చీకట్లో చిల్లర పడేసుకొని వెలుతురులో వెతికాడట వెనుకటికొకడు. వాడు చీకట్లో వెతకడు.. వెలుతురులో ఎంత వెతికినా అది దొరకదు. తెలంగాణలో కాంగ్రెస్ చెప్తున్న ‘ప్రజాపాలన’ కూడా అచ్చం అలాంటిదే. పులికేసికి ఎక్కువ, పిచ్చి తుగ్లక్కు తక్కువలా సాగుతున్న కాంగ్రెస్ పాలనలో భూతద్దం పెట్టి వెతికినా ‘ప్రజాపాలన’ కనపించటం లేదు. అసలు రాష్ట్రంలో పాలన అంటూ ఒకటి ఏడిస్తేనే కదా.. ప్రజాపాలనో, పాపిష్ఠి పాలనో చెప్పడానికి.
CM Revanth Reddy | ఆనాటి రోజులు తెస్తానని అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పినట్టే రేవంత్‌రెడ్డి ఆనాటి రోజులను నిజంగానే తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తూనే నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలను ఆయన మోసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పినట్టే కాంగ్రెస్ నాయకులు నిజంగానే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ రోజుల్లో జరిగినట్టే అక్రమ కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, అణచివేతలు రాష్ట్రంలో ఇప్పుడూ కొనసాగుతుండటమే అందుకు నిదర్శనం. మార్పు.. మార్పు.. అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు నిజంగానే తెలంగాణలో మార్పు తీసుకొచ్చారు. అది అలాంటి ఇలాంటి మార్పు కాదు. సక్కగా సాగుతున్న తెలంగాణ సంసారాన్ని సర్వనాశనం చేసి రోడ్డున పడేశారు. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న ‘అసలు’కు కొసరు కూడా కలిపి ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ గప్పాలు కొట్టింది. కానీ, ఇప్పుడు కొసరు సంగతేమో గానీ, ‘అసలు’కే ఎసరు పెట్టింది. ఆరు గ్యారెంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులు వాటిని పూర్తిగా పక్కనపెట్టేసి.. తమకు గ్యారెంటీగా ‘కమీషన్’ వచ్చే మూసీ జపం చేస్తున్నారు. పాలనను పూర్తిగా గాలికి వదిలేసి స్కాములు చేసేందుకు పాకులాడుతూ ‘స్కాంగ్రెస్’ అన్న పేరును సార్థకం చేసుకుంటున్నారు.
అసలు మూసీ బ్యూటీఫికేషన్ అన్నదే అతి పెద్ద లూటీఫికేషన్. వృక్షంలోని వేర్లు, కొమ్మలను నరికేస్తే మధ్యనున్న మోడు బతుకుతుందా? అలాగే నదీ జన్మస్థానాన్ని నాశనం చేస్తే ఆ నది బతుకుతుందా? ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్నదదే. ఓ వైపు నావికాదళం రాడార్ స్టేషన్ పేరిట మూసీ జన్మస్థానాన్ని నాశనం చేస్తూ, మరోవైపు మూసీ పక్కనే సిమెంట్ పరిశ్రమ పెట్టేందుకు అదానీ కంపెనీకి అనుమతిస్తూ నదిని పరిరక్షిస్తానని ప్రగల్భాలు పలకడం రేవంత్‌కే చెల్లింది. మూసీకి జీవనాధారమైన నీటి వనరును సర్వనాశనం చేస్తూ నదిని పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరం.
