నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రంగురంగుల పోస్టర్లు, ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు, సోషల్ మీడియాలో ‘హ్యాపీ విమెన్స్ డే’ సందేశాలతో హోరెత్తిపోయే రోజు. కానీ, ఈ వేడుకల వెనుక ఉన్న అసలు చరిత్రను మనం విస్మరిస్తున్నాం. 1910లో అంతర్జాతీయ కమ్యూనిస్టు మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెటికిన్ ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించినప్పుడు..ఆమె లక్ష్యం వంటల పోటీలు లేదా ఫ్యాషన్ షోలు కాదు. శ్రామిక మహిళల హక్కులు, సమానత్వం, ‘ఇక మీదట యుద్ధాలు వద్దు‘ అనే శాంతి సందేశం. ఇపుడు 2026లో నిలబడి చూస్తే, ఆ లక్ష్యాలన్నీ కార్పొరేట్ వేడుకల కింద నలిగిపోతున్నాయి.
మహిళలపై హింస నేడు నాలుగు గోడలకే పరిమితం కావడం లేదు. అది కుటుంబం, సమాజం, రాజకీయాలు, ప్రభుత్వ యంత్రాంగం అనే నాలుగు కోణాల్లో విస్తరించింది. రమిజాబీ నుంచి నేటి సుశ్రుత, రవళి ఉదంతాల వరకు.. ప్రేమిస్తే ప్రాణాలు తీయడం, నిరాకరిస్తే యాసిడ్ పోయడం వంటి క్రూరత్వం నిత్యకృత్యమైంది. 2026 నాటి డిజిటల్ యుగంలో మహిళలపై ‘సైబర్ హింస’ సరికొత్త ఆయుధంగా మారింది. డీప్ ఫేక్ టెక్నాలజీ, సోషల్ మీడియా వేధింపుల ద్వారా మహిళల గౌరవాన్ని బజారున పడేస్తున్నారు. ఇది కేవలం మానసిక హింసే కాదు, స్త్రీల స్వేచ్ఛను హరించే ‘డిజిటల్ పోలీసింగ్’ కూడా.
అభివృద్ధి ముసుగులో రాజ్యహింస
దేశవ్యాప్తంగా సాగుతున్న ‘విధ్వంసకర అభివృద్ధి’ ప్రాజెక్టుల వల్ల ఆదివాసీ మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. తమ భూమిని, అడవిని కాపాడుకోవడానికి పోరాడుతున్న మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి విశాఖ ఏజెన్సీ వాకపల్లి వరకు.. పాలకవర్గాలు అత్యాచారాలను ఒక యుద్ధ తంత్రంగా (Weapon of War) వాడుకోవడం అత్యంత దారుణం. ప్రశ్నించే గొంతుకలను జైళ్లలో బంధించడం ద్వారా మహిళల పోరాట పటిమను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది.
పితృస్వామ్య రాజకీయాలు-ద్వంద్వనీతి
మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ జరుగుతున్న రాజకీయం మన దేశంలోని పురుషాధిపత్య ధోరణికి నిదర్శనం. అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడానికి ఇష్టపడని కొన్ని పార్టీలే, మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ‘మహిళా సాధికారత’ అనే ఆకర్షణీయమైన మాటలు చెప్తున్నాయి. సమాజంలో మరో విచిత్రమైన పరిస్థితి ఉన్నది. బతుకమ్మ, సమ్మక్క-సారక్క, దుర్గమ్మ అంటూ దేవతలను పూజిస్తారు, కానీ నిజజీవితంలో మహిళను కనీసం ‘మనిషి’గా గుర్తించడానికి కూడా పితృస్వామ్య సమాజం సిద్ధంగా లేదు. పూజలు, పండుగలు పెరిగిపోతున్నాయి. కానీ మహిళలపై గౌరవం మాత్రం కించిత్ కూడా పెరగడం లేదు.
నేటికీ మన పాఠ్యపుస్తకాలు పాతకాలపు భావజాలాన్నే నూరిపోస్తున్నాయి. ‘అమ్మ వంట చేస్తుంది-నాన్న ఆఫీసుకు వెళ్తాడు‘ అనే చిత్రణల ద్వారా చిన్నప్పటి నుంచే లింగవివక్షకు పునాదులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివక్ష లేని, శాస్త్రీయమైన విద్యాబోధన కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. కేవలం అక్షరాస్యత పెరిగితే సరిపోదు, మహిళలను చూసే దృక్పథంలో విప్లవాత్మక మార్పు రావాలి.
మహిళల కర్తవ్యం ఏంటి?
మహిళా సంఘాలు, చైతన్యవంతులు కేవ లం వేడుకలకే పరిమితం కాకూడదు. నిర్భయ చట్టం, ఆస్తి హక్కు, లింగ నిర్ధారణ పరీక్షల నిరోధక చట్టాలపై సామాన్యులకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ హింసను, పోలీసుల అతివాదాన్ని ఎదిరించే చైతన్యాన్ని పెంచాలి.
మౌలిక మార్పు: మహిళల పీడనకు మూలా లు ఈ సమాజంలోనే ఉన్నాయి. అందుకే ఆర్థిక, సామాజిక మార్పు కోసం జరిగే పోరాటంలో మహిళలు సగభాగం కావాలి.
చివరగా.. క్లారా జెటికిన్ ఆఖరి సందేశమైన ‘యుద్ధాలు వద్దు-శాంతి కావాలి’ అనే నినాదం నేటికీ రగిలిపోతున్న యుద్ధమేఘాల మధ్య మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. మహిళా సాధికారత అంటే వంటల పోటీలు కాదు..అది పురుషాధిపత్యంపై, దోపిడీ వ్యవస్థపై సాగించే నిరంతర సమరం. అప్పుడే మహిళలకు నిజమైన స్వేచ్ఛ, రక్షణ లభిస్తాయి.
శ్రామిక