భాషా ప్రయుక్త రాష్ర్టాల ప్రాతిపదికన భారతదేశం పలు రాష్ర్టాలుగా ఏర్పాటైంది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడగా, ఆ ప్రాంతాలు అనేక రాష్ర్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. హిందీ తర్వాత ఎక్కువమంది ప్రజలు మాట్లాడేది తెలుగు భాష. 1956కు పూర్వం మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రా ప్రాంతం, హైదరాబాద్ స్టేట్‌లో తెలంగాణ ప్రాంతం ఉండేవి. మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రా ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండగా, హైదరాబాద్ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతం రాచరిక పాలనలో ఉండేది.
ఈ రెండు ప్రాంతాల భాష తెలుగే అయినప్పటికీ అనేక విషయాల్లో ఈ రెండు ప్రాంతాల ప్రజల్లో సామీప్యత లేదు. ఇద్దరి యాస వేరు, ఆహారపు అలవాట్లు వేరు, పండుగలు వేరు, సంస్కృతి సంప్రదాయాలు వేరు, ఆచార వ్యవహారాలు వేరు, కట్టూ బొట్టు వేరు, ఆనాటి వారి పేర్లలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదా-ఓబులేసు, మద్దిలేటి, రెడ్డమ్మ, ముణెమ్మ, పెంచలయ్య, సుబ్బారావు, అప్పారావు, పాత్రుడు, నూకరాజు, అప్పల నరసింహ, సన్నాసి ఆంధ్ర ప్రాంతం పేర్లు కాగా.. సమ్మయ్య, కొమురయ్య, రాజమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, జానయ్య, సైదమ్మ, నరసింహ, యాదయ్య, పోశెట్టి, బొందాలు, లింబాద్రి, గంగవ్వ, సంగయ్య, పర్వతాలు, పెంటయ్య, ఇస్తారి, సోమన్న తెలంగాణ పేర్లు. ఆంధ్రా ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండి విద్య తదితర రంగాల్లో ముందుండగా తెలంగాణ విద్యలో వెనుకబాటుకు లోనైంది. సంపదను దోచుకోవడం, ఎదుటివారిపై పెత్తనం చెలాయించడమనే లక్షణం బ్రిటిష్ వారితో సహచర్యం వల్ల ఆంధ్రులకు అబ్బింది.
రాచరిక పాలనలో ఉన్న తెలంగాణ ప్రజలకు అమాయకత్వం, మంచితనం తప్ప వంచన ఎరుగరు. నిజాం పాలనలో రజాకార్ల, పోలీసుల అరాచకాల వల్ల తమను తాము రక్షించుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి పోయి కొన్ని ఇండ్లలో తలదాచుకున్న వారిని ఆశ్రయం ఇచ్చినవారు ఏ విధంగా నిలువు దోపిడీ చేసినారో కథలు కథలుగా చెప్పేవారు. అందుకే, తెలంగాణ ప్రాంతం వారు ఆంధ్రతో కలిపే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. రాచరిక పాలన కంటే భయంకర దోపిడీకి, అణచివేతకు గురౌ తామని గగ్గోలు పెట్టారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలు నాటి విద్యార్థులు, మేధావులు కొత్త రాష్ర్టాల ఏర్పాటుకోసం నియమించబడిన కమిషన్ చైర్మన్ ఫజల్ అలీకి నివేదించారు. ఫజల్ అలీ కమిషన్ కూడా తెలంగాణ ప్రజల ఆవేదనతో ఏకీభవించింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆక్రందనను, ఏ మాత్రం పట్టించుకోక తెలంగాణ ప్రజల అభీష్టానికి భిన్నంగా ఆంధ్రా తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్ 1.
తెలంగాణ ప్రజలు అనుమానించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మరుక్షణం నుంచే తెలంగాణ పట్ల వివక్ష మొదలైంది. వారి ఆధిపత్య అణచివేత, దోపిడి, దురహంకార, ధోరణి తెలంగాణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ బాధలు కొన్నేండ్లు భరించిన తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డ మీద రెండవ శ్రేణి పౌరులుగా బతుకడం సహించలేక స్వరాష్ట్ర ఏర్పాటు దిశగా ఆలోచన మొదలు పెట్టారు. 1969లో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ప్రారంభమై తెలంగాణ నలుచెరుగుల శరవేగంగా వ్యాపించింది. విద్యార్థులు యువకులు ముందుండి నడిపిన ఈ ఉద్యమాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వందల మందిని కాల్చి చంపి వేలాది మందిని జైళ్లపాలు చేసి అప్రజాస్వామికంగా, కర్కశంగా అణచివేసి తెలంగాణకు ద్రోహం తలపెట్టింది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్ 2.
1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అప్రతిహతమైన విజయం సాధించగా, ఆ ప్రభంజనాన్ని ఎదిరించి టీపీఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఘనమైన విజయాన్ని కట్టబెట్టి తమ ఆకాంక్షలోని హేతుబద్ధతను పవిత్రతను ఓటు తీర్పుగా ప్రకటించారు.
తెలంగాణలోని 14 పార్లమెంట్ సీట్లలో 10 మంది (టీపీఎస్) అభ్యర్థులను గెలిపించారు. అప్రతిహతమైన, ఆలోచనాభరితమైన ఈ ప్రజా తీర్పును శిరసా వహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేయవలసిన ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా తెలంగాణ ప్రజా సమితి లోక్‌సభ సభ్యులను కాంగ్రెస్‌లో విలీనం చేసుకొని ప్రజాస్వామ్య పవిత్రతకు మాయని మచ్చ తెచ్చింది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్-3.
