ముంబై, సెప్టెంబర్ 15 : కోటీశ్వరుడైన హీరో భిక్షగాడిలా మారి అడుక్కోవడం మనం బిచ్చగాడు సినిమాలో చూసి సినిమా కాబట్టి హీరో అలా నటించాడు.. నిజజీవితంలో అలా ఎవరు చేస్తారు? అనుకుంటాం. కానీ, వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడైన ముంబైలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పరాగ్ షా అచ్చం బిచ్చగానిలా మారి చిరిగిన దుస్తులతో ముంబై వీధుల్లో భిక్షం అడుక్కుంటున్న వీడియో వైరల్గా మారింది. ఇదేదో రాజకీయ లబ్ధి కోసమే, ప్రచారం కోసమో చేయలేదని ఎమ్మెల్యే తెలిపారు. జైన్ గురువు రాష్ట్రసంత్ నమ్రముని మహారాజ్ ఇచ్చిన ఉపదేశం మేరకు ఒక భిక్షగాడి కష్టాలెలా ఉంటాయి, అతని రోజువారీ జీవితం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకే తానీ అవతారం ఎత్తినట్టు ఆయన చెప్పారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పరాగ్ షా ఆస్తి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.3,383 కోట్లు. కరుణ, సున్నితత్వం, మానవత్వం ఉండాలన్న తన గురువు బోధనలకు ప్రేరేపితమై బిచ్చగాడిలా మారి ఘాట్కోపర్ రైల్వేస్టేషన్లో బిచ్చగాళ్లతో గడిపానని, ఆ సమయంలో చాలామంది తనను గుర్తు పట్టలేదన్నారు. దీనికి సంబంధించిన మొత్తం వీడియోను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. కాగా, గాయకుడు సోనూ నిగమ్ కూడా 2016లో సామాజిక ప్రయోగంలో భాగంగా బిచ్చగాడిలా వేషం మార్చుకుని రోడ్డుపక్కన గిటార్ వాయిస్తూ భిక్ష అడగటం అప్పట్లో సంచలనం కలిగించింది.