తెలంగాణ మేమే ఇచ్చామనే కాంగ్రెస్ నాయకులకు ఒకే ప్రశ్న! ఉద్యమాలు రాజుకున్నపుడు తప్ప లేనపుడు ఎన్నడైనా తెలంగాణ మాట ఎత్తారా? మీ రాజకీయ అవసరానికి తప్ప చిత్తశుద్ధితో కొట్లాడారా? ఉప ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడగొట్టి.. పీకల మీద కత్తి పెడితే తప్ప తెలంగాణ ఇచ్చారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే జవాబు. లేదు! ఒక్కనాడు బరిగీసి కొట్లాడని నాయకులు ఇప్పుడు మేమే తెచ్చామంటూ సొల్లు కబుర్లు చెప్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలో సమాజం ఏకతాటి మీద నిలబడి కొట్లాడకుంటే.. ఈ భ్రష్ట కాంగ్రెస్ ఇంకో వందేండ్లకూ రాష్ర్టాన్ని ఇచ్చేదే కాదు. అదే సమయంలో ఉద్యమం రాజుకున్నపుడల్లా వాడుకొని ఎన్నికలు కాగానే వదిలేసేది. గత చరిత్ర అంతా ఇంతే!
ఎవరైనా నా బర్త్‌డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి వెంటనే దాన్ని వాపస్ తీసుకుంటే ఆ మోసాన్ని ఏమంటారు? దాన్ని డిసెంబర్ 9 మోసం అంటారు. నిజానికి తెలంగాణ సమాజానికి డిసెంబర్ 9 ప్రకటన సోనియా గాంధీ తన బర్త్‌డే నాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ కంటే శాపంలా మారింది. ఆరు దశాబ్దాల కల సాకారం అవబోతుందన్న సంతోషంలో ఉన్న ప్రజలతో ఒక వికృత పరిహాసం ఆడింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్దాల ప్రజాస్వామిక ఆకాంక్ష, సీమాంధ్ర నాయకుల మూకుమ్మడి రాజీనామాలు తమకు ఈక కంటే తేలిక అని తేల్చి చెప్పి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మళ్లీ మొదటికి తెచ్చింది.
ఎన్నికల చుట్టూనే కాంగ్రెస్ కసరత్తులు!
2009, డిసెంబర్ 9న గెలుచుకున్న తెలంగాణను డిసెంబర్ 23న పోగొట్టుకున్న ఫీలింగ్ అప్పటి తెలంగాణ సమాజంలో యాక్టివ్‌గా ఉన్న అందరికీ ఇప్పటికీ కళ్లెదుట ఉన్నట్టే ఉన్నది. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో డిసెంబర్ 9 ప్రకటన చేస్తున్నానన్న కేంద్ర హోంమంత్రి చిదంబరమే డిసెంబర్ 23న మారిన పరిస్థితుల దృష్ట్యా సంప్రదింపులు అంటూ మళ్లీ ఒకసారి తెలంగాణను అటకెక్కించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అప్పటికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది. ఎన్నికలకు ఇంకో నాలుగేండ్ల టైం ఉన్నది. అదీ కాంగ్రెస్ ధీమా. తెలంగాణ అంశం ఎన్నికల్లో రాజుకుంటుంది, ఓట్లకు కీలకమవుతుంది కాబట్టి మ్యానిఫెస్టోలో పెడతారు. కానీ, ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు వినిపించిన అభిప్రాయాలను మాత్రం వారి రాజకీయ ప్రయోజనాల అధీనంలోనే ఉంచింది కాంగ్రెస్.
అంతా ఆంధ్రాధీనం..
ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఇంకోటి ఉన్నది. కాంగ్రెస్‌లో తెలంగాణ నాయకత్వం ఉన్నది పేరుకే. వీళ్ల మాటకు పార్టీలో పూచిక పుల్ల విలువ కూడా ఉండదు. మలిదశ ఉద్యమ సందర్భంలో, కాంగ్రెస్‌లో కూడా కొందరు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వారి వారి పరిమితుల్లో సోనియా దగ్గర చేసిన లాబీయింగ్ కొన్నిసార్లు ఫలించినా, ఎక్కువసార్లు ఆంధ్రా లాబీయింగ్దే పైచేయి అయ్యింది. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్న చర్చ తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందనే. అంటే కాంగ్రెస్ ఒక పార్టీగా తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయనే కానీ, కొందరు వ్యక్తుల సహాయాన్ని, తపనను బేరీజు వేయడం కాదు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఉత్తరం రాసినా అది సీరియస్‌గా ముందుకుపోలేదు, కమిటీల సాలెగూటిలో చిక్కుకొని కొట్టుకుంటూ ఉండిపోయింది. 2001లో 41 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు సోనియాగాంధీకి తెలంగాణ ఇవ్వాలని కోరుతూ ఉత్తరం రాస్తే అది చిన్న రాష్ర్టాల గురించి చర్చించడం కోసం ఏర్పాటైన కమిటీ పేరిట అటకెక్కింది. ఆంధ్రాతో తెలంగాణను కలిపేసిన మొదటి కమిటీలో ఉన్న దిగ్గజాలు నెహ్రూ, లాల్ బహదూర్‌శాస్త్రి, థేబర్, కే ఎన్ కట్జూల నిర్ణయంతో తెలంగాణ భవిష్యత్తు సీల్ చేసిన కాంగ్రెస్, చివరి దశలో కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ లాంటి కమిటీలే వేసింది ఆరు దశాబ్దాల పరాధీనతకు కారణం కాదా? కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సి ఉంటుంది.
స్తబ్ధుగా ఉంటే గుర్తుకే రాదు!
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మాత్రమే కాంగ్రెస్‌ను ప్రతీసారి మెడలు వంచిందే తప్ప, ఉద్యమం స్తబ్ధుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్కసారి కూడా తెలంగాణను, అప్పుడప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయం ఎత్తిన తెలంగాణ శాసనసభ్యుల ఫోరమ్, తెలంగాణ కాంగ్రెస్ ఫోరమ్ వంటి వేదికలు చేసిన ప్రయత్నాల్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. అందుకే రెండవ ఎస్సార్సీ ఏర్పాటు చేయడం తమ పార్టీ అంగీకరించదని మాజీ హోం మంత్రి అద్వానీ చెప్పగానే, ఊరుకున్నారు తప్ప ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే టీఆర్ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్‌కు తెలంగాణ అంశాన్ని యాక్టివ్‌గా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పద్నాలుగేండ్ల చోద్యం..
తెలంగాణ గురించిన చర్చ 2001లో మొదలైనప్పటి నుంచి సోనియాగాంధీకి ఈ విషయం తెలుసు. 2004 ఎన్నికల్లో తెలంగాణ పట్ల సానుకూల వైఖరే చంద్రబాబును ఓడించి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి కారణమైంది. కామన్ మినిమం ప్రోగ్రాం, రాష్ట్రపతి ప్రసంగం వంటి చర్యల పర్యవసానం ఏమిటి? మళ్లీ 2009లో ప్రజా ఉద్యమం, కేసీఆర్ నిరాహార దీక్షలు మాత్రమే సోనియా ముందుకు తెలంగాణను తెచ్చాయి. మరి 2001 నుంచి 2009 వరకు తొమ్మిదేండ్లు, 2009 నుంచి 2014, అంటే మొత్తం 14 ఏండ్లు సోనియా చోద్యం చూసిందే తప్ప, తెలంగాణను సాకారం చేయలేదు. 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ మొండి వైఖరి నాలుగేండ్లు కొనసాగితే సోనియా ముందు తెలంగాణ వ్యవహారం 14 ఏండ్లు నానింది. అందుకే 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చింది బర్త్ డే గిఫ్ట్ అన్నప్పుడు ఒక మోసపూరిత మాటలాగ తోస్తుంది. కాంగ్రెస్ వాళ్లయితే ఇచ్చింది సోనియానే కదా ఆమె తలుచుకోకుంటే తెలంగాణ సాకారం అయ్యేదా? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్టు అనిపిస్తుంది.
తప్పక ఇచ్చిందే తప్ప.. ప్రేమతో కాదు
తెలంగాణ ప్రజల నిరంతర పోరాటం, కొన్నిసార్లు ఉవ్వెత్తున కొన్నిసార్లు స్తబ్ధుగా కొనసాగి సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ ముందు తెలంగాణకు ఎస్ చెప్పాల్సిన పరిస్థితిని కల్పించింది తప్ప ప్రజల ఆకాంక్షలపై గౌరవం ఉండి కాదు. ఇదే మాట, ‘ఒక ఓటు, రెండు రాష్ర్టాలు’ అన్న నినాదం ఇచ్చిన బీజేపీ, ’రెండు కండ్ల సిద్ధాంతపు’ తెలుగుదేశం అందరికీ వర్తిస్తుంది. ఈ పార్టీలకు నిజంగానే గౌరవం ఉండి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో సాకారమయ్యేది.
