ్ గారు.. మనకు కావాల్సిన వాడు వీడే. పేరు డోలో. జైళ్లో ‘ఆ నలుగురు’ సూసైడ్స్‌కు, మన నలుగురు వార్డర్లు చనిపోవడానికి ఒక విధంగా వీడే కారణం’ అంటూ తేల్చేశాడు.
‘ఏం.. మాట్లాడుతున్నారు? తప్పు తామే చేశామని ఆ ఇద్దరు ఖైదీలు’ అంటూ డోలో ఇంకా ఏదో మాట్లాడబోతుండగా మళ్లీ అతని చెంప ఛెల్లుమనిపించిన రుద్ర.. ‘ఏయ్ డోలో.. కండ్లతో కమలాకర్‌ను వశీకరణం చేసుకొన్నట్టు నన్ను కూడా చేద్దామనుకొన్నావా? అంతేకాదు, ఈ రూమ్‌లోకి రాగానే, మిగిలిన ఆ ఇద్దరు ఖైదీలనే కాకుండా అప్పుడే వచ్చిన కమలాకర్‌ను కూడా నీ ఆధీనంలోకి తెచ్చుకున్నావ్ కదా.. కరణ్ జనరల్‌గా అన్న బ్లాక్ షీప్ వాక్యాన్ని.. నువ్వు.. గోంగ్, షాంగ్, జ్యూ, జీ, యూ వంటి ఉచ్ఛరణలు లీలగా వచ్చేలా చేస్తూ.. 396 హెర్జ్ ఫ్రీక్వెన్సీలో పదే పదే పలికినప్పుడే గమనించా. నువ్వు వారిపై సౌండ్ థెరపీ హిప్నొటైజేషన్ చేస్తున్నావని. అందుకేగా.. వాళ్ల కండ్లలోకి చూసి సౌండ్‌తో హిప్నొటైజ్ చేశావ్’ అంటూ రుద్ర చెప్తూ పోయాడు. అది విన్న అక్కడి వారందరూ షాకయ్యారు. ‘ఏయ్ డోలో.. నువ్వు ఇంత ఈజీగా దొరికిపోవడానికి కారణం.. నువ్వే అని తెలుసా?’ అన్న రుద్ర ప్రశ్నకు.. తలొంచుకొని నిలబడిపోయాడు డోలో. అర్థంకానట్టు నిలబడ్డ కరణ్ అండ్ టీమ్‌కు డోలోనే నిందితుడని తానెలా కనిపెట్టానో క్లియర్‌గా ఎక్స్‌ప్లేయిన్ చేశాడు రుద్ర. అది మీరు చెప్పగలరా?
సమాధానం: కరణ్ ఆదేశాలతో క్యాబిన్లోకి వచ్చిన కమలాకర్‌తో వచ్చీరాగానే.. ‘సర్.. నన్ను బ్లాక్ షీప్ అంటున్నారు.. నిజానికి, ఐ యామ్ నాట్ బ్లాక్ షీప్’ అని డోలో అన్నాడు. అయితే, అక్కడ ఏం జరుగుతుందో.. తనను ఎందుకు పిలిచారో.. ఏం అడుగబోతున్నారో అనే విషయాలు కమలాకర్‌కు అస్సలు తెలియదు. అయినప్పటికీ, డోలో మాటలను అంగీకరిస్తూ కమలాకర్ తలూపాడు. దీంతో కమలాకర్‌ను డోలో హిప్నొటైజ్ చేశాడని రుద్రకు తొలుత అనుమానం వచ్చింది. అంతేకాదు, అప్పటివరకూ తమకేదీ తెలియనట్టు ఉన్న మిగతా ఇద్దరు ఖైదీలు ఎప్పుడైతే డోలో వెళ్లి నిలదీశాడో.. ‘యెస్.. వుయ్ ఆర్ ది బ్లాక్ షీప్స్’ అంటూ ఒప్పుకొన్నారు. దీంతో డోలో వాళ్లను సౌండ్ థెరపీ హిప్నొటైజ్ చేశాడని రుద్ర కనిపెట్టాడు.