అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, ఆగస్టు 10 : కాంగ్రెస్ సర్కార్ రెండున్నరేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దోచుకోవడమే తప్ప అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు. అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను మోసం చేసిందని, ప్రశ్నించిన ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తోందని మండిపడ్డారు. కావడిగుండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి మెచ్చా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, రైతులతోపాటు సామాన్యులకు సైతం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, పల్లెలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలతోపాటు ఆ పార్టీ క్యాడర్‌లోనూ అసంతృప్తి ఎక్కువగా ఉన్నదని, అందుకు బీఆర్ఎస్లో చేరికలే ఉదాహరణ అని పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణ లక్ష్యంతో ముందుకు సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప అభివృద్ధి, ప్రజా సంక్షేమం కనిపించడం లేదన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
పార్టీ శ్రేణులకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అధికార పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా, కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసే వరకు పార్టీ కోసం కష్టపడి పని చేస్తామని బీఆర్ఎస్లో చేరిన కొమరం రవి, కణితి వెంకటేశ్, హిమబిందులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జేకేవీ రమణారావు, యూఎస్ ప్రకాశ్‌రావు, జల్లిపల్లి శ్రీరామమూర్తి, మందపాటి రాజమోహన్‌రెడ్డి, సంకా ప్రసాద్, కలపాల బాబూరావు, నారం రాజశేఖర్, పాకనాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.