కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కారు కదా? మరి బీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలి? అసలు పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్కు ఏం సంబంధం?’ ఇలా సాగుతున్నది ఆ రెండు పార్టీల నాయకుల వాదన. బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తులకు అసలు లోక్‌సభ ఎన్నికలతో ఏం పని? బీఆర్ఎస్ లోకస్ స్టాండి (లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు/ అర్హత) ఏంటి? అని ప్రశ్నించే దాకా తెగింపు ప్రదర్శిస్తున్నాయి. పైకి చూస్తే ఇది నిజమే కదా? అనిపిస్తుంది. కానీ, ఆ ప్రకటనల, వాదనల లోగుట్టు చాలా వికృతమైనది. ఈ రెండు పార్టీలు ఒకే స్వరం వినిపించడం వెనుక కచ్చితంగా రహస్య ఎజెండా ఉన్నది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణానికి బొమ్మా బొరుసు లాంటివి. వారి నినాదాలు మాత్రమే వేరు, విధానాలు ఒకటే. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే. బలహీనమైన రాష్ర్టాలు, బలమైన కేంద్రమే ఈ రెండు పార్టీల విధానం. రాష్ర్టాల హక్కులను కాలరాయడంలో రెండింటిదీ ఒకే దారి. ఉమ్మడి జాబితాలోని అంశాలను ఒక్కొక్కటిగా కేంద్రానికి బదిలీ చేసింది ఈ పార్టీలే. రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని కేంద్రప్రభుత్వానికి ధారాదత్తం చేసిన చరిత్ర ఈ పార్టీలదే. రాష్ర్టాలను నామమాత్రం చేయడమనే దీర్ఘకాలిక లక్ష్యానికి రెండు పార్టీలు జోడెద్దుల్లా పనిచేస్తున్నాయి.
రాష్ర్టాల్లో ప్రబల శక్తిగా ఉన్న పార్టీలను బలహీనపర్చడం లేదా కబళించడం ద్వారా దేశంలో రాష్ర్టాల ప్రాబల్యాన్ని తగ్గించాలనే ఎజెండా వారిది. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్న మేరకు స్థానిక అస్తిత్వాలకు, రాష్ర్టాల హక్కులకు రక్షణ కవచంగా నిలబడే ప్రాంతీయ పార్టీలను బలితీసుకుని ఆ పార్టీలు బలపడ్డాయి. ప్రాంతీయ పార్టీలు కేవలం శాసనసభ ఎన్నికల్లోనే పోటీ చేసే విధంగా, అదే జాతీయ పార్టీలు మాత్రం లోకసభ, అసెంబ్లీ రెండు చోట్లా పోటీ చేసే విధంగా చట్టం చేసే ఆలోచన కూడా ఆ రెండు పార్టీలకు ఉన్నది. అందుకు సరైన అదును కోసం ఎదురు చూస్తున్నాయి, అంతే. ఆ రహస్య ఎజెండా, భావసారూప్యత నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యాన్ని పరిమితం చేయాలని కుట్రలు చేస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వాదనలు రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశాన్ని రాష్ర్టాల సమాఖ్యగా మార్చడానికి ప్రత్యేక కారణం కూడా ఉన్నది. మన దేశం ప్రపంచంలోని మిగతా దేశాలకు చాలా భిన్నమైనది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ ఆత్మ. ఎక్కడికక్కడ స్థానిక అస్తిత్వాలు బలంగా ఉన్న దేశమిది. అందుకే రాజ్యాంగ నిర్మాతలు భారతదేశం యూనిటరీ స్టేట్ (ఏకకేంద్ర దేశం)గా కాకుండా, యూనియన్ ఆఫ్ స్టేట్స్ (రాష్ర్టాల సమాఖ్య)గా ఉంటుందని రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌లోనే స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా వివిధ సంస్థానాలు, మతాలు, కులాలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా వెళ్లారే తప్ప, యావత్ భారతదేశ ప్రతినిధులుగా ఎవరూ వెళ్లలేదు. భారతదేశంలోని వివిధ రాష్ర్టాలు దేనికవే ప్రత్యేక రాజ్యాలుగా వెలుగొందిన చరిత్ర ఉన్నది. కాబట్టే భారతదేశం రాష్ర్టాల సమాఖ్యగానే ఉండాలని రాజ్యాంగసభలో తీర్మానించి అమలు పరిచారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలాగా యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా ఇండియా గొప్ప సమాఖ్య దేశంగా వర్ధిల్లుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అమెరికా రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థ కూర్పునే భారతదేశానికి కూడా అన్వయించారు. రాష్ర్టాల సమాఖ్యగానే కాకుండా, బహుళ రాజకీయ పక్షాలకు అవకాశం కల్పించే విస్తృత ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా మన రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆయా రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వీలుగా రాజకీయ పక్షాలు ఉండాలనే ఇలా నిర్ణయించారు. రాజ్యసభలో కూడా పార్టీల వారీగా ప్రతినిధులను కాకుండా, రాష్ర్టాల వారీగా ప్రతినిధులు ఉండే విధానం పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ అనే పదమే రాజ్యాంగంలో వాడకున్నా, నేడు సెంట్రల్ గవర్నమెంట్ పేరుతోనే అంతా నడుస్తున్నది.