తదనంతర కాలంలో 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు పెద్ద మనుషుల ఒప్పందం, 6 సూత్రాల పథకాలకు తిలోదకాలిచ్చి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, భూములు యథేచ్ఛగా దోపిడీ కావడానికి, అన్యాక్రాంతం కావడానికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కనుసన్నలలో ఆంధ్ర నాయకత్వం దురాగతాలకు పాల్పడింది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్-4.
టీడీపీ హయాంలోనూ ఈ వైఖరే కొనసాగింది. 2001లో ఆవిర్భవించి, తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఎదుగుతున్న టీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగగా 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం, కట్టుబడి ఉన్నామని ప్రకటించి టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్నికల్లో గెలిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చి, అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నోట పలికించి, తదనంతర కాలంలో ఉలుకూ పలుకు లేని నాన్చివేత ధోరణిని ప్రదర్శించింది. యూపీఏకు నాయకత్వం వహించిన కాంగ్రెస్ మోసాన్ని నిరసించిన కేసీఆర్ రాష్ట్రంలోని ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులచే రాజీనామా చేయించారు. అయినప్పటికీ కాంగ్రెస్ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తదనంతరం లోక్‌సభ సభ్యత్వానికీ కేసీఆర్ రాజీనామా చేయడం కాంగ్రెస్ ద్రోహ ఫలితమే. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్-5.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దేశంలోని 37 పార్టీలు తమ అంగీకార పత్రాలను సమర్పించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోగా, రాష్ట్రంలోని నాటి ముఖ్యమంత్రి వైఎస్ మిత్ర ధర్మానికి భిన్నంగా 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, చీల్చి టీఆర్ఎస్ను అస్థిరపరిచే ద్రోహానికి తలపడ్డాడు. 2009 ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ టీఆర్ఎస్ శాసనసభ్యులను చేర్చుకొని టీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలని చూసింది. ఆ తర్వాత 2009, అక్టోబర్‌లో 14 ఎఫ్‌కు సంబంధించిన ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా ఉద్యమాన్ని సాగిస్తున్న ‘కేసీఆర్ సచ్చుడో-తెలంగాణ వచ్చుడో…’, ‘తెలంగాణ జైత్రయాత్రో- కేసీఆర్ శవయాత్రో’ అంటూ భీష్మించి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణలోని ప్రతి గుండెను తట్టి లేపింది. తెలంగాణ యావత్ ఆందోళనలతో అట్టుడికింది. ఎగిసిపడుతున్న ఉద్యమం, సబ్బండ వర్గాలు ఏకమై సాగుతున్న నిరసనలు, తెలంగాణే దీక్ష శిబిరంగా పరిణమించగా పూర్తిగా క్షీణించిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పార్లమెంట్ ఆందోళన వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం తరఫున నాటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని, కేసీఆర్ నిరహారదీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన ఫలితంగా కేసీఆర్ దీక్షను విరమించారు. ఆగమేఘాల మీద సీమాంధ్రులు సృష్టించిన నకిలీ ఉద్యమం ప్రభావానికి, ఒత్తిడికి లోనైన కేంద్రం యూ-టర్న్ తీసుకొని ఘోరాతి ఘోరమైన ద్రోహం చేసింది. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్-6.
కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టగా అరెస్టు చేశారన్న వార్త విని ఖిన్నుడైన శ్రీకాంతాచారి అదేరోజు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా డిసెంబర్ 3న అమరుడయ్యాడు. శ్రీకాంతాచారి బలిదానం యావత్ జాతిని కలచివేసింది, కదిలించింది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షలోని పవిత్రతను, దాని తీవ్రతను చాటడానికి మూర్ఖుల, ద్రోహుల, దుర్మార్గుల కండ్లు తెరిపించడానికి, లక్ష్యసాధన కోసం వందలాది మంది యువకులు కావాలని జాతి విముక్తికి ప్రాణత్యాగం చేశారు. దీనంతటికీ కారణం కాంగ్రెస్. ఇది తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం నెంబర్-7.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవిం చి, ఆ లక్ష్యాన్ని సాకారం చేసి, నిన్న అధికార పార్టీగా రాష్ర్టాన్ని పదేండ్ల పాటు సుభిక్షంగా, సుఖ, సంతోషాలకు ఆలవాలంగా నిలబెట్టి, నేడు ప్రతిపక్ష పార్టీగా 16 నెలలుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ దుర్మార్గాన్ని అడుగడుగునా చీల్చి చెండాడుతూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ఆశగా, శ్వాసగా కేసీఆర్ నాయకత్వాన రజతోత్సవం జరుపుకొంటున్న వేళ చరిత్రాత్మకమైన భారీ బహిరంగసభకు తెలంగాణలోని ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరు తరలివెళ్దాం. చరిత్రలో అనేక సందర్భాల్లో తెలంగాణకు ద్రోహం తలపెట్టిన, ఇప్పటికీ తలపెడుతూనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని ప్రజా సమూహంగా నిలదీద్దాం.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులు)
సిరికొండ మధుసూదనాచారి