వాస్తవానికి, హైదరాబాద్ నగర పరిధిలో మూసీ ఎప్పుడో అన్యాకాంత్రమైపోయింది. ఒక పిల్ల కాలువ మాదిరిగా మారిపోయింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ల నిర్మాణం తర్వాత అసలు మూసీలో నీళ్లు రావడమే గగనమైపోయింది. నగరంలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరే మూసీకి దిక్కయ్యాయి. ఆ నీళ్లే లేకపోతే మూసీ ఎప్పుడో ఎడారిగా మారిపోయేది. మూసీని పరిరక్షించాలనుకుంటే మొదట నగరం నుంచి విడుదలయ్యే మురుగును శుద్ధిచేయాలి. అప్పుడే మూసీ సుందరీకరణ సాధ్యపడుతుంది. అందుకే, గత బీఆర్ఎస్ సర్కార్ మురుగునీటి శుద్ధికి ప్రాధాన్యమిచ్చింది. ఈ నేపథ్యంలో 31 నీటిశుద్ధి ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది.
మూసీ పరిరక్షణ విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన మార్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తే సరిపోయేది. నిందలేయడం తప్ప.. నిర్మాణమే తెలియని హస్తం పాలకులు అలా ఎందుకు చేస్తారు? అలా చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకవుతుంది? అందుకే, కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని వారు చేస్తున్నారు. అందులో భాగంగానే మూసీ వెంట నివసిస్తున్నవారి వద్ద నుంచి ఏండ్లుగా పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వారిపైనే కబ్జాకోరులు, ఆక్రమణదారులు అని ముద్రవేశారు. రెండు, మూడు దశాబ్దాలుగా అక్కడే జీవనం సాగిస్తున్న నిరుపేదల గూళ్లను కూల్చడం అత్యంత హేయం. ఒక ప్యాకేజీ లేకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారు. రివర్బెడ్, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ అంటూ పేదలను ఖాళీ చేయిస్తున్న కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్తులోనూ ఇలాగే వ్యవహరిస్తుందా? పేదలు ఖాళీ చేసిన జాగలను ఖాళీగానే వదిలేసి నదిని పరిరక్షిస్తారా? సుందరీకరణలో భాగంగా మూసీ చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్‌లు, అద్దాల మేడలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. అంటే..
ఇది ఒకవిధంగా పేదలుండే జాగలను కొల్లగొట్టి పెద్దలకు కట్టబెట్టడమే. అదంతా జరగాలంటే చేతిలో చిల్లిగవ్వ లేని రేవంత్ సర్కార్‌కు పెట్టుబడి కావాలి. పేదలను బెదిరించి లాక్కుంటున్న భూములే ఆ పెట్టుబడి. రూ.లక్షన్నర కోట్లు పెట్టనున్న కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారమే మూసీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్‌బ్యాంక్. ఆ భూముల్లోనే అద్దాల మేడలు వెలుస్తాయి. మరి అప్పుడు రివర్బెడ్లు, ఎఫ్టీఎల్లు, బఫర్జోన్లు ఉండవా? పేదలకు అడ్డువచ్చిన నిబంధనలు, నియమాలు పెద్దలకు వర్తించవా? వాస్తవానికి, పెద్దల మధ్య పేదలుండటం కాంగ్రెస్‌కు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే, ముందస్తుగా బలవంతంగా వారిని ఖాళీ చేయిస్తున్నది.
మూసీ పరిరక్షణకు ప్రజల మద్దతు ఉందని కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తుండటం గమనార్హం. నిజంగా ఆ పార్టీ నాయకులు చెప్తున్నట్టు నగర ప్రజల మద్దతే గనుక కాంగ్రెస్ పార్టీకి ఉండి ఉంటే హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ చేస్తూ నగరం బయట సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసేవారు కాదు. హైదరాబాద్‌లోని మూసీ ఒడ్డున పాదయాత్ర చేసే ధైర్యం లేకనే నల్గొండ జిల్లాను ఎంచుకున్నారు. నగరంలో తిరిగితే చీదరింపులు, ఛీత్కారాలు తప్పవని ముఖ్యమంత్రి ముందుగానే గ్రహించారు. అయినా ఉపద్రవాలను తప్పించుకోవడం మన ముఖ్యమంత్రికి కొత్తేమీ కాదు కదా?
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ దూదిమెట్ల బాలరాజు