పార్లమెంట్లో రాష్ర్టాల వారీగా కాకుండా, పార్టీల వారీగా సభ్యులకు మాట్లాడే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి ఎన్నికయ్యే కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కూడా పార్టీ కోటా నుంచే మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఉన్న వారి ఎంపీలకు వచ్చే అవకాశంలో తెలంగాణ వారికి దక్కే చాన్స్ చాలా తక్కువ. వచ్చిన అవకాశంలో కూడా వారు పార్టీ లైన్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. అధిష్ఠానం చెప్పిన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి. కానీ, బీఆర్ఎస్ ఎంపీలకు తెలంగాణ ఎజెండా తప్ప మరొకటి ఉండదు. తెలంగాణ సమస్యలే ప్రస్తావిస్తారు. వాటి పరిష్కారం కోసం మాత్రమే కృషి చేస్తారు.. పోరాడతారు. అందుకే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఎంత ఎక్కువ మంది ఉంటే, తెలంగాణకు అంత మేలు కలుగుతుంది.
బ్రిటిష్ కాలంలో గవర్నర్ జనరల్ పరిపాలనా యంత్రాంగాన్ని ‘సెంట్రల్ గవర్నమెంట్’గా నిర్వచించేవారు. బ్రిటిష్ వాళ్లు పోతూపోతూ సెంట్రల్ గవర్నమెంట్ అనే వ్యవస్థనే రద్దు చేసిపోయారు. అధికార బదిలీ కోసం 1946లో తీసుకొచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో ‘సెంట్రల్’ అనే పదానికి బదులుగా యూనియన్ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించారు. దీనిలో ఉన్న అనేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ర్టాల ఉనికిని, అస్తిత్వాన్ని, ప్రయోజనాలను కాపాడటానికి అనుగుణంగా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా, కచ్చితమైన నిబంధనలను పొందుపరిచారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించింది ఒకటైతే 76 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని ఎక్కువకాలం ఏలిన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నది మరొకటి.
ఆ రెండు పార్టీలు రాష్ర్టాల ఉనికినే దెబ్బతీసే పనులు చేశాయి. రాష్ట్ర జాబితాలో ఉన్న చాలా అంశాలను కేంద్రం పరిధిలోకి మార్చాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ర్టాలతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా ఏర్పడిన దేశాన్ని యూనిటరీ స్టేట్‌గా మార్చింది ఈ పార్టీలే. బలమైన రాష్ర్టాలతో కూడిన అమెరికాలాగా భారతదేశం వర్ధిల్లుతుందని తొలితరం జాతీయ నాయకులు అనుకుంటే, కేంద్రాన్ని బలంగా తయారు చేసి అతలాకుతలమవుతున్న పాకిస్తాన్‌లాగా ఇప్పటి జాతీయ నాయకులు మన దేశాన్ని తయారు చేస్తున్నారు. చట్టాలు చేసుకునే హక్కు కలిగిన స్థాయి నుంచి రాష్ర్టాలను స్థానిక సంస్థలుగా మార్చే వ్యూహాన్ని జాతీయ పార్టీలు అమలు చేస్తున్నాయి. రాష్ర్టాలను నిర్వీర్యం చేయాలంటే, ముందుగా ఆయా రాష్ర్టాల్లో బలమైన స్థానిక నాయకత్వాలను దెబ్బతీయాలి. రాష్ర్టాల హక్కుల కోసం కొట్లాడే గొంతులను నొక్కేయాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తేనే, కేంద్రం పెత్తనం మరింత సులువు అవుతుందనేది వారి ఎత్తుగడ.
