అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను తక్షణం ఇస్తామన్నారు. ఒకటో తేదీన తప్పకుండా వేతనాలు వచ్చేలా చూస్తామన్నారు. సప్లిమెంటరీ బిల్లులను 15 పని దినాల్లో క్లియర్ చేస్తామని నమ్మబలికారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తామని చెప్పుకొచ్చారు. కానీ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పెద్దలు మ్యానిఫెస్టోలను అటకెక్కించారు… ప్రజలను మర్చిపోయారు.
ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి, ఆరు నెలల్లోపు సిఫారసులను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉద్యోగులు పెన్షనర్లు అరిగోస పడుతున్నా హస్తం పార్టీనేతలు చోద్యం చూస్తున్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని దవాఖానల్లో వైద్యం అందించేలా హెల్త్ కార్డులు జారీ చేస్తామని బుకాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లే కీలకం. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది. ఇంతకాలం ఓపిక పట్టాం. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఈ క్రమంలో ఉద్యోగ జేఏసీ 2025 మే నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించగా, ‘ఉద్యోగులకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. నన్ను కోసినా డబ్బులు లేవు. దేశంలో అప్పులు ఎవరూ ఇవ్వడం లేదు. అప్పు కోసం వెళ్తే దొంగలాగా చూస్తున్నారు. నేను ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగులకు ఇమ్మంటారు?’ అని సీఎం రేవత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి అనాల్సిన మాటలేనా ఇవి? ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటి?
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ డబ్బులకు సంబంధించి, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల అడియాశలు చేసింది. నిధుల కొరత ఉన్నదని చెప్తూ రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం దీంతో అనారోగ్యంతో దవాఖానపాలైన వారు తమ గోడు వినాలంటూ పాలకులకు వీడియో సందేశాల ద్వారా విన్నవించాల్సి వస్తున్నది. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో పనిచేసిన ఉదోగులుగా గౌరవంగా బతికిన వారు నేడు చికిత్సకు కూడా డబ్బులు లేక అరిగోస పడాల్సి వస్తున్నది. మరికొందరైతే తల్లిదండ్రులకు సరైన వైద్యం అందించలేక ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అవస్థను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుంది.
డబ్బులు లేవు అంటున్న సర్కార్‌కు మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్లు, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు, ప్రపంచ అందాల పోటీలు, మెస్సీ ఫుట్‌బాల్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేస్తూ కోట్లాది రూపాయలు అప్పులు తెస్తున్నారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఎందుకు లేవు? ఈ నేపథ్యంలో సమస్యల సాధనకు టీజీఈజేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. గత నెల 17న నిరసన ప్రదర్శనలు చేపట్టింది. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు నిర్వహించింది.
రిటైర్డ్ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నింది. మే 2న ఉద్యోగుల జేఏసీతో చర్చల సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడానికి 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని సీఎం చెప్పారు. పీఆర్సీ రిపోర్టు తక్షణమే తెప్పించుకుంటామని, ఉద్యోగుల, పెన్షనర్లకు జూన్ 1 నుంచి హెల్త్ కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీతో సమావేశం నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. మరి ఏప్రిల్ 2026లో రూ.1,000 కోట్లు పెండింగ్ బిల్లులు కింద చెల్లించామని చెప్పారు కదా? ఆ వెయ్యి కోట్లు ఎవరెవరికి చెల్లించారు? దీనిపై శ్వేతపత్రం తక్షణం విడుదల చేయాలి. రూ.1,000 కోట్లలో సర్వీసులో ఉన్న వారికి రూ.500 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.500 కోట్లు అని ప్రకటించారు. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు రెండున్నరేండ్లయినా చెల్లించకపోవడం దారుణం. జడ్పీ జీపీఎఫ్ ఉన్నవారికి 2025 అక్టోబర్ వరకు చెల్లించకపోవడం అన్యాయం. సర్కార్ వైఖరి తీవ్ర అభ్యంతరకరం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ 25 నెలలుగా చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు అప్పులు తీర్చలేక మానసిక వేదన, అనారోగ్యంపాలై చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రిటైరైన 22,000 మందిలో బకాయిలు రాని దాదాపు 18,000 మంది కుటుంబాలను కాపాడాలని కోరుతున్నాం.
కొంతమంది పెన్షనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారికి పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం కోర్టు ధిక్కరణ అవుతుంది. కనుక జూన్ 10-15 లోపు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, కోర్టుకు రాని వారితో సహా ప్రతి ఒక్కరికీ ఏకమొత్తంలో అన్ని బకాయిలు చెల్లించాలని బాధిత పెన్షనర్ల సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం డీఎస్ నకార కేసులో 1982 డిసెంబర్ 17న ఇచ్చిన తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు’ అని ప్రభుత్వం గుర్తించాలి.
– (వ్యాసకర్త: రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు) దేవదాస్ కందుకూరి 994993774