హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కల్తీపాలు, నెయ్యి అమ్ముతున్నారని, ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడమే కారణమని డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రం మారిన తరువాత ఏపీ విజయబ్రాండ్ను దుర్వినియోగం చేసున్నదని విమర్శించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏపీ డెయిరీని అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిందని, మేఘన ఫుడ్స్‌కు ఫ్రాంచైజీ ఇచ్చిందని, వాళ్లు గుజరాత్లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నారని వివరించారు.
ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్టు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, హైదరాబాద్‌లో ప్రతి నెలా 100 టన్నుల నెయ్యి అమ్మకాలు కొనసాగుతున్నాయని, కల్తీపాలు, నెయ్యితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదమున్నదని తెలిపారు. ఏపీ తీరుతో తెలంగాణ పాడి రైతాంగానికి నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు విజయ డెయిరీ పేరును వాడుకోవడానికి వీల్లేదని, ఏపీకి ఈ విషయంపై లేఖలు రాసినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. ఇకనైనా దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు విజయ పేరును చూసి కొనుగోలు చేయాలని అమిత్‌రెడ్డి కోరారు.