ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. గెలిచాకే తెలుస్తుంది అసలు విషయం. ఆర్థిక పరిస్థితి అడ్డు తగులుతుంది. హామీలిచ్చినప్పుడు ఈ విషయం తెల్వదా అంటే తెలుసు, కానీ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు అమలు చేయమంటే ఎగవేతలు, కోతలు, కొర్రీల ఫార్ములాను ఫాలో అవుతున్నది. అదిగో, ఇదిగో అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నిన్నమొన్ననే వచ్చినట్టు దబాయింపులకు దిగుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల నిలుపుదలపై చూపిన శ్రద్ధను.. తాము అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీల అమలులో చూపడం లేదు. రైతాంగానికి ఇచ్చిన హామీల అమలును పూర్తిగా గాలికొదిలేసింది. వరంగల్ నడిబొడ్డున రైతు డిక్లరేషన్లో ఏకకాలంలో రూ. 40 వేల కోట్లు మాఫీ చేస్తామని చివరకు రూ.22 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని నమ్మక ద్రోహం చేసింది. వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చివరికి ధాన్యం కల్లాలకు చేరేసరికి సన్నవడ్లకు మాత్రమే బోనస్ అంటూ దానిని బోగస్ హామీగా మార్చేసింది.
దేశంలోనే తొలిసారి ‘రైతుబంధు’ పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ నిపుణుల ప్రశంసలందుకున్నది. 11 విడతల్లో ఏకంగా రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసి వారి కండ్లలో వెలుగులు నింపింది. ఆ తర్వాత ఈ పథకం కేంద్రానికి, దేశంలోని ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకమైంది. లక్షల ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు పెట్టుబడి సాయం కూడా ఇవ్వడంతో రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కేసీఆర్ రూ. 10 వేలు ఇస్తే, తాము రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. ఇస్తామన్నది ఇవ్వకపోగా, కేసీఆర్ ఇచ్చిన రూ. 10 వేలు కూడా ఇవ్వకుండా రైతులను గోసపెడుతూ, రాష్ర్టాన్ని క్రమంగా విధ్వంసం వైపు నడిపిస్తున్నది.
కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా చేసిన భూసంస్కరణలతో ప్రభుత్వ అధికారులే భూములను సర్వే చేసి పేదల భూములు పేదలకు ఇప్పించి పట్టా పాసుబుక్కును ఉచితంగా అందించారు. ఒక బృహత్కార్యం చేస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు సహజం. కానీ, వాటిని భూతద్దంలో చూడటం ఇంకా పెద్ద తప్పు.
గతంలో గెట్టు పంచాయతీల వల్ల ఎన్నో కుటుంబాలు నిలువునా చీలిపోయాయి. హత్యలు జరిగాయి. దీనికి భూ రికార్డుల్లో ఉన్న లోపాలే అసలు కారణం. ఏ భూమి ఎవరిదో తెలియదు, పట్టా ఒకరికి ఉంటే, సాగు మరొకరు చేస్తూ ఉండే. అందుకు ఉదాహరణ మా కుటుంబమే. తెలంగాణ రాక మునుపు మాకున్న 2.3 గుంటల భూమి ఎవ్వలి పేరు మీదున్నదో కూడా తెల్వదు. కానీ కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా చేసిన భూసంస్కరణలతో ప్రభుత్వ అధికారులే భూములను సర్వే చేసి మా భూమిని మాకు ఇప్పించి పట్టా పాసుబుక్కును ఉచితంగా అందించారు. ఒక బృహత్కార్యం చేస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు సహజం. ధరణిలో కూడా అక్కడక్కడా ఒకటో, అరో తప్పులు జరిగి ఉండవచ్చు. కానీ లక్షలాది మంది బీదాబిక్కీ రైతులకు ఈ ధరణి బాసటగా నిలిచింది. చిన్న చిన్న తప్పులను బూచిగా చూపి ధరణిపై విమర్శలు చేసిన రేవంత్.. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నానా హంగామా చేసి ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పేరుతో కిందామీదా చేసింది తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదనేది రైతులు, భూ చట్టాల నిపుణులు, రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.
రైతు భరోసా అమలు విషయంలో అభిప్రాయ సేకరణ, మంత్రివర్గ ఉపసంఘం పేరుతో డ్రామాలాడి కాలాన్ని ఎల్లదీసిన సర్కారు ఎట్టకేలకు రైతు భరోసాను రూ.12 వేలతో సర్ది పెట్టుకొమ్మని తేల్చేసింది. అది కూడా ఎంపిక చేసిన గ్రామాలకు మాత్రమే. రాష్ట్రంలోని రైతులందరికీ ఏక కాలంలో ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయాన్ని మార్చి 31 వరకు పొడిగించి కాలాన్ని సాగదీస్తూ రైతులను ఉసూరుమనిపిస్తున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసాను అమలు చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే రైతులు తమ ఓటుతో తప్పకుండా బుద్ధి చెబుతారు. తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలో విప్లవాత్మక మార్పుకు కారణమైన పంట పెట్టుబడి సాయం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైంది కాదు.
ఏ సంక్షేమ పథకం విషయంలోనైనా ఆలోచించవచ్చు, కానీ రైతుకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో ఇంత సంకుచితంగా ఆలోచించడం బాధాకరం. రైతు రాజ్యంగా ప్రకటనలు ఇవ్వడం కాదు.. ఆ స్థాయిలో చేతలు కూడా ఉంటే బాగుంటుంది. ఇచ్చిన రైతు భరోసా హామీని యథాతథంగా అమలు చేయాలి. లేని పక్షంలో రైతులకు క్షమాపణలు చెప్పాలి. రైతును శాసించే స్థాయికి తీసుకెళ్లకపోయినా పర్వాలేదు. కానీ మళ్లీ యాచించే స్థాయికి మాత్రం తీసుకెళ్లొద్దు.
– (వ్యాసకర్త: కేయూ విద్యార్థి నేత)
పిన్నింటి విజయ్ కుమార్ 90520 39109