పార్లమెంట్ ఎన్నికలు పలువురి నోటి వెంట శపథాలు చేయిస్తున్నాయి. స్థల, కాలాలను కానకుండా, కన్నుమిన్నూ ఎరుగని రీతిలో కొందరు నోటికొచ్చింది వాగేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అధికారం దక్కి పీఠమెక్కినా ఏదో అభద్రతా భావన, తరుముతున్న వేదన హస్తం పార్టీ నేతలను నిద్రకు దూరం చేస్తున్నట్టుగా ఉన్నది. లేకపోతే ఇలా వారెందుకు రెచ్చిపోతారు? విదేశీ గడ్డపై హుందాతనాన్ని గాలికొదిలేసి, సినిమాలలో బాలకృష్ణలా తొడకొట్టే డైలాగ్‌లు అందుకోవడం వెనుక సీఎం రేవంత్‌లో ఉన్న కలవరం బట్టబయలైపోయింది.
రాష్ట్ర హక్కులకైనా, సౌభ్రాత్రృత్వానికైనా గులాబీ జెండానే బలమైన అండ. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు, స్వరాష్ట్ర ఆకాంక్షలు ఎల్లకాలం ప్రజారాశుల అనుభవంలో ఉండాలంటే బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఉండి తీరాల్సిందే. వందల ఏండ్లుగా ఎన్నో గండాలను దాటుతున్న తెలంగాణ, మరో ముప్పును తిప్పికొట్టితీరుతుంది. విషయ పరిజ్ఞానం ఉన్న కొంతమంది మేధావులు కావొచ్చు కానీ, మేధావులు అందరూ మంచివారు కాలేరు. ఏ నినాదాల వెనక, ఏ వర్గం ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఆలోచనపరులందరూ అర్థం చేసుకోవాలి.
బీఆర్ఎస్ను బొందపెడతామనే గజకర్ణ, గోకర్ణ ఘీంకారం వెనుక ముఖ్యమంత్రి గందరగోళ స్థితి అందరికీ కనిపిస్తూనే ఉన్నది. బహుశా ఢిల్లీ పెద్దలకు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బాకీపడ్డవి, తెలంగాణ ప్రజలకు బాకీపడ్డ ఆరు గ్యారంటీలు, 420 హామీలు.. ఇలా ఏవేవో రేవంత్‌రెడ్డికి టెన్షన్‌ను కలిగిస్తున్నట్టున్నాయి. దానివల్లనే ఏమో మారిన మనిషిలా కనిపించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఉక్రోషాన్ని పంటిబిగువున పట్టలేక పడరాని పాట్లు పడుతున్నారు.
‘కడుపులో కత్తులు, నోట్లో బెల్లం’ సీరియల్‌ను కలిసి పండిస్తున్న కాంగ్రెస్ క్యాబినెట్ సభ్యులు అందరూ, పోటీలు పడి స్పైసీ ప్రకటనలు చేసేస్తున్నారు. కోమటిరెడ్డి అయితే ‘39 ముక్కలు’ మాటందుకున్నాడు. రెండు దశాబ్దాల కిందట జన తెలంగాణ కోసం స్వర భాస్వరమైన బెల్లి లలితను 17 ముక్కలుగా నరికేశారు. అలాగే నేడు స్వరాష్ట్ర అస్తిత్వమే ఆత్మగా కలిగిన గులాబీ జెండాను రాజకీయంగా 39 ముక్కలు చేస్తామని వాగుతుండటం ఎంత వెగటు పుట్టించే వెకిలి పలుకులో వారికి అర్థం అవుతుందని అనుకోలేం.
