రంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సర్ ప్రక్రియ ముగియడంతో డిజిటలైజేషన్ ప్రక్రియ 65.9% పూర్తి కాగా..15 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు కానున్నాయి. జిల్లాలోని గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్లలో ఇక్కడ సగం మంది ఓటర్లే ఆన్లైన్కు సహకరించారు. ఇక్కడ నివసిస్తున్న వలస ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు హక్కు ఉంచుకునేందుకు మొగ్గు చూపటంతో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు గ్రేటర్తోపాటు జిల్లాలోనూ విస్తరించి ఉన్నాయి. అలాగే, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్నగర్ సెగ్మెంట్లు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 85% డిజిటలైజేషన్ ప్రక్రియ పూరైంది.
జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో సుమారు 15 లక్షలకు పైగా ఓట్లు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా గ్రామాలతోపాటు నగరంలో కూడా ఎక్కువమంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ వంటి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వలసొచ్చి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో నివసిస్తూ రెండో ఓటును నమోదు చేయించుకున్నారు. సర్ ప్రక్రియ ద్వారా ఒకేచోట ఓటు కలిగి ఉండాలన్న నిబంధన అమలులో ఉండటంతో వలసొచ్చిన ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే తమ ఓటును నమోదు చేయించుకోవడంతో గ్రేటర్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. శేరిలింగంపల్లి సెగ్మెంట్లో సుమారు మూడులక్షలు, ఇబ్రహీంపట్నంలో 86వేల ఓట్లు, మహేశ్వరంలో రెండు లక్షల పైచిలుకు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రెండులక్షల పైచిలుకు ఓట్లు గల్లంతు కానున్నాయి.
పలు కారణాలతో విదేశాల్లో ఉన్నవారు, ఎస్ఐఆర్ ప్రక్రియలో సకాలంలో పేర్లు నమోదు చేసుకోని వారికి పలు ఆంక్షలతో మరోమారు అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం విధించే నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకుంటే, మరోసారి ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే వారికి ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉన్నది.
