‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్‌గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద్ఘాటించారు. నిజానికి వారి మాటలను సర్కార్ పెద్దలు విని ఉంటే, ఆ క్షణం నుంచే వొళ్లు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పనితీరును సరిచేసుకునేవారు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు హృదయముండనే ఉండదనే వాస్తవానికి చరిత్రనే రుజువు. కానీ, కనీసం వినికిడి సామర్థ్యం సైతం శూన్యమనే సత్యాన్ని రేవంత్ సర్కార్ తేటతెల్లం చేసింది. దానివల్లనే ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, రిమాండ్ల కోసం ప్రభుత్వం పరితపిస్తూనే ఉన్నది.
పోలీస్స్టేషన్లను ఔట్ పోస్టులుగా మలుచుకొని తెలంగాణ వ్యతిరేక సర్కార్‌ను సంరక్షించుకోవడం సాధ్యపడదని విజయ తెలంగాణ నేపథ్యమే నిరూపిస్తున్నది కదా? మరెందుకు రేవంత్ సర్కార్ అలాంటి విఫల నమూనాను అనుసరిస్తున్నది? ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, లగచర్ల నుంచి సెంట్రల్ వర్సిటీ వరకు నలుమూలలనూ బేడీల భూతంతో భయపెట్టాలనే, పారని పాలనా మంత్రాన్నే పదే పదే విచిత్రంగా ప్రయోగిస్తున్నది.
అవన్నీ హింసిం చే రాజు ఇరవై మూడవ రాజు పులకేశి సినిమాలోలా హాస్యాస్పదంగా మారిపోయాయి. పదిహేడవ శతాబ్దంలో చోళపురం పాలయం రాజైన, మహా మూర్ఖుడు పులకేశి, బ్రిటిష్ వారికి తొత్తుగా మారి ఆ రాజ్య ప్రజలను నానావిధాలా హింసించాడు. చివరికి వివిధ కులాలు కొట్టుకోవడానికి ప్రత్యేక స్టేడియాలను సహితం నిర్మించిన పులకేశి, చరిత్రలో విధ్వంసక చక్రవర్తిగా ఘనతకెక్కాడు. విభజించి, చొరబడి, చెరబట్టాలనే బ్రిటిషర్ల కుట్రలను తు.చ. తప్పక అమలుచేసిన అమానవీయ రాజు ఆనాటి పులకేశి. మరి నేడు మన రాష్ట్రంలో కూడా వివాదాలు, కట్టు కథలు, కేసులు ఇలా ఎన్నో మాయోపాయాల మంత్రదండాన్ని సర్కార్ నమ్ముకొని నడక సాగిస్తున్నది కదా?.
విద్యార్థులను జైలుకు పంపిన మహా న్యూస్ వంటి వివాదం ఒకవేళ తమిళనాడులోనో, మహారాష్ట్రలోనో జరిగి ఉంటే నిరసన కాదు, నిప్పుల తుపాన్ పుట్టేది. ఆయా రాష్ర్టాల ఆత్మగౌరవమే ఆశయంగా పోరాడే స్టాలిన్ మీదో, ఠాక్రేల పైనో తంబ్‌నెయిల్స్‌తో అక్కడి ఏ మకిలి మీడియా అయినా తెగబడి ఉంటే ఏం జరిగి ఉండేదో వివరించనక్కర్లేదు కదా?. నాయకత్వాన్ని దూరం చేస్తే తప్ప వనరులపై అజమాయిషీ అసాధ్యమనే దుర్బుద్ధితో పాటు, పైచేయి సాధించిన తెలంగాణను తిరిగి పాతాళానికి చేర్చాలనే చంద్రబాబు నాయుడి వ్యూహాత్మక ఎత్తుగడే మీడియా ముసుగులో దాడిగా మారింది.