దశాబ్దం తర్వాత దొరికిన అవకాశాన్ని హస్తం పార్టీ నేతలు ఎలా, ఏ లక్ష్యాల కోసం వినియోగిస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాస్తవానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల కుమ్మక్కు కుయుక్తిని బండి సంజయ్ కుండబద్దలు కొట్టినట్టుగా బహిరంగంగానే వెళ్లగక్కేశారు. ఆయన చాలా స్పష్టంగా ‘మనం (కాంగ్రెస్, బీజేపీ) తలపడటం పక్కనపెట్టి ముందు బీఆర్ఎస్ను బొందపెడదాం’ అని బండి కమలాన్ని చేతికి అందించారు. ఏడు దశాబ్దాలుగా దేశంలో అక్షరాలా జరుగుతున్నదే, నోరున్న బండి బట్టబయలుచేశారు. రాజకీయ నాణానికి బొమ్మా, బొరుసులా మారి, దేశం నుదిట మానని రాచపుండులా మారిన కాంగ్రెస్, బీజేపీ రాజకీయ వ్యవస్థను చదరంగంలా మార్చుకున్నాయి.
నినాదాలను జనాల కోసం, విధానాలను బడాబాబుల కోసం రూపొందిస్తూ, పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ నడిచే నత్తనడకను భారత్‌కు అంటగట్టారు. ఈ రెండు జాతీయ పార్టీల ఉమ్మడి రాజకీయ లక్ష్యం ద్విపాత్రాభినయం మాత్రమే. రాజకీయాలను వంతులవారి క్రీడగా మార్చుకొని, విస్తారం తెచ్చిపెట్టిన అహంకారంతో దశాబ్దాలుగా ఈ రెండు జాతీయ పార్టీలూ ప్రాంతీయ ఆకాంక్షలను పాతరపెట్టే ఎత్తులే వేస్తూ వస్తున్నాయి. దేశ రాజకీయ వ్యవస్థను లోతుగా అర్థం చేసుకున్న బుద్ధిజీవులెవరికైనా బండి, రేవంత్, కోమటిరెడ్డిల శకుని శపథాలు కొత్తగా అనిపించవు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రాష్ట్ర సర్కార్ వ్యవహారాలు ‘ఓవర్ టూ ఢిల్లీ’లా మారిన తర్వాత ఇలాంటి రాజనీతిని తప్ప మరేమీ ఆశించజాలం. భారీ పరిమాణం, వైవిధ్య భరితమైన జనాభా, విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన భారతదేశాన్ని ఐక్యంగా, కలిపి కొనసాగించేందుకే రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య తరహా విధానాన్ని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గీటురాయిగా రూపొందించారు.
కానీ, ఇండియాయే ఇందిరా, ఇందిరాయే ఇండియా నినాదోన్మాదంతో కాంగ్రెస్ సర్కార్ సమాఖ్య స్ఫూర్తిని, ప్రాంతాల, ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇనుప పాదాల కింద అణచే ప్రయత్నం చేసిన చరిత్రను, చెరసాలలే విపక్షాల చిరునామాలుగా మార్చేసిన నిన్నటి దుర్దినాలను ఏ బుద్ధిజీవి మాత్రం మరువగలడు? కాంగ్రెస్, బీజేపీల పొలిటికల్ డీఎన్ఏ ఒక్కటే. భారతదేశ రాజకీయ వ్యవస్థను ద్విముఖీన వీలైతే ఏక ముఖీన వ్యవస్థగా స్థిరపరచాలనేదే వాటి ఏజెండా. కానీ, ప్రాంతీయంగా ప్రజల ఆకాంక్షలు, అవస్థలు, ఆశయాలు ఈ రెండు జాతీయ పార్టీల కండ్లకు అసలే కానరావు. వైవిధ్యాల భారతదేశంలో విభిన్న చారిత్రక కారణాల వెలుగులో పురుడుపోసుకున్న ప్రాంతీయ పార్టీలది పవిత్రమైన చరిత్ర.
ఆత్మగౌరవ పోరాటంతో స్వరాజ్యం తొలిరోజుల్లోనే తమిళనాట జెండా ఎగరేసిన ద్రవిడ మున్నేట్ర కజగం దగ్గర నుంచి అస్సాం అస్సామీయుల కోసమే నినాదంతో అస్సాం గణపరిషత్, సుఖ సిక్కిం లక్ష్యంతో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, మా, మాతి, మనుష్ నినాదంతో తృణమూల్ కాంగ్రెస్.. ఇలా అనేక ప్రాంతీయ పార్టీల పుట్టుకలో ఎన్నో అపురూపమైన ఆకాంక్షలున్నాయి. అలాగే తెలంగాణ చరిత్ర, గులాబీ జెండా పుట్టుక, త్యాగం దేశ పార్లమెంటరీ వ్యవస్థకే కొత్త శోభను అద్దింది.
