దక్కన్ పీఠభూమిలో సగటు వర్షపాతం కేవలం 90 సెంటీమీటర్ల మేరకే ఉన్నా తెలంగాణలో నీటివనరుల సంరక్షణ వినియోగంలో ఒక ఆదర్శ నమూనాను కేసీఆర్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఉష్ణమండల శుష్కప్రాంతంగా ఉన్న తెలంగాణ మాగాణం ఆకుపచ్చని చీరను ఎలా నేసిందో అనుభవంలోకి తీసుకువచ్చారు. సంక్షుభిత తెలంగాణ వ్యవసాయాన్ని విరామం, విశ్రాంతి ఎరగని కృషి ద్వారా సుభిక్షంగా మార్చిన తీరు ఒక ఇతిహాసం.
రాజకీయుడు రేపటిని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ ప్రజాపాలకుడు, రాజనీతిజ్ఞుడు రేపటి తరాన్ని గురించి ఆలోచిస్తాడు. భూగర్భ జల వనరుల శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన సర్వే తెలంగాణ భూగర్భంలో నీటి మట్టాలు నాలుగు మీటర్ల మేరకు పెరిగాయని తెలియజేసింది. ఈ సంస్థలు విడుదల చేసిన 2023 నివేదికలో అబ్బురపరిచే అంశాలున్నాయి. 2013లో 472 టీఎంసీలుగా ఉన్న భూగర్భ జలాలు 2023 నాటికి 739 టీఎంసీలకు పెరిగాయి. సాగు కోసం భూగర్భ జలాల వెలికితీత 58 శాతం నుంచి నుంచి 39 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. తెలంగాణ భూగర్భంలో దాదాపు రెండు నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో సమానమైన జలసిరి నిక్షిప్తమై ఉన్నదని తెలియజేసింది. గత పదేండ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బహుముఖ కృషి ఫలితంగా నీటిమట్టాలు పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా 27 వేలకు పైగా చెరువులు పునరుద్ధరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని భారీ మధ్యతరహా ప్రాజెక్టులను అనుసంధానించారు. చెరువులను నింపడం, చెక్ డ్యాంలను కట్టడం వేలాది ఇంకుడు గుంతలు తవ్వించడం ద్వారా ఇది సాధ్యమైందని కేంద్ర జల మంత్రిత్వశాఖ తెలియజేసింది. తెలంగాణలో హరితహారం ప్రభావం వల్ల వార్షిక సగటు కంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నది.
కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో నీరు సహజంగా ఉబికివచ్చే బుగ్గబావుల నెలవుగా మారింది. 18 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలంలో 2022లో 110 సెంటీమీటర్లు, 2023లో 86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతమైన 74.4 సెంటీమీటర్ల కంటే ఎక్కువే. వ్యవసాయరంగం మీద ఆధారపడిన 75 శాతం మంది ప్రజల్లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. 2014కు ముందు వీరు తిండి అవసరాల కంటే తక్కువ ఉత్పత్తి చేసేవారు. 2021-22లో తెలంగాణ 88 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. దీనిలో 93 శాతం వాటా సన్నకారు రైతులదే. అలాగే పంటల సాగు 131 లక్షల ఎకరాల నుంచి 238 లక్షల ఎకరాలకు పెరిగింది. పంట ఉత్పత్తి 145 శాతం పెరిగింది. గత తొమ్మిదేండ్ల కాలంలో ధాన్యాల, విత్తనాల ఉత్పత్తిలో అతివేగంగా తెలంగాణ పురోగమించింది. ఇదే క్రమంలో సమాంతరంగా నీటిపై ఒత్తిడిని కలిగించే పంటల స్థానంలో భూముల స్వభావం, వాతావరణం, సాగునీటి పరిమితుల ఆధారంగా బహుళ పంటల సమీకృత వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చింది. ఎల్‌నినో, లానినోల ప్రభావం వల్ల కలుగుతున్న వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా కలుగుతున్న ఈ కాలంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించే పద్ధతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ధరల పెరుగుదలలో వినియోగదారుల, స్థూల టోకు ధరల సూచీని ప్రభావితం చేసే కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగుకు అపరిమితమైన సబ్సిడీతో కూడిన ప్రోత్సాహాన్ని తెలంగాణ ఇస్తున్నది. ఆహారశుద్ధి యూనిట్లను స్థాపిస్తున్నది. భూసార పరీక్షలను జరిపిస్తూ, సేంద్రియ ఎరువుల వాడకాన్ని విస్తరిస్తున్నది. మన లాంటి భౌగోళిక, నైసర్గిక స్వరూపం ఉన్న పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల్లో నీటి యాజమాన్య సంరక్షణ విధానాలు లేని కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.
కర్ణాటకలో 13 జిల్లాలు కరువు బారిన పడ్డాయి. కరువు నేలలో దుఃఖమయమైన రైతు జీవితాల్లో వెలుగులు తేవాలన్న లక్ష్యంతో గొప్ప విప్లవ వెల్లువను సృష్టించిన శక్తి కేసీఆర్. నీటికి నడకనే కాదు నర్తనమే నేర్పిస్తున్నారు. కేసీఆర్ అసమాన కార్యదీక్ష కొనసాగేందుకు ఐక్యంగా అందరం ఆయన వెంట నిలువడమే మనం నిర్వర్తించాల్సిన చారిత్రక బాధ్యత.(వ్యాసకర్త: దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ సభ్యుడు)
-అస్నాల మైత్రేయ