CBI Enquiry on Kaleshwaram | ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు మరో వంద అబద్ధాలు ఆడాలి! అనేక అపచారాలు చేయాలి!ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తున్నది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు. కానీ, నిటారుగా కండ్లముందు నిలబడ్డ నిజాన్ని మాత్రం నీరుగార్చలేరు. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం.
ఒక బరాజ్‌లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని. తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన కేసీఆర్‌ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుండటం హేయం. ప్రాజెక్టులు కట్టడమే పాపమా? నీళ్లు ఇవ్వడమే నేరమా? నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మీద రాళ్లు వేస్తున్నారు. నీళ్లు తెచ్చిన తెలంగాణ కాటన్ మీద నిందలు వేస్తున్నారు. ఇదంతా చూసి తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.
తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఏపీకి గోదావరి జలాలను రాసిచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయి. అసెంబ్లీలో జరిగినదంతా తెలంగాణను బలిపెట్టి, బనకచర్ల కోసం రేవంత్ ఆడిన నాటకమే తప్ప, ఇంకోటి కాదనేది బహిర్గతమైంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది ఒక పార్టీపై జరుగుతున్న దాడి కాదు, తెలంగాణను ఎడారిగా మార్చే విద్రోహ చర్య. ఓ వైపు రేవంత్, మరోవైపు బాబు, ఇంకో వైపు మోదీ.. ముగ్గురూ కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలకు తెరతీశారు. అందులో భాగమే సీబీఐ విచారణ. ముందు నుంచి బీఆర్ఎస్ చెప్తున్న మాటే ఇప్పుడు నిజమైంది. గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను కాలరాయడమే రేవంత్‌రెడ్డి ఎజెండా. కాళేశ్వరాన్ని బలిచేసేందుకే ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చిన బనకచర్లతోనే ఈ కుట్రలకు బీజం పడింది. మరోవైపు గోదావరి-కావేరి లింక్ పేరిట గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకుపోయేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పార్టీ అయిన బీఆర్ఎస్ ఉన్నంత కాలం తమ ఆటలు సాగవని ఈ ముగ్గురికి ఎప్పుడో అర్థమైంది. అందుకే అందరూ కలిసి బీఆర్ఎస్పై ముప్పేట దాడి చేసే కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఓ వైపు బనకచర్ల ముప్పుతోపాటు ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చి మొత్తంగా కాళేశ్వరాన్ని ముంచే కుతంత్రం చేస్తున్నారు. తెలంగాణ రైతుకు మరణశాసనం రాయాలన్నదే ఈ ముగ్గురి అంతిమ లక్ష్యం.
బీడువారిన భూముల్లో నీళ్లు పారించి, పచ్చని పంటలతో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చారు అపరభగీరథుడు కేసీఆర్. కాళేశ్వరం నిర్మించి రైతులకు కరువుతీరా సాగునీళ్లు అందించారు. వట్టిపోయిన శ్రీరాంసాగర్‌కు పునర్జీవం పోసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో ఆయువుపోశారు.
కానీ, తెలంగాణ జీవరేఖ లాంటి కాళేశ్వరాన్ని పడావు పెట్టాలని కాంగ్రెస్ చూస్తున్నది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇప్పట్లో మరమ్మతులు చేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తేలిపోయింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రలో భాగంగానే సీబీఐను కాంగ్రెస్ సర్కార్ అస్త్రంగా వాడుకుంటున్నది.
తన నిర్వాకంతో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలలు గడుస్తున్నా కార్మికుల మృతదేహాలను బయటికి తీసుకురావడం లేదు. ఇంత జరిగినా సొరంగాన్ని త్వరలోనే పునరుద్ధరించి, ఏడాదిన్నర, రెండేండ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్తున్నారు. ఎస్ఎల్బీసీని పునరుద్ధరించేవాళ్లు 20 నెలలైనా కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లకు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నారు? ఆ పనెందుకు చేయడం లేదనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. కాళేశ్వరానికి అయిన ఖర్చు రూ.94 వేల కోట్లయితే, అందులో మేడిగడ్డకైన ఖర్చు రూ.4 వేల కోట్లని, బరాజ్‌లో పగుళ్లు వచ్చిన బ్లాక్‌ను మరమ్మతు చేసేందుకు రూ.300 కోట్లు అవుతాయి. ఆ మొత్తాన్ని కూడా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ చెప్తున్నది. కానీ, ప్రభుత్వం కావాలనే ఆ సంస్థకు అనుమతివ్వడం లేదు. దీని వెనుక కేసీఆర్‌ను ఎలాగైనా బద్నాం చేయాలన్న ఏకైక ఎజెండా కనిపిస్తున్నది. గోదావరి నీళ్లు వస్తే పిల్లర్లు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. కానీ, ఇప్పటికీ లక్షల క్యూసెకుల నీళ్లు ఆ బరాజ్ గుండా పోతున్నాయి. ప్రాజెక్టులోని కెనాల్స్, టన్నెల్స్, ఇతర నిర్మాణాలు పటిష్ఠంగా ఉన్నాయి. ‘ఇప్పుడు ప్రాజెక్టును ఇలాగే పడావు పెడతారా? కూలగొడుతున్నారా? లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు మరమ్మతు చేయాలి కదా’ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానంతో కాలయాపన చేస్తున్నది.
‘కాళేశ్వరం ఓ సక్సెస్ఫుల్ ప్రాజెక్టు’ అని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ కితాబిచ్చారు. కాళేశ్వరాన్ని ఇంజినీరింగ్ మార్వెల్‌గా పొగుడుతూ డిస్కవరీ చానల్ ఓ డాక్యుమెంటరీనే ప్రసారం చేసింది. కాళేశ్వరం భారత్‌లోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అంటూ అమెరికా పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ కొనియాడింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు, ఆర్థికవేత్తలు, పత్రికలు మన కాళేశ్వరాన్ని వేనోళ్ల కొనియాడాయి. కాళేశ్వరం ఓ అద్భుతమని సుప్రీంకోర్టే ఇటీవల వ్యాఖ్యానించింది. అయినా, దానిపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పెద్దలు చేయని విషప్రచారం లేదు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న, కాళేశ్వరాన్ని రక్షించాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనే లేదు. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు పోతున్నదనేది నిర్వివాదాంశం. సూర్యుడిపైకి ఉమ్మితే అది తిరిగి మన ముఖానే పడుతుందనే సంగతిని రేవంత్ సర్కార్ మరిచిపోయింది. సీబీఐ లాంటి ఎన్ని విచారణలు జరిపించినా కేసీఆర్‌ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్టుగా, కేసీఆర్ చరిష్మాను శాశ్వతంగా తొలగించి రాజకీయ లబ్ధి పొందాలనే భ్రమల్లో ఉన్న రేవంత్ సర్కార్‌కు తెలంగాణ ప్రజలు మాత్రం ‘కీలెరిగి వాతపెట్టడం’ ఖాయం.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-కోలేటి దామోదర్