2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని 2016 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెట్టింపు సంగతి పక్కనపెడితే పలు రాష్ర్టాల రైతుల ఆదాయం గణనీయంగా తగ్గినట్టు స్టాండింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. మార్చి 2022లో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం… 2015-16, 2018-19 మధ్య కొన్ని రాష్ర్టాల్లో రైతుల ఆదాయం పడిపోయింది. జార్ఖండ్‌లో రైతుల ఆదాయం నెలకు రూ.7,068 నుంచి రూ.4,895కి, నాగాలాండ్‌లో రూ.11,428 నుంచి రూ.9.877కి, ఒడిశాలో రూ.5,274 నుంచి రూ.5,112కి తగ్గాయి. ఆదాయం రెట్టింపు ముచ్చట దేవుడెరుగు కానీ రైతుల పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేసిందనేది ప్రభుత్వ వ్యవసాయ విధానాలను పరిశీలిస్తే మనకు అవగతమవుతుంది.
BJP | వ్యవసాయ రంగాన్ని సైతం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి రైతులను తమ పొలాల్లోనే కూలీలుగా మార్చే కేంద్ర ప్రభుత్వ వైఖరి సుస్పష్టంగా మన కండ్లముందున్నది. సబ్సిడీలతో, రుణమాఫీలతో కార్పొరేట్ వ్యవస్థకు వంతపాడుతూ.. దేశానికి వెన్నెముకై నిలిచిన రైతులపై ఎరువుల భారం వేస్తూ వెన్నుపోటు పొడుస్తున్నది. ‘రైతు పండించిన పంటలకు కల్పించే మద్దతు ధరకు, ఎరువుల ధరకు పొంతన లేకుండానే 2022లో ఎరువుల ధరలు 50 శాతం పెంచి రైతాంగాన్ని ఒక్కసారిగా అగాధంలోకి నెట్టింది. దీనిని కుంటిసాకుగా చూపి అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడిసరుకు ధరలు పెరిగినట్టు చెప్తున్నది. ముడిసరుకు ధరలు పెరిగితే వాటిని భరించాల్సిన కేంద్రం ఆ భారాన్ని రైతులపై మోపుతూ వారి నడ్డిని విరుస్తున్నది. ఇదిలా ఉంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాల పలకడం చూస్తుంటే ‘హత్య చేసినోడే హంతకుడి కోసం వెతికినట్టు ఉన్నదని’ రైతులు వాపోతున్నారు.
గడిచిన పదేండ్లలో కేంద్రం గుడ్డిగా ఎరువుల ధరలను పెంచుతూ యూరియా, డీఏపీ వినియోగాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలని రాష్ర్టాలకు చెప్తున్నది. రైతులు ఎక్కువగా వాడే 28.28.0 ఎరువు ధరను 50 శాతం, పొటాష్ ధరను 100 శాతానికి పైగా 2021 ఏడాది చివరలో 90 రోజుల్లోనే పెంచడం శోచనీయం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను దేశంలో రైతులు ఎక్కువగా పండించే వరి, పత్తి పంటలకు మద్దతు ధరలను ఏ విధంగా పొంతన లేకుండా నిర్ణయించిందనేది ఒకసారి పరిశీలిద్దాం…
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పొంతనలేని ఎరువుల ధరలు, పంటలకు మద్దతు ధరలను నిర్ణయించడం చూస్తుంటే వ్యవసాయ రంగంపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నది. అంతేకాకుండా ప్రభుత్వాలు దశాబ్దాల నుంచి ఎరువులపై కొనసాగించిన రాయితీ విధానాన్ని తుంగలో తొక్కుతూ సేంద్రియ సాగును ప్రోత్సహించే ‘పీఎం ప్రణామ్’ సాకుతో ఈ ఆర్థిక సంవత్సరం ఎరువుల సబ్సిడీకి కేంద్రం 22.25 శాతం కోత పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ రూ.2.54 లక్షల కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఎరువులపై ఇస్తున్న రాయితీని రూ.1.75 లక్షల కోట్లకు తగ్గిస్తున్నట్టు ఆర్థికమంత్రి సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో తెలిపారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తుండటంతో అకస్మాత్తుగా ఎరువుల ధరలు భారీగా పెరిగి అంతంత మాత్రంగా ఉన్న రైతుల భారం పడుతున్నది.
