మనిషి మనుగడకు ప్రాణం పోసే మహిళ.. తన మనుగడ కోసం పోరాడుతున్నది. అన్నిట్లో సగం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నా.. అన్నిచోట్లా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నది. ఈ క్రమంలో.. మహిళా సాధికారతే లక్ష్యంగా మరో ‘మార్చి 8’ మన ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలు, మరెన్నో కలలతో.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కోసం మహిళాలోకం సిద్ధమవుతున్నది. ఈ ఏడాదైనా అనుకున్న లక్ష్యాలను సాధించాలనే పట్టుదలతో ముందడుగు వేస్తున్నది.
మహిళలు, బాలికల హక్కులను ముందుకు తీసుకెళ్లడానికి, వారికి మద్దతు అందివ్వడానికి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ ఓ వేదికగా నిలుస్తుంది. ఆడవారికి చట్టపరమైన భద్రత-రక్షణ కల్పించడంలో, హక్కుల ఉద్యమాన్ని రూపొందించడంలో, అవసరమైన సేవలను అందించడంలో సాయపడుతుంది. సామాజిక కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేయకుండా.. వారిని పురోగతివైపు నడిపించడానికి తగిన కృషి చేస్తుంది. ఈ క్రమంలో వారు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలనూ గుర్తిస్తుంది. అదే సమయంలో కేవలం వేడుకలకే పరిమితం కాకుండా.. లింగ సమానత్వం కోసం ఇంకా చేయాల్సిన పనులను కూడా గుర్తుచేస్తుంది. ఈ క్రమంలో 2026 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి అధికారిక థీమ్ ప్రకటించింది. హక్కులు-న్యాయం-కార్యాచరణ.. ‘అందరు మహిళలు-బాలికల కోసం’ అంటూ పిలుపునిచ్చింది. దాంతోపాటు ‘గివ్ టు గెయిన్’ నినాదంతో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ గ్లోబల్ క్యాంపెయిన్ ముందుకు సాగుతున్నది. అంటే, మహిళలకు మనం ఇచ్చే మద్దతు, అవకాశం, గౌరవం.. తిరిగి సమాజానికి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుందని ఐక్యరాజ్య సమితి చెబుతున్నది.
ఈ ఏటి మేటి లక్ష్యాలు :
మార్చి 8 సందర్భంగా మహిళా సాధికారతే లక్ష్యంగా.. ఏటా ప్రత్యేక డిమాండ్లు తెరపైకి తీసుకొస్తారు. అలా, ఈ ఏడాది చట్టపరమైన న్యాయం, సమాన హక్కుల సాధనపై ప్రధానంగాదృష్టి పెడుతున్నారు.
ఇదీ చరిత్ర..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ ప్రత్యేక రోజుకు 1908లో పునాది పడింది. న్యూయార్క్ నగరంలోని గార్మెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే మహిళా కార్మికులు.. తక్కువ పని గంటలు, మెరుగైన వేతనం కోరుతూ రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 15,000 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రాముఖ్యతని చూసి ముగ్ధులైన అమెరికన్ సోషలిస్ట్ నాయకులు.. 1909 ఫిబ్రవరి 28న మొదటిసారిగా ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరిపారు. ఆ తర్వాత 1910లో కొపెన్హాగన్లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్’లో క్లారా జెట్కిన్ అనే జర్మనీ కమ్యూనిస్టు నేత.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ అనే ప్రతిపాదనను తీసుకొచ్చారు.
17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అలా, 1911, మార్చి 19వ తేదీన ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్లలో మొట్టమొదటి మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆయా దేశాల్లో జరిపిన ర్యాలీల్లో పది లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. అలా, మహిళా దినోత్సవాన్ని మొదట్లో వేర్వేరు దేశాల్లో, వేర్వేరు తేదీల్లో జరుపుకొనేవారు. ఆ తర్వాత 1917లో మార్చి 8వ తేదీన రష్యా మహిళలు ‘బ్రెడ్ అండ్ పీస్’ కోసం పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. వారి నిరసనకు రష్యా చక్రవర్తి జార్ గద్దె దిగాల్సి వచ్చింది. అప్పుడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. మహిళలకు ఓటు హక్కును కూడా కల్పించింది. దాంతో, ఆ తేదీకి పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించింది. ఈ క్రమంలో 1975వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా’ ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. మొదటిసారిగా మార్చి 8న అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది.
ప్రత్యేక రంగులు
మార్చి 8న మహిళలు కొన్ని ప్రత్యేక రంగుల దుస్తులు ధరిస్తారు. ఎక్కువగా ఊదారంగు (పర్పుల్), ఆకుపచ్చ, తెలుపు వస్ర్తాలను ఎంచుకుంటారు. ఊదా రంగు న్యాయం, గౌరవానికి సూచన. ఆకుపచ్చ రంగు హామి, తెలుపు స్వచ్ఛతకి సూచనగా నిలుస్తుంది.