2014, మార్చి 9.. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్.. కలం కవాతు సవ్వడితో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. జర్నలిస్ట్ జాతర పండుగకు జర్నలిస్టులు దండుగా కదిలివచ్చిన సందర్భం. దశాబ్దాల పోరాటం తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం కలం కార్మికులంతా ఏకమైన వేదిక అది. అప్పటివరకు 13 ఏండ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అంటూ ఉద్యమ బాటపట్టిన కలం కార్మికులు.. స్వరాష్ట్రంలో హక్కుల సాధన కోసం, ఫలాల కోసం దాదాపు పదివేల మందితో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా ఏర్పడటానికి ఒక్కటై తరలివచ్చిన మహాసభ అది.
రెండేండ్ల తర్వాతనైనా, స్టిక్కర్ల మీద స్టిక్కర్లు వేసుకున్న తర్వాతనైనా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం నూతన అక్రెడిటేషన్ల జారీ కోసం జీవో నం.252ను తీసుకురావడం అభినందనీయమే. అయితే, ఈ జీవోలోని కొన్ని నిబంధనల వల్ల ఇప్పటివరకు అక్రెడిటేషన్లు కలిగిన దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
నూతనంగా ఏర్పడబోయే 29వ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే సకలజనులతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం తన విజన్‌ను ప్రకటించడానికి అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఉద్యమంలో ముందు వరసలో ఉండి లడాయి చేసిన జర్నలిస్టులను మన రాష్ట్రంలో మనం గౌరవించుకుందామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇచ్చుకుందామని సగౌరవంగా ప్రకటించిన వేదిక అదే. అన్నమాట ప్రకారమే 2016లో 239 జీవో ఇచ్చి అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ బాధ్యతలిచ్చి జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని కేసీఆర్ సూచించారు. అప్పటివరకు డెస్క్ జర్నలిస్టులుగా ఉన్నవారికి అక్రెడిటేషన్ కార్డులు లేవు. కానీ, తొట్ట తొలిసారిగా బ్యూరోతోపాటు డెస్క్‌లో పనిచేసే వారిని కూడా వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించి అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతలో 18 వేల కార్డులతో ప్రారంభమై ప్రతి రెండేండ్లకు ఒకసారి పెరుగుతూపోయి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇచ్చుకున్న మొత్తం కార్డుల సంఖ్య ఎంతంటే అక్షరాలా 23 వేలు. మన జర్నలిస్టులకు కార్డులు ఇచ్చుకుంటే తప్పేందని ఆలోచించింది ఆ ప్రభుత్వం… ఇప్పుడు అందులో నుంచి సగం కోత పెట్టాలని జీవో 252 తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంత కోపం… ఎందుకంత అక్కసు?
ఇక రెండు కార్డుల విధానంపై అయితే జర్నలిస్టు సమాజం మండిపడుతోంది. బ్యూరో వాళ్లకు మీడియా అక్రెడిటేషన్ కార్డు, డెస్క్ వాళ్లకు మీడియా కార్డు పేరుతో ఈ రెండు కార్డుల విధానాన్ని తెచ్చి గందరగోళానికి తెరలేపింది సర్కార్. దేశంలో ఎక్కడా లేనివిధంగా మీడియా కార్డు పేరుతో ఒక నూతన కార్డు తెచ్చిన రాష్ట్రం తెలంగాణే. సంఖ్య విషయాన్ని పక్కనపెడితే ప్రతి రాష్ట్రంలో కూడా అక్రెడిటేషన్ కార్డులే ఉంటాయి. ఢిల్లీ స్థాయిలో కేంద్రం జర్నలిస్టులకుపీఐబీ కార్డులు జారీ చేస్తుంది. కానీ, ఎక్కడా లేని విధంగా మీడియా కార్డును ఇవ్వాలనుకోవడం ఏమిటో? ఎవరు ఆలోచించారో తెలియదు కానీ, జర్నలిస్టుల మధ్య విభజన రేఖ గీసి తమ పంతం నెగ్గించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉంది.
ఎందుకో తెలియదు గానీ, జర్నలిస్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందికర ధోరణిని అనుసరిస్తున్నది. అంతేకాదు, మీడియా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నది. మీడియా ఆధారంగా, మీడియా మద్దతుతో అధికార పీఠాన్ని అధిరోహించిన రేవంత్‌రెడ్డి నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ జీవోను బట్టి తెలుస్తున్నది. సమాచార శాఖ మంత్రి పొంగులేటికి సైతం ఈ జీవో గురించిన మొత్తం సమాచారం ఉందా? లేదంటే మీడియా అకాడమీ చైర్మన్, ప్రస్తుత అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఇదంతా చేస్తున్నారా? అనే చర్చ ప్రస్తుతం జర్నలిస్టు సమాజంలో తీవ్రంగా జరుగుతున్నది.
