చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లో ఈ కథ బాగా గుర్తుండిపోయింది. ఒక ఏనుగు తొండంతో పూలమాలను పట్టుకెళ్తూ తనకు నచ్చినవారి మెడలో ఆ మాల వేసేది. ఏనుగు ఆ మాలను ఎవరి మెడలో వేస్తే వారే ఆ దేశానికి రాజు. ఏనుగు పూలమాలను వేయగానే అతన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. కథ అక్కడితో ముగుస్తుంది. నిజానికి కథ అక్కడితో ముగిస్తేనే బాగుంటుంది. కానీ, ఏనుగు దండ వేశాక రాజుగా బాధ్యతలు స్వీకరించాక అతను ఉపన్యాసమిస్తే ఎలా ఉంటుందోననే కుతూహలం నాలో ఉండేది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపన్యాసాలను విన్నప్పుడల్లా నాకు ఈ కథ గుర్తుకొస్తూ ఉంటుంది.
శాసనమండలి సభ్యురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక, అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరు వ్యక్తులుగా వారి స్థాయికి తగినట్టుగా ఉండవచ్చు, వారి అభిమానులు చప్పట్లు కొట్టే విధంగా ఉండవచ్చు. కానీ, వారు చేపట్టిన పదవులకు తగిన స్థాయిలో మాత్రం లేవు. కోర్టు నిర్ణయం పైనే కాదు, అన్ని చోట్ల వారి ప్రసంగాలు అదే స్థాయిలో ఉంటున్నాయి. సుప్రీంకోర్టు స్వయంగా తప్పు పట్టడం వల్ల వారి ప్రసంగాలు చర్చలోకి వచ్చాయి.
గుజరాత్లో అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని స్వయంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, నెహ్రూ కన్నా పటేల్ మహానాయకుడు అనేది బీజేపీ అభిప్రాయం. అలాంటి పటేల్ నిర్వహించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తాను మాట్లాడేప్పుడు తన అభిమానులను కాకుండా ఒక్కసారి పటేల్‌ను గుర్తుకు తెచ్చుకుంటే కొద్దిగా అయినా హుందాగా మాట్లాడటం అలవాటు అవుతుందేమో. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికే అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం పట్ల గౌరవం లేకపోతే ఎలా? ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలపై సుప్రీంకోర్టు ఒకసారి కాదు, రెండు సార్లు తీవ్రంగా స్పందించింది. ‘నాయకులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా? ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?’ అని రేవంత్‌ను సుప్రీం న్యాయమూర్తులు ప్రశ్నించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా ఖాతాలో బెయిల్‌పై చేసిన రాజకీయ విమర్శలపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఫలానా కంపెనీ ఉత్పత్తి కంటే తమ ఉత్పత్తే మంచిదని ఏ వ్యాపార సంస్థ అయినా ప్రచారం చేసుకుంటుంది. అది సహజం. రాజకీయ వ్యాపారంలో రాజకీయ పార్టీలు సైతం అదే విధంగా విమర్శించుకుంటాయి. రాజకీయ వ్యా పారంలో పరస్పర విమర్శలు సహజ మే. కానీ, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బూతులకు, విమర్శలకు, ఆరోపణలకు తేడా తెలుసుకోవాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను సుప్రీంకోర్టు తప్పుపట్టడమంటే అది ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అవమానకరం కాదు, యావత్ తెలంగాణ ప్రజలకూ అవమానకరమే. రేవంత్ రెడ్డి పాఠశాల పిల్లలను ఉద్దేశించి మాట్లాడినా బూతులే మాట్లాడుతున్నారు. వాటిని తన ట్రేడ్‌మార్క్‌గా ఆయన మార్చుకున్నారు. మైకు ముందుకు వెళ్లేటప్పుడు తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకొని ఉపన్యాసం మొదలుపెడితే తన మాటతీరు మారవచ్చు. తన తిట్ల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే భ్రమ ఆయనకు ఉంటే చేయగలిగిందేమీ లేదు. బీఆర్ఎస్ను ఓడించి, కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారు. అంతేకానీ, రేవంత్‌రెడ్డిని గెలిపించలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం చల్లని చూపు ఉన్నంత వరకే ఆయన మాట చెల్లుబాటవుతుంది. ఆయన తిట్లు కూడా అంతవరకే నచ్చుతాయి.
పాలనపై పట్టు సాధించే విషయం ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం బూతులపై పట్టు సాధించారు. రేవంత్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు సమావేశం జరుగుతున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణను కొట్టినంత పనిచేశారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి పట్టుకొని ఆయనను వెనక్కి లాగారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి పరిస్థితి వేరు. ఆ ఆవేశం, తిట్లు రాజకీయంగా ఎదగడానికి, అభిమానులు చప్పట్లు కొట్టడానికి ఉపయోగపడి ఉండవచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో కూడా అవే ఉపయోగపడతాయని అనుకుంటే పొరపాటే. రాహుల్‌గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకులు విమర్శిస్తే.. ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తమ నాయకుడి గురించి మాట్లాడినా కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. అయినా కేసీఆర్ స్పందించారు.
రజత్ శర్మ ఆప్ కీ అదాలత్ వీడియో ఒకటి ఈ మధ్య చూశాను. వాజపేయిని రజత్ శర్మ కలిసినప్పుడు.. ‘మీరు ఎంత ఉన్నతస్థాయికి వెళ్తే.. సహన శక్తి అంతగా పెంచుకుంటూ ఉండాల’ని చెప్పారట. మాట్లాడే కళ నేర్పించాలని వాజపేయిని రజత్ శర్మ అడగగా.. ‘నా నుంచి మాట్లాడే కళ కాదు.. నేర్చుకోవాలనుకుంటే, మౌనంగా ఉండటం నేర్చుకో’ అని వాజపేయి బదులిచ్చారట. అందుకే వాజపేయి లాంటి వారిని పార్టీలకతీతంగా అందరూ గౌరవిస్తారు.