రైతాంగానికి తీవ్ర నష్టం: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు వారి ఆర్థిక స్తోమతను కుంగదీస్తున్నాయి. ఈ ఏడాది నామమాత్రంగా పెంచిన మద్దతు ధరలు, ఎడాపెడా పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మన తెలంగాణలో వరితో పాటు పత్తి పంటలు అధికంగా సాగవుతాయి. పంటలకు పోషకాలు అందించేందుకు రైతులు ఎక్కువగా ఎరువులపైనే ఆధారపడుతుంటారు. అయితే ఏటా ఎరువుల ధరలు అందనంత ఎత్తుకు పెరుగుతుండటం, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉండటంతో వారు సాగుకే దూరంగా ఉండటం మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు. కరోనాకు ముందు 50 కిలోల పొటాష్ ధర రూ.970 ఉండగా నేడు అది రూ.1550కి చేరడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 శాతం జీఎస్టీని విధించడంతో ఒక్కో బస్తాకు దాని ధరను బట్టి 80- 120 రూపాయల అదనపు భారం పడుతున్నది. ఎరువులపై జీఎస్టీ విధానం పట్ల రైతులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడంతో వ్యాపారులు సిండికేట్ అయి, మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో గతంలో ఎరువులు దొరక్క మధ్యప్రదేశ్, యూపీ తదితర రాష్ర్టాల్లో లైన్లలోనే నిలబడి రైతన్నలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం జరిగాయి.
కార్పొరేట్ల పక్షాన నిలుస్తున్న కేంద్రం.. భూమినే నమ్ముకున్న అన్నదాతపై ఎరువుల భారాన్ని మోపడం చూస్తుంటే వారి ప్రేమ ఎవరి మీద అనేది క్షుణ్ణంగా అర్థమవుతున్నది. కార్పొరేట్లతో చేసే సహవాసం వారికి అధిక లాభాలను చేకూర్చవచ్చేమో కానీ, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు.
వ్యవసాయ పంటల మద్దతు ధర కోసం 2004లో ఏర్పాటు చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ 6 దశలుగా నివేదిక సమర్పించింది. సాగు వ్యయం కన్నా 50 శాతం అదనంగా గిట్టుబాటు ధరను ఇవ్వాలని సూచించింది. దానికి అనుగుణంగానే మద్దతు ధరలను కల్పిస్తున్నామన్న కేంద్రం.. మూలధన వ్యయాన్ని, భూమి కౌలు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అంతేకాకుండా మద్దతు ధర ఇచ్చి పంటల కొనుగోలుకు కేంద్రం విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో గిట్టుబాటు ధర రైతులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది.
ఎరువుల ధరలను పెంచడం మూలాన రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్నది. ఎరువుల ధరలను చిన్న, సన్నకారు రైతులకు అందుబాటు ధరలోకి తీసుకువచ్చి, జీఎస్టీ సుంకాన్ని రద్దుచేసి అన్న‘దాత’పై అదనపు భారాన్ని మోపకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఎరువుల ముడిసరుకులపై అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలను కేంద్రమే భరించి.. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల సంక్షేమం దృష్ట్యా కొనసాగించాలి. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేంద్రం తీసుకొచ్చిన ప్రణామ్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. అంతే తప్ప దాన్ని సాకుగా చూపి ఎరువులపై సబ్సిడీని వెనక్కి తీసుకోవడం సరైన చర్య కాదు. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరల వల్ల రైతులపై భారీగా భారం పడుతున్నది. వాటి ధరలను నియంత్రించాలి. లోపభూయిష్టంగా ఉన్న మద్దతు ధర విధానం అమలుతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగేలా చేస్తున్నది. దీనిపై ఒక విశ్వసనీయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అప్పుడే రైతుల ఆశలు తిరిగి చిగురిస్తాయి.
1. ఎరువుల ధరలు: (50 కిలోల బస్తాలు)
2. వరికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర (రూపాయలలో)
3. పత్తి పంటకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర(రూపాయలలో)

– (వ్యాసకర్త: కేయూ విద్యార్థి)