Parthiban | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన తమిళ నటుడు రాధాకృష్ణన్ పార్తిబన్ తన ప్రసంగంలో కులాన్ని ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పార్తిబన్, తనను తాను పరిచయం చేసుకుంటూ “తాను నాయుడు అబ్బాయిని, కానీ చెన్నైలో పుట్టి పెరిగిన కారణంగా తెలుగు కంటే తమిళ్ బాగా మాట్లాడతాను” అని వ్యాఖ్యానించారు. వేదికపై కులాన్ని ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేయడంతో ఈ విషయం వివాదంగా మారింది.దీనిపై స్పందించిన పార్తిబన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి దురుద్దేశంతో ఆ మాటలు చెప్పలేదని, అనుకోకుండా నోరు జారి అలా మాట్లాడానని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సరదాగా మాట్లాడిన మాటలు ఇలా వివాదానికి దారితీసినందుకు చింతిస్తున్నానని చెప్పారు.
తాను కులవ్యవస్థను ప్రోత్సహించే వ్యక్తి కాదని, అసలు కులాన్ని గొప్పగా చెప్పుకునే వారిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని పార్తిబన్ తెలిపారు. గతంలో తన సినిమాల్లో కూడా కుల వివక్షను వ్యతిరేకించే అంశాలను చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. తన కెరీర్లో ఒక కులం పేరును స్పష్టంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి అని, అది కూడా అనుకోకుండా జరిగిందని వివరించారు. తన మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చి ఉంటే అందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని పార్తిబన్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా మరింత జాగ్రత్తగా ఉంటానని హామీ ఇచ్చారు. కాగా, పార్తిబన్ గతంలో కూడా నటి త్రిషపై చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకుని క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 2012లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రచ్చ’ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆయన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.