పదేండ్ల స్వయం పాలనలో ఆదాయ గోపురంలా పునర్నిర్మాణమైన తెలంగాణను కొల్లగొట్టడానికి అడ్డుపడే నాయకత్వాన్ని, రాజకీయంగా మట్టుబెట్టడానికి వికృత ఎత్తుగడలకు ఒడిగడుతున్నాడు. అయితే ఇది తెలంగాణలో అమలవుతున్న సరికొత్త సర్కార్ ఫార్ములా ఏం కాదు. వాస్తవానికి పోరులోనే పరవశించింది తెలంగాణ. ప్రజారాశుల శత్రువు పన్నే వ్యూహాల గురించి దశాబ్దాల కిందటే మాటల్లో, పాటల్లో విశ్లేషించుకున్నది.
‘నాలుకలపై పూసే తీపంతా తేనె కాదు, చెవుల్లో వొంపే కథంతా కుట్రాతీతం కానే కాదు. ఏమరుపాటుతో ప్రతి కట్టుకథకూ తలలూపితే, సర్వస్వం తాకట్టు ఖాయమనే వాస్తవం అనుభవపూర్వకంగా తెలంగాణకు తెలుసు.
అయితే వినపడేది మాత్రమే కాదు, కనపడేదంతా కూడా నిజం కాదనేది పెట్టుబడిదారీ రాజకీయాలకు పేటెంట్ అయిన చంద్రబాబు నాయుడు లాంటి పాలకుల వల్ల ఏనాడో తేటతెల్లమైంది. ఉమ్మడి రాష్ట్ర కాలంలోనే కాదు కాస్త వెనక్కి మళ్ళీ ప్రపంచ చరిత్రను పరిశీలించినా, అస్తిత్వ రాజకీయ శక్తుల వ్యక్తిత్వ హననానికి దోపిడిదారులు ఎంత విషం పారించారో, ఎంతెంత నెత్తురు తాగారో తేలిగ్గానే అర్థమవుతుంది. మన అనుభవమైన, చరిత్రైన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని అస్థిరపరచడం వెనుక ఏ రాజకీయ, అసాంఘిక శక్తుల ప్రయోజనాలు దాగి ఉంటాయోనన్నది కండ్ల ముందుంచుతున్నది. అందుకే, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరివారంపై, పార్టీపై సాగుతున్న విష ప్రచారాన్ని లోతుగా అందరం అర్థం చేసుకోవాలి. అవినీతి నుంచి మొదలుపెట్టి విలీనం వరకు నిత్యం వండి వారుస్తున్న వార్తల వెనుక మర్మాన్ని స్పష్టంగా చూడగలగాలి. నిధులు, నదులు ఎత్తుకెళ్లే ఎత్తుగడలతో ఎలా పావులు కదుపుతున్నారో నగ్నంగా కనపడిపోతూనే ఉన్నది కదా?
ఈ కుయుక్తులిలా సాగుతుంటే, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో డ్రామాలకు, పాదయాత్రల పేరిట పల్లెల్లో పగటివేషాలకు హస్తం పార్టీ తెగబడుతున్నది. వీటన్నింటినీ తెలంగాణ హృదయంతో జాగ్రత్తగా చూడక, పైపై చూపులతో ఎవ్వరమూ సరిపెట్టుకోరాదు. రేవంత్‌ను నమ్ముకొని అమరావతి, మీనాక్షిని ముందుపెట్టి హస్తిన మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని పలుచన చేసే రాజకీయాలు నడిపిస్తున్నారు. విద్యార్థులు, యువత, బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, రైతులు ఇలా అన్నివర్గాలకు ద్రోహం తలపెట్టడమే కాదు, తెలంగాణ తలనూ తాకట్టు పెట్టేస్తున్నారు. దానికోసమే తెలంగాణలో బిగిసిన ప్రతి పిడికిలికీ బేడీలు వేసేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్టు చేసిన ప్రతి ఉద్యమకారుడు కూడా ‘కంసుని చెరలోని కన్నయ్య’ మాదిరిగా పెరిగి అరాచక ప్రభుత్వ పతనానికి అంతిమ తీర్పును రాయడం ఖాయం. బేడీల వల విసిరి తెలంగాణను లొంగదీసుకోగలమని కలగనడం వారి మూర్ఖత్వానికి నిలువుటద్దం. ఈ వికృత వ్యూహాలతో తెలంగాణను ఎన్నాళ్ళేలగలరు?
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్) డాక్టర్ ఆంజనేయ గౌడ్