ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, 500 రోజులు దాటినా అమలుచేయడం లేదు. ఎన్నికల రేసులో ఉండేందుకు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించామని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలకు నో గ్యారెంటీ బోర్డు పెట్టేశారు.
ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాకవాటిని విస్మరించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. 6 గ్యారెంటీలతోపాటు డిక్లరేషన్లను గాలికొదిలేయడంతో రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించామా? అని ప్రజలు నేడు పశ్చాత్తాపం చెందుతున్నారు.
గద్దెనెక్కి 500 రోజులు దాటుతున్నా కాంగ్రెస్ సర్కారుకు ఇంకా పద్దుల లెక్కలు తేలడం లేదు. రైతులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు వారంటీ లేని గ్యారెంటీల కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసి, ఆశలు వదులుకున్నారు. ఈ ఐదు వందల రోజుల కాంగ్రెస్ పాలనలో ఒకటీ, అరా తప్ప అన్ని వాగ్దానాలు కాగితాలకే పరిమితమయ్యాయి. రైతు భరోసా నుంచి మహాలక్ష్మి వరకు, చేయూత నుంచి యువవికాసం వరకు ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అరకొరగా అమలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బస్సుల సంఖ్య, ట్రిప్పులను కుదించడంతో ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నది. మహిళలకు నెలనెలా ఇస్తామన్న రూ.2,500లకు అతీగతీ లేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు కొంతమందికే వర్తిస్తున్నది.
ఎకరానికి ఏటా రూ.15 వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వకపోగా, రైతుబంధును బంద్ పెట్టారు. వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న రూ.12,000 ఇవ్వలేదు. వరికి రూ.500 బోనస్‌ను సన్నవడ్లతో సరిపెట్టారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, నెలకు రూ.4,000 పింఛన్ వంటి హామీలు ఒక్క అడుగు ముందుకుపడలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాగ్దానాలను నమ్మి మోసపోయామనే అంతర్మథనం ప్రజల్లో ప్రారంభమైంది.
మరోవైపు రజతోత్సవ సభలో కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించిన వైనాన్ని, అధికారంలోకి వచ్చాక రాష్ర్టాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దిన విధానాన్ని ప్రజలు మననం చేసుకుంటున్నారు. మరో ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉండాలన్న కేసీఆర్ పిలుపుతో ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. తమ బతుకులు బాగుపడాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అనే భావనలో ప్రజలున్నారు. అందుకే మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కలలు ఫలించాలని ఆశిద్దాం.
– కోలేటి దామోదర్, 98491 44406
(వ్యాసకర్త: పోలీస్ హౌసింగ్
కార్పొరేషన్ మాజీ చైర్మన్)