బొంబాయి, దుబాయికి బతకపోవుడో లేక తిరగబడి అడవి బాట పట్టుడో తప్ప మరో మార్గం లేని తెలంగాణ యువతరానికి ఆశల దీపమై తొవ్వను పరిచింది బీఆర్ఎస్. ఇక్కడి భూమిపుత్రుల శాశ్వత రాజకీయ శక్తిగా గులాబీ పార్టీ ప్రతి గుండెల్లో స్థిరపడిపోయి ఉన్నది. ప్రాంతీయ పార్టీలను పొట్టనపెట్టుకోవాలనే ఉబలాటం దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలకు ఉన్నదే. కానీ, అధికారానికి దూరమైనంత మాత్రాన గులాబీ జెండాను మింగేస్తామని కాంగ్రెస్ పార్టీ పాలకులు అనుకుంటే, ఆ పాపపు పనికి చేదోడుగా నిలుస్తామని కాషాయ పార్టీ పాలకులు కలలు కంటే అది వారి అవివేకమే అవుతుంది.
అసలు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ను బలోపేతం చేయాలనుకున్నదే ఈ ప్రమాదాలకు ఎదురెళ్లేందుకు. తెలంగాణకు భవిష్యత్తులో ఎదురయ్యే రాజకీయ ఉపద్రవాలకు ఆనకట్టగా గులాబీ పార్టీని నిర్మించాలని ఆశించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, నిరంతర, లోతైన అధ్యయనం కలిగిన కేసీఆర్‌కు, ‘ఎడ్లెన్ని చచ్చినవనేది కాదు వడ్లెన్ని దక్కినవనే’ నైజం గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ విస్తరణ ఉన్మాదాన్ని నిలువరించజాలదనే వాస్తవం తెలుసు.
తెలంగాణ రాష్ట్ర చారిత్రక గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి భవిష్యత్తులో ఎదురయ్యే ఉన్మాదపు ఉత్పాతాన్ని స్పష్టంగానే అంచనా వేసుకున్న నాయకుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై సాధించుకున్న స్వరాష్ర్టాన్ని, సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిగా మార్చుకున్నాక, సామాజిక సంఘర్షణలకు తావులేని శాంతి నిలయంగా కలకాలం వర్ధిల్లేందుకు రాజకీయ కార్యాచరణను రూపొందించుకున్నారు. తెలంగాణ సౌభాగ్యం, శాంతి, సుస్థిరత ప్రాంతీయ రాజకీయ లక్ష్యంతోనే కాదు జాతీయ రాజకీయ బలాబలాలపై కూడా ఆధారపడి ఉన్నదనే నిజాన్ని కేసీఆర్ స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలతో విపక్షాలను వేటాడి, వేగంగా విస్తరిస్తుంటే, నిలువరించలేని నిరర్ధక జాతీయ పార్టీగా కాంగ్రెస్ మారుతున్న స్థితిని అంచనా వేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడ్డ ప్రతి రాష్ట్రంలో కమలమే విజయం సాధిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు వేగంగా ఉరితాడు పేనుతున్నది చూసే కేసీఆర్ అనివార్య స్థితిలో జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేయాలనుకున్నారు. తెలంగాణపై ముప్పు ముసురుకోకుండా, తానే తెలంగాణను శక్తిగా మలిచి ఎదురు నిలిచి, ఆ పార్టీలను వెనక్కు నెట్టేయాలనుకున్నారు.
తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు, జాతీయ వర్తమాన లక్ష్యాలను జతకూర్చి జమిలీగా రాజకీయ ఆశయంగా నిలదొక్కుకోవాలనుకున్నారు. కానీ, తాను మునగడంతో పాటు నమ్మిన ప్రాంతీయ పార్టీలు, ప్రజలను ముంచే కాంగ్రెస్ పార్టీకి దేశ భిన్నత్వాన్ని బలివ్వడమే అలవాటు కదా? బీజేపీ పన్నిన వ్యూహంలో హస్తం పావుగా మారి తెలంగాణకు ముప్పును దగ్గరగా తెచ్చి పెట్టింది.
