రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నది. అసైన్డ్ భూముల స్వాధీనం, ఎఫ్టీఎల్ను ముందు పెట్టి నిర్మాణాల కూల్చివేత.. ఒక్కటేమిటి? ఏ జాగనూ సర్కార్ వదలడం లేదు. స్వాతంత్య్ర సమరయోధులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములపైనా కన్నువేసినట్టే కనపడుతున్నది. వాటికి రెండేండ్లుగా ఎన్వోసీలను నిలిపేసింది.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో వివిధ భూములకు ఎన్వోసీల (నిరభ్యంతర పత్రం) జారీ ప్రక్రియ నిలిచిపోయింది. రెండేండ్లుగా ఒక్క ఎన్వోసీ కూడా జారీ చేయలేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారులు వంటివారికి ప్రభుత్వాలు భూములను కేటాయించాయి.
వాటిని విక్రయించాలంటే రెవెన్యూశాఖ నుంచి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో దరఖాస్తులను పరిశీలించి ఎలాంటి సమస్యలేని భూములకు ఎన్వోసీలు జారీ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారుల భూములకు ఎన్వోసీ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసిందని చెప్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్లను నకిలీ పత్రాలుగా చిత్రీకరిస్తున్నదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విచారణ జరిపి అసలైనవి ఏవో, దొంగ పత్రాలు ఏవో తేల్చకుండా మొత్తంగా పక్కన పడేస్తున్నారని వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500కు పైగా ఎన్వోసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దరఖాస్తుదారులు ఎన్వోసీల కోసం కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పుడు వెళ్లినా ‘ఎన్వోసీలు ఇవ్వొద్దని మాకు పై నుంచి ఆదేశాలున్నాయి.
కాబట్టి మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు ఇవ్వలేం’ అంటూ అధికారులు తేల్చిచెప్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్వోసీలు జారీకాక తాము అవస్థలు పడుతున్నామని, కుటుంబ అవసరాల కోసం భూమి అమ్ముకుందామంటే వీలు కావడం లేదని వాపోతున్నారు. కండ్ల ముందే రూ.కోట్ల విలువైన భూమి ఉన్నా, అత్యవసరానికి ఆదుకోలేకపోతున్నదని చెప్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూములను విక్రయించేందుకు ప్రభుత్వమే అడ్డం పడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ భూముల మాదిరిగా, తమ భూములపై కూడా ప్రభుత్వ పెద్దల కన్నేమైనా పడిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్మీ రిటైర్డ్ అధికారులకు సంబంధించిన భూములకు ఎన్వోసీలు ఇవ్వడం నిలిపివేసినట్టు స్వయం గా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తులకు ఆయన దొంగ ముద్ర వేశారు. ఎన్వోసీల కోసం చేసిన వచ్చినవన్నీ దొంగ దరఖాస్తులని, వారికి ఎవరూ భూమి కేటాయించనప్పటికీ దొంగ పత్రాలు సృష్టించి ఎన్వోసీల కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ సేవలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి అనుమానాలుంటే విచారణ చేసుకోవాలని అంతేగానీ తమపై దొంగ ముద్ర వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి అసలైనవారికి త్వరలోనే ఎన్వోసీ ఇస్తామని మంత్రి చెప్పారని, ఇప్పటివరకు కనీసం విచారణ ప్రక్రియ ప్రారంభం కాలేదని అంటున్నారు. రెవెన్యూ శాఖకు రెండేండ్లుగా సమయం దొరకడంలేదా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా విచారణ జరిపి అర్హులైనవారికి ఎన్వోసీలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.