నరేంద్రమోదీ నేతృత్వం లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతున్నామని బీజేపీ చెప్పుకొంటున్నది. దీనికి మోదీ రూ పంలో దేశానికి సమర్థనాయక త్వం లభించటమే కారణంగా చెప్తున్నది. నిజానికి సంఘ్ పరివార్ శక్తులు చెప్తున్నది ఎంత బూటకమో మోదీ తొమ్మిదేండ్ల పాలన వెల్లడిస్తున్నది. అయినా బీజేపీ శ్రేణులు తమదైన గోబె ల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే… వారు తిరిగి మోదీనే ప్రధాని అవుతారని ప్రకటించుకొంటున్నారు.
నిజానికి.. దేశ చరిత్రలో ఒక విస్పష్ట ఆర్థిక, సామాజిక విధానం లేని పార్టీ అంటూ ఉంటే.. అది బీజేపీ మాత్రమే. బీజేపీ, దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఆది నుంచీ మతవాదాన్ని ఆసరా చేసుకొని ఉనికిలోకి వచ్చినవే. ‘హిందువులం-మనమంతా బంధువులం’ అంటూ.. చెప్పే ఆర్ఎస్ఎస్ ఏనాడూ మనుషులందరినీ సమానంగా చూడలేదు. కుల వివక్ష, అణిచివేతలను వ్యతిరేకించలేదు. వసుధైక కుటుంబం అనే అందమైన నినాదం మాటున వర్ణాశ్రమ ధర్మాన్ని పాదుకొల్పటం కోసం ప్రయత్నం చేస్తున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను పరిరక్షిస్తూ వస్తున్నది.
మరోవైపు… ఆర్ఎస్ఎస్ మానస పుత్రిక అయిన బీజేపీకి ఒక ఆర్థిక విధానమంటూ ఏనాడూ లేదు. మొదట్లో గాంధేయ సోషలిజం అని చెప్పుకొన్నారు కానీ… సోషలిజం అంటేనే గిట్టని ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ దాన్ని కాలక్రమంలో మరుగు పర్చింది. అంత మాత్రమే కాదు… రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకిక, సామ్యవాద అన్న పదాలను కూడా తొలగించటానికి ప్రయత్నిస్తున్నది.
రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మరింత నగ్నంగా తమ హిందుత్వ ఎజెండాను అమలు చేస్తున్నది. మెజారిటీ వాద రాజకీయాలను దేశం మీద రుద్దుతూ ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకొంటున్నది. నాడు బ్రిటిష్‌వారు అనుసరించిన ‘విభజించు-పాలిం చు’ నీతిని నేటి మోదీ నేతృత్వంలోని బీజేపీ అనుసరిస్తున్నది. దేశ ప్రజలను మతం పునాదిగా విభజనకు గురిచేసే చర్యలకు పాల్పడుతూ మత ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నది. మైనారిటీ మతస్థులే లక్ష్యంగా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ మెజారిటీ ప్రజల మనసులను విషతుల్యం చేస్తున్నది. మైనార్టీలతో లేనిప్రమాదాన్ని బూచిగా చూపి మెజారిటీలను తమ వైపు తిప్పుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నది. ఆ క్రమంలోనే… అయోధ్య బాబ్రీ మసీదు వివాదం, సోమనాథ ఆలయం లాంటి వాటిని వివాదం చేసి మెజారిటీ హిందు ఓట్లను పొందేందుకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడింది.
ఇక.. వ్యక్తిగా చూసినా… మోదీది అంతా పటాటోపమే తప్ప మరేమీ లేదు. నీతి, నిబద్ధత అనేవి మచ్చుకైనా లేని మోదీ బలమైన నేతగా ప్రచారం చేసుకొంటున్నారు. మాటి మాటికీ 56 ఇంచుల ఛాతి అని గొప్పలు పోయే మోదీ… దేశ ప్రజలకు ఏమి ఒరగబెట్టారో, దేశానికి ఏం ఒనగూర్చాడో మాత్రం చెప్పడు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని అంతం చేస్తానని చెప్పి, కుబేరుల నల్లధనం మరింత పెంచేందుకు తోడ్పడ్డాడు.
సమర్థ నేతగా తన వందిమాగదులతో ప్రచారం చేయించుకొంటున్న మోదీ… దేశ ప్రజలకు తీరని ద్రోహం, నష్టం తలపెడ్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ సంపదను తన అనుయాయులైన ఆదానీ, అంబానీలకు అప్పనంగా అప్పజెప్తున్నాడు. దేశంలో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటినెన్నింటినో ప్రైవేటు వారికి అప్పగించాడు. అంతెందుకు.. స్వాతంత్య్రానంతరం..కోట్లాది మందికి సేవలందిస్తూ.. లాభాలతో నడుస్తున్న జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ని సైతం ప్రైవేటు పరం చేసేందుకు మోదీ ఉవ్విళ్లూరుతున్నాడు. మాట మాట్లాడితే.. దేశ భక్తి గురించి మాట్లాడే సంఘ్‌పరివార్ శక్తులు దేశ సంపదను ప్రైవేటుకు అప్పజెప్పటాన్ని ఏ విధమైన దేశ భక్తి అంటారో దేశ ప్రజలకు చెప్పాలి. సమాజంలోని తోటి వారినే శత్రువులుగా చూపుతూ… పబ్బం గడుపుకొంటున్న బీజేపీ… రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవటం కోసం విపక్ష రాజకీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్త్తూ రాజకీయ నేతలను అదిరించి, బెదిరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో బీజేపీ నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను తమ అనుంగు అనుయాయులతో నింపేసి వాటి స్వయంప్రతిపత్తిని, నిష్పాక్షికతను ధ్వంసం చేస్తున్నది. ఒకే దేశం-ఒకే చట్టం పేరుతో… దేశ వైవిధ్యాన్ని, విభిన్నతను నాశనం చేస్తూ దేశ బహుళత్వానికి పాతర వేస్తున్నది. రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది. రాజ్యాంగ బద్ధ చట్టాలను, రాష్ర్టాలకు సంరక్షణగా ఉన్న చట్టాలను కాలరాస్తూ ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది. ఇదంతా ఏకఛత్రాధిపత్యంగా, నియంతృత్వంగా చేస్తూనే…. జమిలి ఎన్నికల పేరిట మరో కుట్రకు తెరలేపుతున్నది. దేశాన్ని అధ్యక్షతరహా పాలనవైపు తీసుకుపోయేందుకు కుట్రలు పన్నుతున్నది.
ఈ సందిగ్ధ నేపథ్యం నుంచే బీఆర్ఎస్ అవతరించింది. హిందూత్వమనే మత్తులోంచి బయటపడడానికి ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను నిలుపుకోవడానికి ప్రత్యామ్నాయ పార్టీల ఆవశ్యకత ఎంతైనా అవసరం. మోదీ ప్రభుత్వ కుట్రలను ఎదురించడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది.ఆ చైతన్యం బీఆర్ఎస్తో సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
డాక్టర్ బీఎన్ రావు