‘సీఎం’ అంటే ఎవరైనా చీఫ్ మినిస్టర్ అనే చెప్తారు. కొన్ని సినిమాల్లో ‘కామన్ మ్యాన్’ అనే నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. అయితే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ‘సీఎం’ అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారు, అదే ‘చిల్లర మనిషి’. అవును, ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూలకు వెళ్లి అడిగినా ఆయనను అదే అంటున్నారు. ఆ మాటకొస్తే దేశం మొత్తం మీద రాజకీయ నాయకులు మొదలు సామాజిక విశ్లేషకులు సైతం అదే మాట అంటున్నారు. దీనికి కారణం ఆయన నోటి దురుసు మాత్రమే. ఈ ఘనమైన పేరును తనకు తాను తెచ్చుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను మసకబారేలా చేశారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి.
సాధారణ సమావేశం, పబ్లిక్ మీటింగ్, ప్రెస్‌మీట్, చివరికి అసెంబ్లీలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. చిల్లర మాటలు మాట్లాడుతూ, అడ్డగోలు బూతులు వాడుతూ సాక్షాత్తు సీఎం అనే సంగతిని మరిచి ఇష్టారీతిలో ఎవర్ని పడితే వాళ్లను, ఎంతంటే అంత మాట అంటూ పైశాచికానందాన్ని పొందుతున్నారు. అయితే, ఈ క్రమంలో వ్యక్తిగా.. తను మరింత దిగజారడమే కాదు, 125 ఏండ్ల చరిత్ర కలిగి జాతీయపార్టీ నుంచి ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా దిగజారుతున్న కాంగ్రెస్‌ను ఇంకా ఇంకా దిగజారుస్తున్నారు.
‘పేగులు మెడలేసుకుంటా’, ‘లాగులో తొండలొదులుతా’, ‘లాగులూడదీసి కొడతా’, ‘బట్టలూడదీసి కొడతా’, ‘బద్మాష్ గాళ్లు’, ‘పందికొక్కులు’ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా రాయలేని భాషలో తిట్టిన బూతులు ఎన్నో ఉన్నాయి. ఇలా రాసుకుంటూ పోతే ఈ వ్యాసం మొత్తం ఆయన బూతులతోనే నిండిపోతుంది. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం ఆలోచించకుండా వాడిన భాష ఇది. ఏ పదవీ లేని వ్యక్తికి, సమాజంలో బాధ్యతాయుతంగా ఉన్న వ్యక్తికీ తేడా తెలియనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
అధికారం కోసం, తన సొంత కార్యకర్తలను, అమాయకులను ఉచ్చులోకి లాగడానికి వాడిన భాషనే, సీఎం అయ్యాక కూడా వాడుతున్నారు. అలా వాడిన ఏకైక సీఎం కేవలం రేవంతే అయ్యుంటారు. స్వయాన విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్ తన భాషను రాష్ట్రంలోని విద్యార్థులందరూ వింటారనే కనీస సోయి లేకుండా నడుచుకుంటున్నారు. రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా పోతుందనే బాధ ఏ మాత్రం తనకు లేకుండా రోజురోజుకు దిగజారి మాట్లాడుతుండటం రాష్ట్ర ప్రజలను విస్మయపరుస్తున్నది.
అయితే, తన పరువు పోతున్నా రేవంత్ బూతు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే అతనిలోని నిస్పృహను ప్రస్ట్రేషన్ను సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలుచేస్తామని మొత్తంగా 420 హామీలు ఇచ్చి, బీఆర్ఎస్ నాయకులపై బూతు భాష వాడి, ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారనే నిజం రేవంత్‌కు తెలుసు. ఇప్పుడు ఆరు గ్యారెంటీల హామీలను ఎందుకు నెరవేర్చలేదనే చర్చ సమాజంలో జరగకుండా చేయాలంటే తన నోటి దురుసుతోనే సాధ్యమని రేవంత్ నమ్ముతున్నాడు. దానికి తోడు తన మంత్రివర్గ సహచరులే సీఎంగా గుర్తించకుండా చిన్నచూపు చూస్తుండటం, ఏకంగా పత్రికా ముఖంగా, లేఖల ద్వారా ఆయనను తూలనాడుతుంటే ఆ ప్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఈ బూతు భాషను వాడుతున్నాడని చిన్నపిల్లాడికి సైతం అర్థమవుతున్నది.
