‘పోరాటాలు, అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టాం. తెలంగాణ ప్రజలు ప్రజాభవన్‌కు ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. మేం పాలకులం కాదు, మీ సేవకులం…’ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు ఇవి. కానీ, నేడు పూర్తిగా అందుకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్‌పై అక్కసుతో ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు.
కేసీఆర్ గుర్తులను చెరపడమే తమ లక్ష్యమని బాహాటంగా ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా పరుగులు పెడుతున్నారు. బీఆర్ఎస్పై కక్షసాధింపులకు పాల్పడుతూ, ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తూ, అసమర్థ పాలనను కొనసాగిస్తున్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ అని చెబుతూనే అమరవీరుల స్థూపానికి కంచెలు వేశారు. స్వేచ్ఛ కల్పించామని గప్పాలు కొడుతూనే ప్రజల ఆర్థిక స్వేచ్ఛను హరించారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని, ప్రజలు ఎప్పుడైనా రావచ్చని చెబుతూనే జూబ్లీహిల్స్ ప్యాలెస్ చుట్టూ కంచెలు మొలిపించారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చామని గొప్పలకుపోతూ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఆత్మగౌరవానికి నిలువెత్తురూపమైన ఆకాశమంత అంబేద్కర్‌కు కూడా సంకెళ్లు వేశారు.
రేవంత్‌రెడ్డికి అంబేద్కర్ అన్నా, దళితులన్నా ఏ మాత్రం గౌరవం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన దళితులను కనీసం మానవ మాత్రులుగా కూడా చూడరు. అందుకే, ఇటీవల ఓ సమావేశంలో ‘మా బాయిల కాడ పనిచేసేది మీరే కదా’ అని తన అహంకార ధోరణిని బయట పెట్టుకున్నారు. దళితులు అభ్యున్నతి సాధించి, ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఆయన వద్ద పనిచేసే వాళ్లు ఎవరూ ఉండరనేది రేవంత్ రెడ్డి ఆలోచన.
దళితుల అభ్యున్నతిని కాంక్షించి కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన దళితబంధును అటకెక్కించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇస్తున్న రూ.10 లక్షలకు తోడు మరో రెండు లక్షలు కలిపి రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. దళిత జాతి ప్రగతి దిశగా అడుగులు వేయకూడదనే దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు.
కేసీఆర్ కట్టించారనే అక్కసుతో దేశంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహానికి కూడా రేవంత్‌రెడ్డి సంకెళ్లు వేసి, అవమానిస్తున్నారు. చుట్టూ కంచెలు మొలిపించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి నాడు ఒక్క పూలమాల కూడా వేయడం లేదు. ఇతరులూ వేయకుండా అడ్డుకుంటున్నారు. అలంకరణ చేయడం లేదు. కనీసం చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రం చేయడం లేదు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల ముందు అంబేద్కర్ జయం తి నాడు కనీసం నివాళులర్పించకుండా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపారు. అదే ఎన్నికల కోడ్ ఉండగా.. మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి నాడు నివాళులర్పించారు. అప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ అడ్డు రాలేదా?
కేసీఆర్ నిర్మించి, మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టిన సచివాలయంలో అడుగుపెట్టడం కూడా రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పరిమితమవుతున్నారు. రేవంత్‌రెడ్డి అహంకార ధోరణి అంతటితో ఆగలేదు. దళితుడన్న ఒకే ఒక్క కారణంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు యాదాద్రి సాక్షిగా చిన్నపీట వేశారు. ఇలా ఒకటా, రెండా.. అంబేద్కర్‌ను, దళితులను రేవంత్‌రెడ్డి అనేక విధాలుగా అవమానించారు, అవమానిస్తూనే ఉన్నారు.
మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3 ప్రకారం ఏర్పడిన తెలంగాణకు నేడు రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. అదే రాజ్యాంగంలో అంబేద్కర్ మరో ఆర్టికల్‌ను కూడా పొందుపరిచారు. హామీలను మరిచి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా, అహంకార ధోరణితో వ్యవహరించే వాళ్లను గద్దె దించేందుకు ఆర్టికల్ 326 ప్రకారం ఓటుహక్కు కల్పించారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకుంటే మంచిది. అంబేద్కర్ కల్పించిన ఓటుహక్కుతో ప్రజలు ఆయనను ఓడించే రోజు దగ్గరలోనే ఉంది.
ఏప్రిల్ 14న మరోసారి అంబేద్కర్ జయంతి వస్తున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన తప్పును గ్రహించి, కేసీఆర్ నిర్మించిన ఆకాశమంత ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న గేట్లను తెరువాలి. అంబేద్కర్‌కు నివాళులర్పించాలి. లేకపోతే ఆత్మగౌరవ పోరు తప్పదు. వేలాది మందితో అంబేద్కర్ విగ్రహం వద్దకు బైలెల్లుతాం. విగ్రహం చుట్టూ మొలిచిన కంచెలను కూకటివేళ్లతో సహా పెకిలిస్తాం. అంబేద్కర్‌కు రేవంత్‌రెడ్డి వేసిన దాస్య శృంఖలాలను తెంచుతాం.
– (వ్యాసకర్త: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్