ఆ బలి దానాలకు కారణమెవరు?
మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు ఒక విషాదకర సన్నివేశంగా మారడానికి ఇంతకాలం తాత్సారం చేసిన కాంగ్రెస్ జవాబుదారీనా? కాదా? చెప్పాలి. ఎందుకంటే ప్రజలను ఉర్రూతలూగించి ఉద్యమించడానికి ఆక్సిజన్‌గా ఉన్న ఆశావహ పరిస్థితులు తగ్గినప్పుడల్లా, తెలంగాణ వస్తుందో రాదో అనే నిరాశ సమాజాన్నే డిప్రెస్ చేసింది, కుంగదీసింది. దాని ఫలితమే ఆత్మహత్యలు. మేము ఇస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పే కాంగ్రెస్ సుమారు 1500 బలిదానాల బాధ్యతను ఎవరి ఖాతాలో వేయాలో చెప్పాలి.
చివరిరోజుల్లో కూడా అదే తంతు
శ్రీకృష్ణ కమిటీ ఇంకో కాలయాపన తంత్రం. అదిచ్చిన రిపోర్టు కూడా తెలంగాణ వ్యతిరేకుల ఇన్‌ఫ్లుయెన్స్‌లో రాసినట్టుంది తప్ప నిజాయితీతో కూడింది కాదు. ఈ కమిటీ నిజానికి కాంగ్రెస్‌కు తెలంగాణ సమస్యను కొంతకాలం పోస్టుపోన్ చేయడానికే ఉపయోగపడింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో తెలంగాణకు అనుకూలంగా లేకపోవడమే కాదు, ఒక అడుగు ముందుకుపోయి ఉద్యమాన్ని అణచివేసే పద్ధతులను సూచించింది.
గోచీలు గల్లంతవుతాయనే…!
చివరగా 2013 జూలైలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ నుంచి రాజీనామా పరంపరలే కారణం. కే కేశవరావు, మంద జగన్నాథం వంటి వాళ్లు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం కాంగ్రెస్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఆలస్యం చేస్తే గోచీ గుడ్డ కూడా మిగిలేలా లేదని తేటతెల్లం కావడం వల్లనే జ్ఞానప్రాప్తి కలిగి తెలంగాణ నిర్ణయానికి తలొగ్గింది. తెలంగాణ బిల్లును చర్చించడానికి రాష్ట్రపతి పంపినప్పుడు తెలంగాణపై చర్చను కంట్రోల్ చేయడానికి శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తప్పించి ఆంధ్రకు చెందిన మంత్రి సాకే శైలజానాథ్‌కు ఆ శాఖను ఇచ్చినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని నిలదీసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒక్కడూ లేడు. శ్రీధర్‌బాబు సమైక్యాంధ్రను సమర్థిస్తూ, కిరణ్‌కుమార్‌రెడ్డికి మంచి అనుయాయిగా ఉన్నా కాంగ్రెస్ ఇచ్చిన కరెక్ట్ బహుమతి ఇది.
ఎన్నికల భయం వెంటాడి..
2014 ఎన్నికలు రాబోతున్న తరుణంలో 2009 నుంచి ఎదిరించి నిలిచిన తెలంగాణ ముందు తలొగ్గి తప్పనిసరి పరిస్థితిలో 2013 నుంచి ప్రక్రియ మొదలైంది తప్ప ప్రజాస్వామిక ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ కాదు. అందుకే తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ అనుకుంది కాబట్టి అయిందని కాంగ్రెస్, మేము సమర్థించినందుకు వచ్చిందని బీజెపీ గొప్పలు చెప్పుకున్నా చరిత్ర వారి పక్షాన నిలవదు. అన్నింటినీ మించి సోనియానే తెలంగాణ ఇచ్చిందని చెప్పుకొని ఓట్లు అడుక్కునే ముందు, తెలంగాణ ఏర్పాటుకు ఇన్నేండ్లు ఎందుకు పట్టిందో జవాబు చెప్పాలి. తెలంగాణ ఒకరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదు. తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాలు, ప్రత్యేక తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్ వంటి రాజకీయపార్టీలు, విశాల ప్రజారాశులకు ప్రతినిధులైన సంస్థల నిరంతర పోరాటమే తెలంగాణను తెచ్చింది. ఇదే చరిత్ర చెప్పే సత్యం.