అయితే, ఇలా ఎన్నాళ్లు నెట్టుకురాగలుతాడనేది కనీస విశ్లేషణ చేసుకుంటున్నట్టుగా కనబడటం లేదు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయ్యాయి. 40 శాతం తన పాలనా కాలం పూర్తయినా.. చెప్పుకొనే రేంజ్లో, ఇదీ తన ట్రేడ్‌మార్క్ అని ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదు. పై పెచ్చు హైడ్రా, భూభారతి వంటి తలతిక్క పథకాలతో ప్రజలను ప్రభుత్వమే పీల్చుకుతింటుందని ప్రజలు బహిరంగంగానే రేవంత్‌ను బండ బూతులు తిడుతున్నారు. ఇది కూడా రేవంత్ తీసుకొచ్చిన ఘనమైన మార్పే అని యావత్ దేశంలో చర్చించుకుంటున్నారు.
ఇదిలా కొనసాగుతున్న తరుణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెరమీదికి వచ్చాయి. ఆ ప్రాంత నివాసిగా, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా అక్కడి ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాకు జూబ్లీహిల్స్ ప్రజలు బహిరంగంగా కైంప్లెంట్స్ చేస్తున్నదిప్రధానంగా ఈ బూతులపైనే. ‘ఆయనేం మనిషండి, సీఎం స్థాయిలో ఉండి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారు’ అని వాళ్లు ఆక్షేపిస్తున్నారు.
సినిమా వాళ్లు కూడా సెన్సార్ ముందు వాడలేని బూతులను ఈయన ఏకంగా ప్రచారంలో వాడుతున్నాడని మండిపడుతున్నారు. తమ మనసులను చూరగొనాలంటే, పనితనంతో చేయాలి, అభివృద్ధిని అందిస్తూ, సంక్షేమాన్ని కొనసాగిస్తూ చేయాలి కానీ అవేవీ లేకుండా కేవలం చిల్లర మాటలతో రెచ్చగొట్టి ఓట్లేయించుకోవడం ఉప ఎన్నికలో ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు అక్కడి అభ్యర్థి మాటలతో ఆగడం లేదు, తన సహజశైలిలో చేతలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు.
ఒకవేళ ఈ చిల్లర మాటలకు, ఆ చేతలకు ఓట్లేసి గెలిపిస్తే రేపు యావత్ రాష్ట్రం, దేశం మమ్మలను చూసే చూపులను తట్టుకోలేమని చెప్తున్నారు. ఇది జూబ్లీహిల్స్‌లో స్పష్టంగా కనిపిస్తున్న తీరు. అందుకే నాయకుడనేవాడు ఆదర్శంగా ఉంటేనే ప్రజలు అనుసరిస్తారు, మెచ్చుకుంటారు. దాన్ని వదిలేసి కేవలం బూతులనే నమ్ముకుంటే వాళ్లు కూడా అదే చేసి చూపిస్తారు, కర్రు కాల్చి వాత పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. ఇదే నవంబర్ 14న మనకు అవగతమయ్యే సత్యం. కనీసం ఇకనుంచైనా హుందాగా, తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడే మంచి గుణాన్ని మా సీఎంకు ప్రసాదించమని దేవుడిని వేడుకోవడం తప్ప మానవ మాత్రులం మనమేం చేయగలం చెప్పండి.
– (వ్యాసకర్త: సినీ దర్శకులు, రాజకీయ విశ్లేషకులు)
బందూక్ లక్ష్మణ్ 90119 66666