రెండేండ్ల తర్వాతనైనా, స్టిక్కర్ల మీద స్టిక్కర్లు వేసుకున్న తర్వాతనైనా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం నూతన అక్రెడిటేషన్ల జారీ కోసం జీవో నం.252ను తీసుకురావడం అభినందనీయమే. అయితే, ఈ జీవోలోని కొన్ని నిబంధనల వల్ల ఇప్పటివరకు అక్రెడిటేషన్లు కలిగిన దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
గతంలో అమలులో ఉన్న జీవో నం.239 ప్రకారం పెద్దపెద్ద పత్రికలకు 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, నలుగురు కెమెరామెన్లకు అక్రెడిటేషన్లు మంజూరు చేసేవారు. అయితే, ప్రస్తుత జీవో ద్వారా ఈ సంఖ్యను 12 కరస్పాండెంట్లు, 12 డెస్క్ జర్నలిస్టులు, 3 కెమెరామెన్లకు తగ్గించారు. జిల్లా స్థాయిలో కూడా ఈ తరహా కోత విధించారు. ఇదే విధంగా మధ్యస్థ స్థాయి పత్రికలకు కూడా అక్రెడిటేషన్లను భారీగా తగ్గించారు. ఇక శాటిలైట్ ఛానళ్ల విషయానికి వస్తే గత జీవో ప్రకారం 12 కరస్పాండెంట్లు, 12 డెస్క్ జర్నలిస్టులు, 12 వీడియో జర్నలిస్టులకు కార్డులు ఇచ్చేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య ఎనిమిది కరస్పాండెంట్లకు, ఎనిమిది డెస్క్ జర్నలిస్టులు (అది కూడా మీడియా కార్డు), 8 వీడియో జర్నలిస్టులకు కుదించారు. గతంలో కల్చరల్, స్పోర్ట్స్, సినిమా, కార్టూనిస్ట్ లాంటి వాళ్లకు ప్రత్యేక కార్డులు ఉండేవి. ప్రస్తుతం వాటి ఊసే లేదు.
ఇక కేబుల్ ఛానళ్ల విషయానికి వస్తే ఐ అండ్ పీఆర్ ద్వారా రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్లు మంజూరు చేసేవారు. ప్రస్తుతం వాటిని పూర్తిగా గుండు సున్నాకు పరిమితం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అలాగే, ప్రసారాలు జరుగుతున్న ప్రతి జిల్లాలో గతంలో 4 అక్రెడిటేషన్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకే జిల్లాలో 2 అక్రెడిటేషన్లు మాత్రమే ఇస్తామని పేర్కొనడం చాలామంది జర్నలిస్టులపై ప్రభావం చూపుతుంది. ఇంతకుముందు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు అక్రెడిటేషన్లు మంజూరు చేసేవారు. కానీ, నూతన జీవోలో వాటిని పూర్తిగా తొలగించారు. అదేవిధంగా, ఒక లక్ష జనాభా ఉన్న మండలానికి ఒక అక్రెడిటేషన్, అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే రెండవ అక్రెడిటేషన్ ఇచ్చే విధానం గతంలో అమలులో ఉండేది. ప్రస్తుతం జనాభా ఎంత ఉన్నా ఒక్క అక్రెడిటేషన్ మాత్రమే ఇచ్చేలా నిబంధన తీసుకురావడం అన్యాయం.
పదిహేను వేల కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న చిన్న పత్రికలకు కూడా తాజా జీవో వల్ల అన్యాయం జరిగింది. గతంలో నియోజకవర్గ స్థాయిలో ఇచ్చే కార్డు కాస్తా ఇప్పుడు నిలిచిపోయింది. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులన్న తేడా లేకుండా అందరినీ మీడియా అక్రెడిటేడెడ్ జర్నలిస్టులుగా గుర్తించే విధంగా, జర్నలిస్టుల ఉపాధి, గౌరవం, హక్కులను పరిరక్షించేలా జీవో నం.252ను సవరించాల్సి ఉంది.
విభజన రాజకీయాలకు స్వస్తి పలికి ఈ జీవోను సవరించాలి. 239 జీవో స్ఫూర్తితో మరింత మెరుగ్గా నూతన జీవోను తేవడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సరైన పరిష్కారం లభించే వరకు జర్నలిస్టులు ఉద్యమబాట వీడరు. తమ హక్కును తాము సాధించే దాకా పోరాటం కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో భాగంగా మొదటగా ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన గళం వినిపించడానికి జర్నలిస్టులు సంసిద్ధులయ్యారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన ప్రదర్శనల్లో జర్నలిస్టు సమాజం తమ ఐక్యతను చాటబోతోంది. ఆందోళన తీవ్రతరం కాకముందే ఈ సమస్యకు పాలకులు పరిష్కారం చూపుతారని ఆశిద్దాం.
(వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి,తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్)
-ఆస్కాని మారుతి సాగర్
90107 56666