సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వినాయక చవితి ప్రారంభమై నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఆగమాగం చేస్తుండటంతో మండపాల నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం నుంచి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమవుతుండడంతో సరూర్‌నగర్ చెరువు వద్ద పరిస్థితి ఆందోళన కరంగా ఉందంటూ స్థానికులు అంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది, నగర నలుమూలల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అవుతుంటాయి. హుస్సేన్‌సాగర్ తరువాత స్థానం సరూర్‌నగర్ చెరువుకే ఉంటుంది. ఈ ఏడాది సరూర్‌నగర్ చెరువు వద్ద వంతెన నిర్మాణ పనుల నేపధ్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
కట్టపై పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ముందుగానే గుర్తించి నిమజ్జనానికి తగిన విధంగా తీర్చిదిద్దాల్సిన అధికార యంత్రాంగం, తాపీగా వినాయక పండుగ ప్రారంభమైన తరువాత అక్కడ నిమజ్జానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక నవరాత్రుల్లో మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభమవుతుంటాయి. అక్కడ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు మట్టిని చదును చేయడం, మట్టిని నింపడం వంటి పనులు చేస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే నిమజ్జన కార్యక్రమాలు ఐదో రోజుకు పెరుగుతాయి, 7, 9వ రోజులలోను నిమజ్జనాలు భారీగా జరిగే అవకాశాలుంటాయి. అధికార యంత్రాంగం పనులు వేగంగా పూర్తి చేసి నిమజ్జనం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే విధంగా ప్రణాళికను చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.