BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇతర అనేక ఆయుధాల్ని విదేశాల నుంచి కొంటున్న ఇండియా బ్రహ్మోస్ క్షిపణుల్ని విదేశాలకు అమ్ముతోంది. అనేక ఆసియా దేశాలు మనం రూపొందించిన ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన సింగపూర్లో షాంగ్రి–లా చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శనివారం కీలక విషయాలు వెల్లడించారు. తనకున్న అవగాహన ప్రకారం వియత్నాంతో ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల సరఫరాపై ఒప్పందం పూర్తైందన్నారు. వియత్నాంకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉందని తెలిపారు. అలాగే, ఇండోనేసియాతో చర్చలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. వియత్నాం, ఇండోనేసియాలకంటే ముందే బ్రహ్మోస్ క్షిపణుల సరఫరాపై ఫిలిప్పైన్స్తో ఒప్పందం కుదిరింది. 2022లోనే 375 మిలియన్ డాలర్లకు ఫిలిప్పైన్స్, ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.
ఇప్పటికే కొన్ని క్షిపణుల్ని ఇండియా ఆ దేశానికి సరఫరా చేసింది. మన దేశం నుంచి ఈ క్షిపణుల్ని కొన్న మొదటి దేశం ఇదే. ఇప్పుడు మరో రెండు దేశాలకు క్షిపణుల్ని సరఫరా చేయనుంది. ఆగ్నేయాసియా దేశాలే లక్ష్యంగా ఇండియా బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. అనేక ఇతర దేశాలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సింగపూర్, మలేసియా, బ్రూనే, థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, ఖతార్, ఒమన్, బ్రెజిల్, యూఏఈ దేశాలు ఈ క్షిపణుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అవసరమైతే సరఫరా పెంచేందుకు ఇతర దేశాలతో కలిసి పని చేసేందుకు కూడా ఇండియా సిద్ధంగా ఉందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.