రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఫోబియా పట్టుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గులాబీ జెండాలు నిద్రపట్టనివ్వడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫొటోలు ఆయనను ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై నిత్యం ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం నిత్యం వెంటపడుతుండటంతో కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. ప్రతిపక్షంపై పగ, ప్రతీకారాలతో రేవంత్‌రెడ్డి రగిలిపోతున్నారు. ప్రజలు ఎన్నో అంచనాలతో కాంగ్రెస్‌కు పట్టంకడితే.. రేవంత్ మాత్రం రివేంజ్ పాలిటిక్స్‌కు తెరతీశారు. ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ అంటూ పెద్ద మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజలకు, నాయకులకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించినా, ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్నారు.జర్నలిస్టులపై కేసులు, వేధింపులకు పాల్పడటమే కాదు.. మీడియా హౌస్‌లపై దాడులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు.
ప్రజా పాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని తెచ్చింది. అధికారుల అవినీతి, నియంత పోకడలపై పాటలు పాడినా, మాట్లాడినా ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇలాంటివి ఎక్కువగా ఉమ్మడి ఏపీలోని టీడీపీ హయాంలో జరిగేవి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అదే స్కూల్ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే బాటలోనే పయనిస్తున్నారు. అధికారులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చుతున్నారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ మొదటి నుంచీ నిలదీస్తున్నది. ప్రజలకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే హరీశ్‌రావు వంటి నేతలు అక్కడ వాలిపోతున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే లగచర్ల, దిలావర్పూర్, మూసీ, హైడ్రా బాధితులు, రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు బలవుతున్న అమాయకులకు మద్దతుగా ఉంటున్నది. అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ను కట్టడి చేయాలన్న రేవంత్ కుట్రలు సాగడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వంటి కీలక నేతలపై కేసులు పెట్టి, ప్రశ్నించే వారిని వేధించి, జైలుకు పంపాలన్న కాంగ్రెస్ వ్యూహాలు విఫలమవుతున్నాయి.
రేవంత్‌రెడ్డి గుప్పిట్లో ఉన్న ప్రధాన మీడియా ప్రతిపక్షంపై విష ప్రచారం చేస్తుంటే, సోషల్ మీడియా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నది. ప్రజల ఆక్రందనలు, ఆవేదనను సోషల్ మీడియా కండ్లకు కడుతున్నది. ఇప్పుడీ సోషల్ మీడియా గొంతుకలు కూడా రేవంత్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో వాటిని కూడా టార్గెట్ చేసిన ప్రభుత్వం అక్రమ కేసులతో దాడులు చేయిస్తున్నది.
గులాబీ రంగు చూస్తేనే జంకుతున్న ప్రభు త్వం.. బీఆర్ఎస్ అంటేనే హడలిపోతున్నది. ప్రతిపక్షానికి సోషల్ మీడియా కూడా తోడు కావడంతో కాంగ్రెస్ కూసాలు కదులుతున్నాయి. 14 నెలల స్వల్ప కాలంలోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం సడలిపోయింది. సర్కారుపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రజలు ఎక్కడ తిరగబడతారోనన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను హైడ్రాను అడ్డుపెట్టుకుని తొలగించారు. ప్రగతి భవన్లో కేసీఆర్ శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ ఫొటోపైనా ప్రతాపం చూపించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స్కూల్లో విద్యార్థులకు చాక్లెట్లు పంచినందుకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. సిరిసిల్లలోని ఓ టీషాపులో కేటీఆర్ ఫొటో ఉండటంతో ఏకంగా దుకాణాన్నే తొలగించారు. గ్రామాల్లోనూ బీఆర్ఎస్ శిలాఫలకాలు ధ్వంసమవుతున్నాయి. చివరికి పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని కూడా చింపేసి విద్యార్థులకు ఇస్తున్నారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు, ప్రజల మనసుల నుంచి కేసీఆర్‌ను దూరం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో, అన్నీ చేసినా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు.
నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని జెండాలు పుట్టుకొచ్చినా గులాబీ జెండామాత్రం పాతుకుపోయింది.ఆ జెండా అందరిలోనూ చైతన్యం నింపింది. ప్రజలను ఏకతాటిపై నడిపించింది. గులాబీ జెండా ప్రజల్లో సృష్టించిన విప్లవ చైతన్యం ఇప్పటికీ అలాగే ఉన్నది. దానిని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇప్పుడు
కుటిల పన్నాగాలు పన్నుతున్నది.
రేవంత్‌రెడ్డికి గులాబీ ఫ్లెక్సీలంటే భయం. బీజేపీకి అమరుల స్థూపాలంటే భయం. అందుకే కాంగ్రెస్ జెండాలు చింపుతుంటే, బీజేపీ అమరుల స్థూపాలను కూల్చుతున్నది. నాడు విప్లవ పార్టీలు ప్రజలను చైతన్యం చేస్తే, మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచింది. అందుకే జాతీయ పార్టీలైన ఈ రెండింటికీ బీఆర్ఎస్ అంటే భయం పట్టుకున్నది.
‘ఎరుపంటే ఎందరికో భయం భయం.. పసిపిల్లలు వారికంటే నయం నయం’ అన్నారు విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గులాబీ రంగంటే భయం భయం అన్నట్టుగా తయారైంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. తేనె పూసిన కత్తిలాంటి మాటలు నమ్మి మోసపోయి గాయపడిన తెలంగాణ ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మటుమాయం కావడం తథ్యం.
-తోటకూర రమేశ్