స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం మాట మార్చింది. గెలిచిన తర్వాత ఒక్కో హామీపై ఒక్కో పేచీ పెడుతూ వస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించింది.
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, బీసీ వర్గాల్లో ఉపకులాల వారీగా వర్గీకరణ చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది. అందుకు బీసీ కులగణన చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇంటింటా సర్వే చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నది. ప్రస్తుతం సర్వే పూర్తయినా రిజర్వేషన్లు సాధ్యం కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు గడిచినా… అందులో కాంగ్రెస్ పాలించిన దాదాపు 60 ఏండ్లలో పేదల కోసం నిజంగా పనిచేసి ఉంటే, ఇప్పుడు వాళ్లు కష్టపడేవాళ్లా? అప్పుడు చేయనటువంటి బీసీ కులగణన, రిజర్వేషన్లు ఇప్పుడెలా సాధ్యమవుతాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 17 ఏండ్లు పాలించినప్పటికీ బీసీ రిజర్వేషన్లు కానీ, బీసీ కులగణన కానీ చేపట్టలేదు. ప్రస్తుతం మాత్రం ఈ ఇరు పార్టీలు బీసీ వాదనను బలంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం పెద్ద మొత్తంలో ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నమే. అందుకోసమే ఈ పార్టీలు ప్రత్యక్ష ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు పెద్దగా చేసిందేమీ లేదు. అలా అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా పెద్దగా చేసిందేమీ లేదు. బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి ఉంటే భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసేది. మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది అమలు చేయలేదు. భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి వెనుకబడిన తరగతులు (బీసీలు), అధికారికంగా ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) అని పిలువబడే వారు సామాజిక, ఆర్థిక, రాజకీయరంగాల్లో వ్యవస్థీకృత అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగ రక్షణలు, సానుకూల చర్యలు, విధానాలున్నప్పటికీ, విభిన్న కులాల సముదాయాలతో కూడిన బీసీలు ఇప్పటికీ అణచివేతను ఎదుర్కొంటున్నారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయలేదు.
కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలుచేసింది. బీసీల కోసం పనిచేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్‌గాంధీ అన్నారు. 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు. పైగా కులగణన చేయబోమని స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి. గతంలో తమిళనాడు సీఎం జయలలిత భీష్మిస్తేనే అప్పటి పీవీ ప్రభుత్వం దిగొచ్చి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు. మన దేశంలో 1931లో తొలిసారిగా జనాభా గనణ ప్రారంభమైంది, ఆ సమయంలో మన దేశానికి అన్ని అధికారాలు లేవు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రతి పదేండ్లకోసారి జనాభా గణన చేపట్టాలని అంగీకరించారు.
అయితే, జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుండగా కులగణన అంశం చర్చకు రాకపోవడం బాధాకరం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనగణన సేకరణ చేపడుతున్నారు తప్ప, 76 ఏండ్లు గడిచినా నేటికీ బీసీ కులగణన చేపట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం అగ్రకులాల ఆధిపత్యం, రిజర్వేషన్ల అమలు, బీసీలలో విభజన పురోగతిని అడ్డుకున్నాయి. రాజకీయ నాయకులు బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు తప్ప అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లేదు. వీరి గణన వివరాలు చేపట్టాలని సుప్రీంకోర్టు, బీసీ కమిషన్ ఎన్నోసార్లు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయన్నదనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల జనాభా పెరుగుతుంటే బీసీ జనాభా శాతం మాత్రం తగ్గినట్టు చూపించారు. 2011 తెలంగాణ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.7 కోట్లుగా ఉంటే, సర్వేలో 3.54 కోట్ల మందిగా లెక్కించారు. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ యావరేజ్ పాపులేషన్ గ్రోత్ 13.5 శాతం. గత లెక్కల ప్రకారం బీసీ జనాభా సుమారు కోటి 84 లక్షలు, తెలంగాణ యావరేజ్ గ్రోత్ రేటు 13 శాతం. ఆ లెక్కన సుమారుగా 36 లక్షల జనాభా పెరిగి 2 కోట్ల 20 లక్షల బీసీ కుటుంబాల లెక్కలు రావాలి. కానీ, కావాలనే తప్పుడు లెక్కలు చూపించి బీసీ జనాభాను కోటి 64 లక్షలకు తగ్గించి చూపించారు. కొన్ని రాష్ర్టాల్లో బీసీ కులగణనను చేసి రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి.
నిన్నటిదాకా రిజర్వేషన్ల పెంపునకు ఎంతవరకైనా వెళ్తామని హడావుడి చేసిన కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు ఢిల్లీలో ధర్నా లతోనే సరిపుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు. వాటిని లోతుగా పరిశీలిస్తే రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనేది స్పష్టమవుతున్నది. ఒకరేమో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే, మరొకరు రాహుల్ గాంధీ ప్రధాని పదవితో బీసీ రిజర్వేషన్లను ముడిపెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పోటీ పడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ముందునుంచి బీసీలకు 42 శాతం అమలు చేశాకే స్థానికసంస్థల ఎన్నికకు వెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
(వ్యాసకర్త: సామాజికవేత్త, విశ్లేషకులు)
-డాక్టర్ మోటె చిరంజీవి
9949194327