ఈ వ్యూహంలో భాగంగానే మన దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే మింగేశాయి. ప్రాంతీయ నాయకత్వాలు, పార్టీలు బలంగా ఉన్న రాష్ర్టాల్లో ప్రజలు ఎంత ఆత్మగౌరవంతో బతుకుతూ, తమ హక్కులు సాధించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు తమిళనాడు చక్కని ఉదాహరణ. జాతీయ పార్టీలను వదిలించుకున్న తమిళ ప్రజలు ద్రవిడ పార్టీలనే నమ్ముకున్నారు. తన భాషను, తన సంస్కృతిని, తన హక్కులను ఆ రాష్ట్రం కాపాడుకోగలుగుతున్నది. ద్రవిడ ఉద్యమ స్ఫూర్తిని వందేండ్ల యినా కానీ పోగొట్టుకోకుండా వారు ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, స్వీయ అస్తిత్వాన్ని చాటుకుంటున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 69 శాతం రిజర్వేషన్లు ఆ రాష్ట్రంలో అమలు చేసుకోగలుగుతున్నారు. ద్రవిడ పార్టీల స్థానంలో కాంగ్రెస్, బీజేపీ ఉంటే అది సాధ్యమయ్యేదా?
తెలంగాణలో కూడా బలమైన ప్రాంతీయ పార్టీ ఉంది కాబట్టే ఏకంగా రాష్ట్రమే సాధించగలిగాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో ఎన్నో పనులు సొంతంగా చేసుకోగలిగాం. రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయగలుగుతున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ రాజకీయ శక్తే లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేదా?
కావేరీ వివాదం తెరపైకి వస్తే, తమిళనాడు ప్రజలంతా పార్టీలకు అతీతంగా రాష్ట్రం కోసం మాట్లాడతారు.. మాట్లాడుతున్నారు.. పోట్లాడుతున్నారు. తెలంగాణలో అది సాధ్యమా? రేపు కృష్ణా జలాల వివాదం తలెత్తితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి పక్షాన నిలుస్తాయి?
మన రాష్ట్ర కాంగ్రెస్ అటు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం, ఇటు కర్ణాటక కాంగ్రెస్‌ల చెప్పుచేతల్లో ఉంటుంది. వారికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడలేరు. ఢిల్లీకి ఎదురు చెప్పలేరు. జాతీయ పార్టీల కుట్రలకు బలై.. ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ నాయకులను శక్తిహీనం చేసుకున్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ర్టాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ అనే కవచం లేకుంటే తెలంగాణ పరిస్థితి కూడా అంతే అవుతుంది.
బీఆర్ఎస్ ఒక్కసారి ఓడిపోగానే తెలంగాణ భావజాలానికి చీకటి ఛాయలు అలుముకోవడం ప్రారంభమైంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యవహారశైలిని, ప్రసంగాల తీరును గమనించండి. ‘జై తెలంగాణ’ అని మాటవరుసకైనా వారు అనరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని నినదించడం నేను ఇప్పటిదాకా వినలేదు. బీజేపీ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారి నోరు ఎన్నడూ ‘జై తెలంగాణ’ అని పలకదు. వారి నినాదాలు వేరు, వారి విధానాలు వేరు. పార్లమెంట్లో రాష్ర్టాల వారీగా కాకుండా, పార్టీల వారీగా సభ్యులకు మాట్లాడే అవకాశం ఉంటుంది.
తెలంగాణ నుంచి ఎన్నికయ్యే కాంగ్రెస్, బీజేపీ సభ్యులు కూడా పార్టీ కోటా నుంచే మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఉన్న వారి ఎంపీలకు వచ్చే అవకాశంలో తెలంగాణ వారికి దక్కే చాన్స్ చాలా తక్కువ. వచ్చిన అవకాశంలో కూడా వారు పార్టీ లైన్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. అధిష్ఠానం చెప్పిన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి. కానీ, బీఆర్ఎస్ ఎంపీలకు తెలంగాణ ఎజెండా తప్ప మరొకటి ఉండదు. తెలంగాణ సమస్యలే ప్రస్తావిస్తారు. వాటి పరిష్కారం కోసం మాత్రమే కృషి చేస్తారు.. పోరాడతారు. అందుకే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఎంత ఎక్కువ మంది ఉంటే, తెలంగాణకు అంత మేలు జరుగుతుంది.
ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో తీసుకున్న వైఖరే దేశమంతా తీసుకుంటాయా? అంటే అదీ లేదు. అందితే జుట్టు లేకుంటే కాళ్లు అనే చందం. ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏం పని?’ అని తెలంగాణలో ప్రశ్నించే బీజేపీ నాయకులు మహారాష్ట్రలో శివసేనను అదే ప్రశ్న అడగగలరా? తమిళనాడుకు వెళ్లే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ద్రవిడ పార్టీలకు ఏం పని? అని ప్రశ్నించగలరా? ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తూనే మరోవైపు ప్రాంతీయ పార్టీల బలాన్ని వాడుకోవడానికి మాత్రం ఈ రెండు పార్టీలు ఏమాత్రం సంకోచించవు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో 34 భాగస్వామ్య పక్షాలుంటే, అందులో 33 ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ సమన్వయంలోని ఇండియా కూటమిలో 26 పక్షాలుంటే, అందులో 22 ప్రాంతీయ పార్టీలే. లోక్‌సభలో మొత్తం 39 పార్టీల ప్రతినిధులుంటే, అందులో జాతీయ పార్టీలు ఎనిమిది మాత్రమే. అంటే దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని ఎంత దెబ్బతీయాలని చూసినా జాతీయ పార్టీలకు అది సాధ్యం కావట్లేదు. ఇటు రాష్ర్టాల్లో, అటు కేంద్రంలో నేటికి కూడా ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా దేశంలో ఏ జాతీయపార్టీ కూడా ప్రస్థానం సాగించే పరిస్థితి లేదు.
స్థానిక కారణాల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఆటుపోట్లు ఎదురవవచ్చేమో కానీ, అంతిమంగా రాష్ర్టాల హక్కులను కాపాడే పార్టీలుగా, దేశ సమాఖ్య వ్యవస్థకు ఆయువుపట్టుగా ప్రజలు ప్రాంతీయ పార్టీలనే విశ్వసిస్తున్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంది కాబట్టి, తెలంగాణతో ఏం సంబంధం? అని మరో వింత వాదనను కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని ప్రజల గుండెల్లో ఉన్న ప్రగాఢమైన భావనను చెరిపేసే విఫలయత్నం చేస్తున్నారు. జాతీయ భావజాలంతో పనిచేయడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమవుతుందా? జనసంఘ్ తన పేరును భారతీయ జనతా పార్టీగా మార్చుకుంటే, దాని మూల సిద్ధాంతమైన హిందుత్వకు తిలోదకాలు ఇచ్చినట్టా? ఇప్పటి ఏఐసీసీ ఒకప్పుడు రిక్విజిషన్ కాంగ్రెస్, ఆర్గనైజేషన్ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్‌గా కొనసాగలేదా? రకరకాల పేర్లు మార్చుకున్నది కాబట్టి దేశమంటే ప్రేమ లేదనుకోవాలా? పేర్లు మార్చుకుంటే విధానాలు మార్చుకున్నట్టా? తెలంగాణ అనే పదం పేరులో లేదు కాబట్టి, తెలంగాణ ప్రజల నుంచి బీఆర్ఎస్ వేరవుతుందా? ద్రవిడ అనే పదం శ్రీలంక, మలేషియా, సింగపూర్‌తో పాటు దక్షిణ భారతదేశానికి కలిపి వాడతారు. అంటే డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల పేర్లలో తమిళ అనే పేరు లేదు కాబట్టి అవి తమిళ పార్టీలు కాకుండా పోతాయా? ఆప్ పార్టీ విస్తరించి, జాతీయ పార్టీ అయ్యింది. అంటే ఢిల్లీ ప్రయోజనాల పట్ల ఆప్‌కు పట్టింపు లేనట్టా?
పేరు ఏదైనా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ మాత్రమే. తమిళనాడు, బెంగాల్, ఒడిశా, బీహార్ తదితర రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణ ప్రజలు కూడా తమ రాజకీయ అస్తిత్వాన్ని పోగొట్టుకోరు. 23 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో, 10 ఏండ్ల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసమే నిలబడిందనే వాస్తవం కూడా ప్రజలకు తెలుసు. ప్రాంతీయ అస్తిత్వాలను దెబ్బతీయాలనే జాతీయ పార్టీల కుట్రలు తెలంగాణలో పనిచేయవు. ప్రాంతీయ పార్టీల మనుగడే దేశ సహకార సమాఖ్య విధానానికి పట్టుగొమ్మ.
తన్నీరు హరీశ్ రావు
బీఆర్ఎస్ శాసనసభ్యులు