పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామీణ పాలన స్తంభిస్తే దేశాభివృద్ధి కుంటుపడినట్టే. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఎక్కడ ఓటమి చెందుతామోనన్న భయంతో రెండేండ్లు స్థానిక పాలన లేకుండానే నెట్టుకొచ్చారు. ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ధైర్యం చేసింది. అయితే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సంపూర్ణంగా గెలుస్తామన్న నమ్మకం ఎక్కడా కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బలపరిస్తే చాలు, బీ-ఫామ్ వస్తే చాలు గెలిచేయవచ్చనే భరోసా ఉండేది. కానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆ ఆత్మవిశ్వాసం అధికార పార్టీ నేతల్లో కనిపించడం లేదు.
కాంగ్రెస్ ‘మార్పు’ నినాదం జనాల్లో పలుచబడింది. అందుకు తాజా ఉదాహరణ నారాయణపేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం ఖాళీ కుర్చీలతో జరగడమే. మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదనలో పడి సామాన్య ప్రజల విలాపణలు, విన్నపాలు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. యెన్నం చెప్పినట్టు ఎమ్మెల్యేల పని అయిపోయింది. ఇటీవలి మక్తల్ సభలో ప్రజల తీరుపై స్వయంగా మంత్రి అలిగారు. మున్ముందు సీఎం ప్రజలతో మాట్లాడాలంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, పార్క్‌ల దగ్గర మైకులు పట్టుకొని మాట్లాడే దుస్థితి రావడం ఖాయం. ఎందుకంటే, ఆనాటి పాలన అన్న కాంగ్రెస్ నిజంగానే రెండేండ్లలో నాటి ఉమ్మడి రాష్ట్ర పాలనను నేటి తరానికి పరిచయం చేసింది. యూరియా కొరతతో రైతులు లైన్లలో చెప్పులు పెట్టడం, సొసైటీల దగ్గర రాత్రింబవళ్లు పడిగాపులు కాయడం అందుకు నిదర్శనం.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పదేండ్లలో గ్రామస్వరాజ్యం అంటే ఏమిటో చేసి చూపించారు. తన 40 ఏండ్ల ప్రజాజీవిత అనుభవాన్ని ఉపయోగించి, పల్లెలను ప్రగతిబాట పట్టించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన యువకుడిని.. ‘నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావు?’ అని అడిగితే ఏమేం చెప్తాడో, అవన్నీ కేసీఆర్ చేసి చూపించారు.
గ్రామాభివృద్ధి ఎలా చెయ్యాలో ప్రాక్టికల్‌గా చేసి, తెలంగాణ పల్లెలను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపారు. పంచాయతీరాజ్ శాఖకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన మెజారిటీ అవార్డులే అందుకు నిదర్శనం. ఊరూరికి డబుల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపుల చెట్లు, నర్సరీ, పల్లె ప్రకృతివనం, రైతు వేదిక, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పంచాయతీకో ట్రాక్టర్, చెరువుల్లో పూడికతీత, మిషన్ భగీరథ నీళ్లు, 24 గంటల కరెంట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ అందించారు. ప్రతీ ఊరి పొలిమేర దగ్గర ఆ ఊరి బోర్డు నుంచి శ్మశానవాటిక వరకు ప్రతీది చేసి చూపించారు.
ఒక నాయకుడు తన ప్రజల కోసం, ప్రాంతం కోసం ఏమేం కలలు కంటాడో అన్నింటిని ఒక్కొక్కటిగా కేసీఆర్ చేసి చూపించారు. కానీ, రేవంత్‌రెడ్డి వచ్చాక పల్లెల్లో పాలన పడకేయడం కాదు, ఏకంగా పాడెక్కింది. కేసీఆర్ గ్రామాల్లో సృష్టించిన ఆస్తుల నిర్వహణ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి రావడం లేదు. మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన మార్పు పథకాల పేర్లు మార్చడమే, హరితహారాన్ని వన మహోత్సవం, రైతుబంధును రైతుభరోసా చేసిల్లు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఇందిరమ్మ ఇల్లు, అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిర క్యాంటీన్ చేసిల్లు. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిని చేసిల్లు.
గ్రామాల్లో కేసీఆర్ శాశ్వత అభివృద్ధి చేసి చూపారు. ఎన్నో ఆస్తులు నిర్మించారు. కానీ, ట్రాక్టర్లో డీజిల్ పోయలేకపోతున్నారు. మొక్కలకు నీళ్లు కొట్టడం లేదు. పల్లె ప్రకృతివనాలను నిర్వహించడం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, దోమలమందు కొట్టే దిక్కు లేదు. మోటర్ చెడిపోతే ప్రజలు చందాలు వేసుకొని బాగుచేసుకుంటున్నారు. వీధి దీపాలకు పంచాయతీ కార్యదర్శులు సొంత సొమ్ము పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామాలు పొక్కిలి పొక్కిలి అవుతున్నాయి. ఒకప్పుడు గ్రామాలకు వెళ్తే ఇరువైపుల చెట్లు ఉండేవి. ఇప్పుడు చెత్తకుప్పలు దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పల్లె ప్రజలు ఆలోచించండి. ముఖ్యమంత్రినే దొంగను చూసినట్టు చూస్తున్నారట, చెప్పులు ఎత్తుకపోయే వాడిలా చూస్తున్నారట. అప్పులు కూడా పుట్టడం లేదని వారే స్వయంగా సభాముఖంగా ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు గ్రామాలకు నిధులు ఎలా వస్తాయి? మళ్లొచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు గెలిచినవాళ్లు రెండేండ్లు ఉంటారు. కాబట్టి, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. కనీసం అప్పుడైనా అభివృద్ధి అవుతుది. ప్రస్తుతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ప్రతిపక్షం బలంగా ఉండి, ఈ మూడేండ్లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తది.