చాలా తెలివిగా రాష్ట్ర రాజకీయాల్లోకి కాంగ్రెస్‌ను లాగి, జనపథ్ కుటుంబాన్ని మొత్తం తెలంగాణలోనే బొంగరంలా తిప్పి, కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాదిన ఉన్న మూడు రాష్ర్టాలను బీజేపీ ఎగురేసుకుపోయింది. హస్తినలో మతితప్పిన ఎత్తులేస్తున్న హస్తం పార్టీ పెద్దలు ఇక ఏమాత్రం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడలేరు. సమాఖ్య స్ఫూర్తి, లౌకికతత్వం, మత సామరస్యాన్ని కాంగ్రెస్ కాపాడుతుందని ఎవరైనా భ్రమిస్తే, కసాయిని నమ్మి గొర్రెల మంద వెంట అడుగులు వేసినట్టుగానే ఉంటుంది. అసలు బీజేపీ రాజకీయ ఎత్తుగడలను నిలువరించడం దేవుడెరుగు, కనీసం అర్థం చేసుకునే శక్తి కూడా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కోల్పోయింది.
సుదీర్ఘ కాలం వాజపేయి, అద్వానీలు విభిన్న అభిప్రాయాలతో దేశంలో జుగల్బందీని నడిపించారు. ఇప్పుడు మోదీ, అమిత్‌షా ఏకాభిప్రాయంతో భిన్నాభిప్రాయాలను వధిస్తూ, విస్తరిస్తూ స్థిరపడిపోతున్నారు. రేపటి లోక్‌సభ ఎన్నికల్లో, దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించే ఫలితాలు బుద్ధిజీవులందరి ఊహకు అందనివేమీ కావు. దీపం పేరు చెప్పి చీకటి తొలగిపోతుందనే భ్రమను భారతదేశం అంతటా కల్పిస్తూ, కమలం పరుగులు తీస్తుంటే, హస్తం ఇంకా ఆదానీ చుట్టే, అర్థం కాని భాషతో అవస్థలు పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దేశాన్నే కాదు, మన త్యాగాల తెలంగాణను బీజేపీ ముప్పు నుంచి కాపాడలేదు. రాష్ట్ర హక్కులకైనా, సౌభ్రాత్రృత్వానికైనా గులాబీ జెండానే బలమైన అండ.
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు, స్వరాష్ట్ర ఆకాంక్షలు ఎల్లకాలం ప్రజారాశుల అనుభవంలో ఉండాలంటే బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఉండి తీరాల్సిందే. వందల ఏండ్లుగా ఎన్నో గండాలను దాటుతున్న తెలంగాణ, మరో ముప్పును తిప్పికొట్టితీరుతుంది. విషాదవశాత్తూ కొంతమంది కుహనా పండితులు దారి తప్పి, తెలంగాణ ఆలోచనలను పక్కదారి పట్టించేస్తున్నారు. విషయ పరిజ్ఞానం ఉన్న కొంతమంది మేధావులు కావొచ్చు కానీ, మేధావులు అందరూ మంచివారు కాలేరు. ఏ నినాదాల వెనక, ఏ వర్గం ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఆలోచనపరులందరూ అర్థం చేసుకోవాలి. బొంద పెడదామనే జాతీయ పార్టీల జాదూవేషాలను రాష్ట్ర పొలిమేరల్లోనే వేలాడదీయాలి.
తెలంగాణ సామాజిక పొందికే గులాబీ పార్టీ భావజాలం. నేల చారిత్రక ఆశయాలే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు. ఎన్నో వర్గాల ప్రాతినిధ్య ఆశయం, ఎన్నో కలలకు దారిదీపం, చరిత్రకు వన్నె తెచ్చే పాత్రకు ప్రతిరూపం బీఆర్ఎస్. అది ముక్కలు కాదు.. మరో చరిత్ర సృష్టికి రగిలే జెండాలా రెపరెపలాడుతూనే ఉంటుంది.
వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్
డాక్టర్ ఆంజనేయగౌడ్