మతం పేరుతో సమాజాన్ని నిట్టనిలువునా చీల్చి రాజ్యమేలుతున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడటానికి, దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశంలో గుణాత్మక మార్పు తేవడానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కే చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధికి కావాల్సిన విధానాలను ప్రకటించారు. దేశం మార్పు కోరుకుంటున్న చారిత్రక సందర్భంలో భారత రాజకీయ యవనికపై కేసీఆర్ మార్కు రాజకీయాలను ఇకపై చూడబోతున్నాం.
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి. నేటికీ దేశంలో మంచి నీరు, రహదారులు, విద్యుత్తు లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ‘బలహీనమైన రాష్ర్టాలు- బలమైన కేంద్రం’ ఎజెండాను అమలు చేయడం, దేశాభివృద్ధిని గాలికి వదిలేయడం వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయి.
దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత, 41 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నప్పటికీ గత కేంద్ర ప్రభుత్వాల ప్రణాళిక లోపం వల్ల వ్యవసాయాభివృద్ధి కుంటుపడింది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన చైనా అభివృద్ధిలో దూసుకెళుతుంటే మన దేశం మందకొడిగా ముందుకు సాగుతున్నది. విదేశీ ఎగుమతులు తగ్గి చైనా నుంచి దిగుమతులు పెరిగాయి. విదేశాలపై ఆధారపడే ఈ దుస్థితి మారాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్తున్నారు. వెనుకబడిన తెలంగాణను కేవలం 8 ఏండ్ల స్వల్ప కాలంలోనే ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకోగలిగినప్పుడు, రత్న గర్భ అయిన భారతదేశాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక మార్పు సాధించడానికి జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. వ్యవసాయాధారిత దేశంలో ఆ రంగం అభివృద్ధికి నూతన వ్యవసాయ విధానం కావాలి. అంతర్ రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించేందుకు కొత్త జల వనరుల విధానం కావాలి. మారుమూల గ్రామాలకు విద్యుత్తును అందించడానికి కొత్త విద్యుత్తు పాలసీ కావాలి. విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి, డాలర్‌తో రూపాయి మారకం విలువను పెంచడానికి కొత్త ఆర్థిక విధానం కావాలి. ‘హరిత హారం’ స్ఫూర్తితో నూతన పర్యావరణ విధానం తేవాల్సి ఉన్నది. దళిత, బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో కొత్త సంక్షేమ విధానాన్ని అమలు చేయాలి.
రాష్ర్టాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుని రుద్దడం వల్ల ఆయా రాష్ర్టాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగితేనే దేశాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్తున్నారు. ఇందుకోసమే ఆయన బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయని పలు రాష్ర్టాలకు చెందిన నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ప్రయత్నాలకు తమ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దేశవ్యాప్తం చేయాలన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపు విద్వేష, విభజన రాజకీయాలపై పోరాటం చేయాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నారు. ‘ప్రజలను గెలిపిస్తం, ప్రగతిని సాధిస్తం. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నాం.. ఇక దేశాన్ని బాగుచేసుకుందాం’ అన్న కేసీఆర్ పిలుపునకు స్పందిస్తున్నారు.
– కర్నాటి విద్యాసాగర్, 94913 93999