హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. స్కూళ్ల మూసివేతపై ఓ ఎంపీ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 22,983 ఎలిమెంటరీ స్కూళ్లు ఉండగా, 2025-26 విద్యాసంవత్సరానికి వచ్చే సరికి 21,022 తగ్గాయి. అంటే ఈ ఒక్క ఏడాదే 1,961 స్కూళ్లు మూతపడ్డాయి. ఈ ఏడాది కాలంలో జాతీయంగా 9,866 స్కూళ్లు మూతబడగా, తెలంగాణలోనే రెండువేల వరకు స్కూళ్లు క్లోజ్ కావడం గమనార్హం. ఏపీలో 1,446 స్కూళ్లు మూసివేతకు గురయ్యాయి.
తగ్గిన మధ్యాహ్న భోజనం లబ్ధిదారులు
రాష్ట్రంలో పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజనం) లబ్ధిదారుల సంఖ్య తగ్గుతున్నది. 2022-23లో 21,05,268 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందగా.. 2025-26 నాటికి ఆ సంఖ్య 14,49,608కు పడిపోయింది. అంటే తక్కువ వ్యవధిలోనే 6,55,660 మంది లబ్ధిదారులు తగ్గారు. గణాంకాలు పరిశీలిస్తే 2021-22లో 17.90 లక్షల మంది ఉండగా, 2022-23లో ఒకసారిగా 21.05 లక్షలకు పెరిగారు. ఆ తర్వాత మాత్రం వరుసగా తగ్గుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల సర్కార్ బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు అస్వస్థతకు గురికావడం లాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. దీంతోనే పిల్లలు తగ్గుతున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఫండ్స్ విడుదల్లో జాఢ్యం
రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత విద్యా పథకాలకు మోదీ సర్కార్ నిధులు విడుదల చేయడంలేదు. 2018 నుంచి 2026 వరకు సమగ్రశిక్షా పథకం కింద రూ. 8,222.03 కోట్లకు ఆమోదం తెలిపితే.. రూ.6.822.70కోట్లను మాత్రమే విడుదల చేసింది. దాదాపు 1,390కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేయలేదు. ఇదే విషయాన్ని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. పీఎం పోషణ్ పథకం గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.