‘నన్ను నేను మెచ్చుకోకపోతే నన్నెవడు మెచ్చునురా నా బాంచ కొడకా అన్నడటా ఎనకటికి ఓ పెద్ద మనిషి. అంటే ప్రజల మెప్పు పొందే పనులు చేయకపోగా, ప్రజలేంది మమ్ములను మెచ్చుకునేది, మాకు మేమే మెచ్చుకొంటే చాలు అని అతడి భావం. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల ప్రవర్తన కూడా అట్లనే కనబడుతున్నది. ఫ్లాష్సర్వేలో తమకే ఎక్కువ మార్కులు పడ్డాయని మురిసిపోవడం ఏందో మరి! వందరోజుల్లో తీరుస్తామన్న ఆరు గ్యారెంటీలు, హామీలు వెయ్యి రోజులైనా తీర్చలేదంటే ఇది వందకు వంద శాతం పాలనాదక్షతలేని నాయకత్వానికి నిదర్శనం. ప్రజలు అనుకుంటున్న మాట కాదనలేని నిజం. కానీ కాంగ్రెస్ నాయకులు గ్రహిస్తలేరు. ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ సంబురాలు చేసుకోవడం విడ్డూరం.
తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన, ఉపాధి అవకాశాలు కలిగిన, పర్యావరణహితమైన, ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని చూస్తుంటే నవ్వువస్తున్నది. ఓ దిక్కు రైతుభరోసా డబ్బులు సక్రమంగా రాక రైతన్నలు ఉసూరుమంటున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట బోనస్ రూ.500 కేవలం సన్నాలకు మాత్రమే ఇచ్చి, దొడ్డు రకం సాగు చేసిన మెజారిటీ రైతులును అసలే పట్టించుకోవడంలేదు. యూరియా సకాలంలో దొరుకక కర్షకులు బాధ పడుతున్నారు. నిరుడు రైతులకు రూ.5 లక్షల రైతుబీమా కోసం ప్రీమియం డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం భరించింది. కానీ రేవంత్ ప్రభుత్వానికి రైతుబీమా కూడా భారమైపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అనేది కొత్త సమస్యలను సృష్టించింది. బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో తీవ్రమైన రద్దీతో ప్రయాణికుల మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో పెట్టింది. వేతన సవరణలోనూ జాప్యం చేస్తున్నది. ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం పెండింగ్ డీఏల కారణంగా సగటు ఉద్యోగి ప్రతినెలా సుమారు రూ.10 వేల నుంచి 20 వేల వరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సమస్యలను దసరా నా టికి పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టంచేస్తున్నారు. రా ష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపితే కూడా అడ్డుకోవడమేంది? ఉద్దేశపూర్వకంగానే మహిళా పోలీసులను ముందువరుసలో మోహరింపజేశారు.
నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వ లోపాలను ప్రజలకు తెలియజేయడం ప్రతిపక్షాల బాధ్యత. అటువంటి నాయకులను పోలీసులు అడ్డగించడం దారుణం. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం అంటే చట్టాలను దుర్వినియోగం చేయడమే. కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు పేరుతో కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగడం అమానవీయం.
ఒక మహానాయకుడు, తెలంగాణ ప్రదాత కేసీఆర్ పట్ల కాంగ్రెస్ నాయకులు, రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న వైఖరి అత్యంత హేయం. కక్ష సాధింపులో భాగంగా పరమ మూర్ఖత్వంతో దిగజారుడు రాజకీయలను చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది. కేసీఆర్ పట్ల దుర్మార్గమైన భాషను వాడుతూ సీఎం రేవంత్రెడ్డి సభలో ప్రసంగించడం చూస్తే ఆటవిక పాలనలో ఉన్నామా? అనే భావన కలుగుతున్నది. ప్రజలకు నయాపైసాకు పనికిరాని పనులు చేసే చేతకాని పాలనాదక్షతలేని ప్రభుత్వం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ద్వారా ప్రజలకు ఏం మేలు చేస్తున్నది? ఏదైనా అర్థవంతమైన చర్చ జరుగుతున్నదా? ఏమీ లేదు. ప్రజలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో హామీలను అటకెక్కించి, అడ్డగోలు వాదనకు దిగడం సిగ్గుచేటు. ప్రభుత్వ పెద్దల వితండవాదాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారు.
ఆర్ఆర్ఆర్