న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : రెండు పసిఫిక్ మహాసముద్రాలకు సమానమైన నీరు భూమి లోపల 2,900 కిలోమీటర్ల లోతులో నిక్షిప్తమై ఉందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. భూమి పై పొర (క్రస్ట్), కేంద్ర భాగం (కోర్)కు మధ్య ఉండే మందపాటి పొరను ‘మాంటిల్’ అంటారు. అయితే, దిగువ మాంటిల్లో అపారమైన నీరు ఉండవచ్చునని తాజా అధ్యయనం ఒకటి అంచనా వేస్తున్నది.
దీనిపై ‘నేచర్ జియోసైన్స్’ కథనం ప్రకారం, భూమి లోపల ఉండే నీరంతా మనం చూసే విశాలమైన సముద్రాల వలె కాకుండా, ఖనిజాల లోపల ఉంటుంది. నీటి నిల్వల అన్వేషణలో సైంటిస్టులు రెండు కొత్త ఖనిజాలు ఇటీవల కనుగొన్నారు. వీటికి అపారమైన నీటిని నిక్షిప్తం చేసుకునే లక్షణముందని వారి అధ్యయనంలో తేలింది.