కోదాడ రూరల్, మార్చి 18 : సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి వంతుల వారీగా నీరు విడుదల చేస్తున్నారని, అయితే ఆ నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం లేదని వాపోయారు. మొన్నటి వరకు యూరియా కోసం అనేక కష్టాలు పడి పంటలు పండిస్తే తీరా పంట చేతికి వచ్చే తరుణంలో ఎండిపోతుంటే దిక్కుతోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా తమను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి తమ పంట పొలాలను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల రైతులు జాల శ్రీనివాస్, జాల వెంకన్న, గోపి, తిరపయ్య, ముత్తయ్య, మహేశ్, కార్తీక్, సోమయ్య, నగేశ్, రాంబాబు, శంకర్, నాగేశ్వరరావు, వేణు, భిక్షం పాల్గొన్నారు.

సాగునీరందించి పంట పొలాలను కాపాడాలని రైతుల నిరసన