ఉమ్మడి రాష్ట్ర పాలనలో సాగునీరు, విద్యుత్తు, పెట్టుబడి సమస్యలతో రైతు జీవితమే సంక్షోభంలో చిక్కుకున్నది. అప్పుల భారంతో అనేక కుటుంబాలు కుదేలయ్యాయి. రైతుల ఆత్మహత్యలు ఒక సామాజిక విషాదంగా మారాయి. ప్రత్యేక తెలంగాణ సాధనతో ఈ పరిస్థితులు మారుతాయని రైతాంగం విశ్వసించింది. అందుకే ఉద్యమంలో రైతులు ముందువరుసలో నిలిచారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమైన తర్వాత ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పాటయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్ఎస్ ఎజెండాగా మారాయి. రైతు కేంద్రీకృతంగా కేసీఆర్ పరిపాలన జరిగింది. అనేక విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థకు అంతం పలికారు. నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించారు.
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులలో పూడిక తీసి నీటి సామర్థ్యాన్ని పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా 9 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక పంటల దిగుబడి సాధించిన రాష్ట్రంగా నిలిచింది. 2014లో అన్ని రకాల పంటల దిగుబడి 1.07 కోట్ల టన్నులు కాగా 2023 వరకు నాలుగు రెట్లు పెరిగి 4. 65 కోట్ల టన్నులకు పెరిగింది. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే అవస్థ తప్పింది. రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు ఇచ్చే అవకాశం వచ్చింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం సంక్షోభం నుంచి విముక్తి పొందింది.
కేసీఆర్ పాలనలో రైతుబంధు 11 దశలలో రూ.73 వేల కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసింది. 2023లో యాసంగి రైతుబంధు జమ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులకు సాయం అందకుండా అడ్డుకొన్నారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు హామీలు ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పేరును కాంగ్రెస్ పాలకులు రైతుభరోసా అని మార్చారు. ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీపై మాట తప్పారు. ఎన్నికలు కాగానే రైతులకు యాసంగి పంటకు రూ.7,500 ఎకరానికి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.5000 వేలకు కుదించి, నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. 2024 వానకాలంలో పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగి లో 148 లక్షల ఎకరాలకు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం మూడు ఎకరాల వరకు ఉన్న 84 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. 2025 వానకాలంలో స్థానిక ఎన్నికలు ఉండటంతో సాయం అందింది. 2025 యాసంగి, వానకాలం కేవలం మూడు ఎకరాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతులకు రూ.55,800 కోట్లు ఇవ్వాల్సి ఉన్నది. కానీ రైతులకు అందింది కేవలం రూ.27,080 కోట్లు మాత్రమే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడిన మొత్తం రూ.28,720 కోట్లు. 2026 వానాకాలం అందరికీ రైతుభరోసా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా రైతులకు ప్రభుత్వంపై నమ్మకంలేదు.
అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కాంగ్రెస్ పాలకులు 30 నెలలుగా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ నాయకులు ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన సీఎం, ఎదురుదాడికి దిగడం ఏమిటి? ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీపై మాటతప్పి, ఇప్పుడు గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. రెండు లక్షల పైన అప్పు ఉంటే మిగతా మొత్తం కడితేనే మాఫీ చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2014, 2018లో రెండు విడతల్లో రూ.29,144 కోట్లు రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్ధం. ప్రభుత్వ లెక్కల్లో సగం కూడా ఖర్చు పెట్టకపోవడం వాస్తవం. బడ్జెట్లో కేటాయించని డబ్బును ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావు నిలదీస్తే, ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది.
2026 జూన్ 30న ముఖ్యమంత్రి రైతు భరోసా పూర్తిగా ఇవ్వకపోవడానికి కారణాలు అప్పులే అని మళ్లీ అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు చెల్లించినందువల్లే రైతులకు రైతుభరోసా ఇవ్వలేదు అని చెప్పడం బాధ్యతారాహిత్యం.
రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసింది. అందుకే కాంగ్రెస్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ను దూరం చేసుకొని తప్పు చేశామని చెప్తున్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం తప్ప మరో మార్గం లేదు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. రైతు సంక్షేమం అంటే రాజకీయ ప్రయోజనాల కంటే గొప్పదనే విషయం కాంగ్రెస్ పాలకులు గుర్తించాలి. రైతుకు ద్రోహం చేస్తే సమాజం మొత్తాన్ని వంచించినట్టే. ఇప్పటికే కాంగ్రెస్ ప్రజాకంటక పాలనకు కర్రుకాల్చి వాతపెట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. రైతన్నకు ద్రోహం చేసిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోకతప్పదు.
(వ్యాసకర్త: రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-దేవీప్రసాద్