పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే మన దేశం బాగుపడుతుందని భావించిన మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం నినాదమిచ్చారు. పరాయి పాలకుల పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో కాటికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన మన పల్లెలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనతికాలంలోనే జాతీయ వేదికలపై ఓ వెలుగు వెలిగేలా చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మళ్లీ తెలంగాణ పల్లెలు కునారిల్లే పరిస్థితి దాపురించింది.
ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచి తెలంగాణ వ్యాప్తంగా సంక్షోభం ఆవరించింది. మరీ ముఖ్యంగా పల్లెలు నిధుల లేమితో ఘోషిస్తున్నాయి. వైఫల్యాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పేరెత్తితేనే జడుసుకుంటున్నది. అక్రమ సంపదను పంచుకోవడం తప్ప, సంపదను పెంచడం ఏ మాత్రం తెలియని రేవంత్ ప్రభుత్వం ఖాళీ ఖజానా మీద తిష్ఠ వేసుకొని కూర్చున్నది. గ్రామాలకు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గల్లా పెట్టెలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే, ఆయన ప్రభుత్వం గ్రామ పంచాయతీల పాలనను గాలికివదిలేసి కార్యదర్శులపై భారం మోపింది. అప్పో సప్పో చేసి, ముక్కుతూ మూలుగుతూ ఏడాదిన్నర పాటు బండి లాక్కొచ్చిన కార్యదర్శులు ఇప్పుడు తమ వల్ల కాదని కాడి వదిలేశారు.
కనీసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా తమ వద్ద దమ్మిడీ లేదని వాపోతూ, ట్రాక్టర్ల తాళాలను మండలాధికారులకు అప్పగించే దుస్థితి ఆదర్శ తెలంగాణలో తలెత్తడం మన దౌర్భాగ్యం. నిర్మల్ నుంచి నల్గొండ వరకు, జయశంకర్ భూపాలపల్లి నుంచి జోగులాంబ గద్వాల వరకు, ఖమ్మం నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేని దుస్థితి నెలకొన్నది. అంతెందుకు, ట్రాక్టర్ల మెయింటెనెన్స్‌కు బిల్లులు రావడం లేదు. గ్రామ పంచాయతీల కార్మికులకు వేతనాలు అందడం లేదు. వీధి దీపాలు లేకపోవడంతో నాటి వెలుగుల తెలంగాణ నేడు చిమ్మ చీకట్ల మయమైంది. పల్లెలో ఏ మూలకు పోయినా మురుగు దర్శనమిస్తున్నది. చెత్తా చెదారం తారసపడుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రొచ్చు రోగాలతో పల్లెలు పడకేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల హయాంలో తెలంగాణ పల్లెల్లో అచ్చం ఇలాంటి పరిస్థితులే కనిపించేవి. కానీ, తెలంగాణ రాకతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పల్లెలను గ్రామ స్వరాజ్యం దిశగా పరుగులు పెట్టించారు.
పల్లె ప్రగతి, గ్రామజ్యోతి పేరిట ప్రత్యేకంగా గ్రామాల బాగు కోసం ఏటా రూ.200 కోట్లు కేటాయించారు. ప్రతి గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో డంపింగ్ యార్డ్, రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాలు, రూ.12.60 లక్షలతో వైకుంఠధామాలు, క్రీడా మైదానాలు, గల్లి గల్లీకి సీసీ రోడ్లు, వీధి వీధికి హరితహారం మొక్కలు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, ఇంకుడు గుంతలను కేసీఆర్ సర్కార్ నిర్మించి, మన పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దింది. తత్ఫలితంగా 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన 20 జాతీయ ఉత్తమ అవార్డులలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు 19 అవార్డులు వచ్చాయంటే నాడు పల్లెలు ఎలా వెలుగులు విరజిమ్మాయో చెప్పవచ్చు. అలా అభివృద్ధి పథాన పరుగెత్తిన పల్లెల్లో ఇలాంటి పరిస్థితి దాపురించడం సిగ్గుచేటు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా ఒక ముక్రా కే, ఒక పర్లపల్లి, ఒక మిట్టపల్లి, ఒక మోహినికుంట మన కండ్లముందు ఆవిష్కృతమయ్యాయి.
పల్లె ప్రజలను ఓటర్లుగానే పరిగణనలోకి తీసుకునే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తెలంగాణ పల్లెలు మళ్లీ సంక్షోభంలోకి జారుకున్నాయి. నిధులు లేక పల్లెలు కునారిల్లుతున్నాయి. ఎన్నికలకు భయపడి, సీఎం రేవంత్ గ్రామాల దరిదాపులకు కూడా పోవడం లేదు. చూసి చూసీ రాష్ట్ర హైకోర్టుకే విసుగు వచ్చిందేమో.. గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న దుర్గంధాన్ని తట్టుకోలేక బుధవారం నాడు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ ముప్ఫై లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నొక్కి వక్కాణించింది. హైకోర్టు చేత మొట్టికాయలు తిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక ఎన్నికలను మరోమారు వాయిదా వేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారేమో.. అలా చేస్తే ఆ కోర్టు కూడా తలంటుతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా, సీఎం రేవంత్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమరు వాయిదా వేస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికలను కాదు, ఘోర పరాభవాన్ని. తస్మాత్ జాగ్రత్త.