గుమ్మడిదల, మే 30: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు బలం రావడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ట్రామా సెంటర్ ఏర్పాటుకు గతేడాది అధికారులు ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చ డం లేదు. గుమ్మడిదలలో ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) ఉంది. ఇందులో సాధారణ వైద్యసేవలు అందుతున్నాయి.
కానీ, అత్యవసర సేవలు, ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడానికి గుమ్మడిదలలో ట్రామా సెంటర్ లేదు. అత్యాధునిక అంబులెన్స్‌లు ఇక్కడ అందుబాటులో లేవు. హైదరాబాద్‌కు సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మడిదల మీదుగా జాతీయ రహదారి-765డీ వెళ్తున్నది. ఈ రోడ్డుపై ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులను హైదరాబాద్, పటాన్చెరు, సూరారాం, నర్సాపూర్ దవాఖానలకు తరలించాల్సి వస్తున్నది. దీంతో అత్యవసర సమయాల్లో స్థానికంగా వైద్యసేవలు అందక ప్రాణాలు పోతున్నాయి.
గుమ్మడిదలలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు వెంటనే వైద్యసేవలు అందే అవకాశం ఉంటుంది. వైద్యలు, సిబ్బంది,ల్యాబ్ వంటి 24గంటలు అందుబాటులో ఉండి, ప్రాణాపాయ పరిస్థితుల్లో రాత్రివేళ కూడా వైద్యసేవలు అందుతాయి. 100 పడకలతో ట్రామా సెంటర్ ఏర్పాటుకు గుమ్మడిదలలో స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ట్రామా సెంటర్ ఏర్పాటు విషయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.