రాంచి, ఆగస్టు 10: జార్ఖండ్ విద్యార్థి ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి రక్తపాతాన్ని సృష్టించింది. ఆందోళనకారులు ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుమేరకు వేలాది మంది విద్యార్థులు, ఆశావహులు తరలిరావడంతో వారిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ప్రాంగణం వైపు దూసుకెళ్లిన నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝలిపించారు. వాటర్ కెనన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసు లాఠీచార్జ్జీలో పలువురు విద్యార్థుల తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. బారికేడ్లను ఛేదించుకుని అసెంబ్లీ వద్దకు చేరుకోవడానికి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును, జల ఫిరంగులను ప్రయగించారు. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబూనిన నిరసనకారులు వాటర్ కెనన్లను పోలీసులు ప్రయోగించిన సమయంలో నృత్యం చేయడం ప్రారంభించారు. కొత్త అసెంబ్లీ భవనానికి దారితీసే జగన్నాథ్‌పూర్ ఆలయ రోడ్డు సమీపానికి చేరుకున్న తమపై పోలీసులు జరిపిన చర్యలో పలువురు గాయపడినట్లు నిరసనకారులు తెలిపారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షల్లోని అవకతవకల ఆరోపణలకు వ్యతిరేకంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమంలో 17వ రోజున జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఆందోళన తీవ్రతను గణనీయంగా పెంచింది. జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) పరీక్షను రద్దు చేయాలని, అలాగే నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు లాఠీచార్జీలో తల పగిలి, తీవ్రంగా గాయపడిన ఇషాంత్ సింగ్ అనే విద్యార్థి తనతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. విద్యార్థులపై పోలీసుల లాఠీ దెబ్బ పడదని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో చెప్పారని, ఇప్పుడు జరిగింది ఏమిటని ఆ విద్యార్థి ప్రశ్నించారు.
ప్రశాంతంగా ప్రారంభమై&
పాత అసెంబ్లీ భవనం నుంచి ఉదయం 10 గంటలకు విద్యార్థులు ర్యాలీగా కొత్త అసెంబ్లీ భవనానికి బయల్దేరారు. సుమారు 3 కిలోమీటర్లు నడిచిన తర్వాత వారిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. అసెంబ్లీకి 1.5 కిలోమీటర్ల దూరంలో బహుళ అంచెల బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది బాష్పవాయువుతో సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులను అడ్డుకునేందుకు వాటర్ కెనన్లను ప్రయోగించగా నిరసనకారులు రెయిన్‌డ్యాన్స్ చేసి తాము వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. అనంతరం భద్రతా దళాలు బాష్పవాయువు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. వేలాదిమంది విద్యార్థులు బారికేడ్లను ఛేదించుకుని అసెంబ్లీని చేరుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
జేపీఎస్సీ మాజీ చైర్మన్ అరెస్ట్
నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి జార్ఖండ్ సీఐడీ పోలీసులు సోమవారం మాజీ జేపీఎస్సీ చర్మన్ ఎల్ ఖియాంగ్టేను అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో జేపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖియాంగ్టే జూలై 22న తన రాజీనామాను సమర్పించారు. నియామక పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్టేను అరెస్టు చేశామని సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ కౌశిక్ సోమవారం తెలిపారు. జూలై 28 నుంచి ఖియాంగ్టేను నాలుగుసార్లు పోలీసులు విచారించారు.
జర్నలిస్టు అరెస్ట్
విద్యార్థుల ఆందోళనను కవరేజ్ చేసినందుకు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు తనను అదుపులోకి తీసుకుని విచారించారని సీనియర్ జర్నలిస్ట్ అమన్ చోప్రా ఆరోపించారు. అసెంబ్లీ వైపు సాగుతున్న నిరసనకారుల ర్యాలీని కవర్ చేస్తున్న పలువురు ఇతర జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారని చోప్రా పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన పరిణామాలపై వార్తలు అందించకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. నిజం బయటపడుతుందనే ఆందోళన జార్ఖండ్ ప్రభుత్వానికి ఉంది అని చోప్రా అన్నారు.
మా గొంతు నొక్కలేరు

బలప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేయలేరని గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ప్రకటించారు. నలుగురు వ్యక్తుల సాయంతో స్ట్రెచర్‌పైన పడుకుని చలో ర్యాలీలో పాల్గొన్న మహతో తాము అసెంబ్లీకి చాలా దగ్గరకు వచ్చామని, లాఠీచార్జీ ద్వారా విద్యార్థుల గొంతుకను అణచివేయలేరని అన్నారు. ప్రభుత్వం భయపడినప్పుడల్లా పోలీసులు, లాఠీలు, తుపాకులు, బుల్లెట్లను ముందుంచుతున్నదని, ప్రభుత్వం భయపడుతున్నందా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిరసన ఇప్పుడు కేవలం విద్యార్థుల ప్రదర్శన స్థాయిని దాటి ప్రజా ఉద్యమంగా మారిందని మహతో అన్నారు.