జరభద్రం
అసెంబ్లీ సమావేశాల తొలిరోజున ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులను రేవంత్ ప్రభుత్వం బయటనే అడ్డుకొన్నది. ఈ సమావేశాల మొదటిరోజునే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేసే పదాలను ముద్రించిన నల్లరంగు టీ షర్టులను తొడుక్కొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న భద్రతా దళాలు వారిని లోపలి వెళ్లేందుకు అంగీకరించలేదు. స్పీకర్ ఆదేశాల మేరకు ఇక్కడే ఆపేస్తున్నామని పోలీసులు వారితో అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడానికి స్పష్టమైన కారణం లేదు. అవే ఆహార్యాలతో వారు అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడే సభ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. శాసనసభ, మండలి సభ్యులైన గౌరవ ప్రతినిధులను గేటు బయటే ఆపేయడం వారి ప్రాథమిక పౌరస్వేచ్ఛకు భంగకరం. భారీగా పోలీసు బలగాలను దింపి ప్రభుత్వం అక్కడ కావాలని ఉద్రిక్తతను సృష్టించింది. సభలోకి వారు వస్తే ప్రభుత్వ వైఫల్యాలపై జరిగే చర్చలో విపక్షాలదే పైచేయి అయి, ప్రభుత్వం దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన పాలకపక్షం ఈ యుద్ధ వాతావరణానికి సిద్ధపడింది.
ఈ ఘటనకు బీఆర్ఎస్ సభ్యులే కారణమని లేదా పోలీసులే రెచ్చిపోయారని ఉభయ పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. తొక్కిసలాట జరిగాక స్వీయరక్షణ కోసం ఎవరు ఎవరినీ లక్ష్యపెట్టరు. ఊపిరిని కాపాడుకున్నాక ఏదైతే అది అనే తెగింపు అందరిలో వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిందపడిపోయారు. వారిని రక్షించే క్రమంలో ఎవరినైనా నెట్టేయక తప్పదు. వారు విధుల్లో ఉన్న పోలీసులా? అనేది తర్వాతి విషయం అవుతుంది. మామూలుగానే వచ్చిన బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులకు పోలీసులు ముందుజాగ్రత్తగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. కనీసం వారిని సభా ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో వారు ఇబ్బందులపాలై కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏ విచారణకు ఆదేశించినా జరిగిన అవమానం మాత్రం చెరిగిపోదు.
కాగా, తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ఎదుట జరిగిన తొక్కిసలాటపై మాట్లాడుతూ..బీజేపీ సభ్యులు సభలో ప్లకార్డులు ప్రదర్శించినప్పుడు అభ్యంతరం చెప్పని ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను ఎలా ఆపుతుందని నిలదీశారు. ప్లకార్డులపై రాసినా, టీ షర్టులపై రాసుకున్నా ఒకటే కదా..కానీ రెండింటినీ విడిగా చూసి ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని ఆయన అన్నారు.
అసెంబ్లీ హాలులో సభ్యులెవరూ ప్లకార్డులు ప్రదర్శించకూడదని నిబంధనావళిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఉల్లంఘన మన దేశంలో నిత్యకృత్యమైపోయింది. సభ్యుల విపరీత ప్రవర్తనకు సభలు రంగస్థలాలు అయ్యాయి. ‘వీరా..మన ప్రజాప్రతినిధులు, దేశ శాసనకర్తలు’ అని సిగ్గుపడిన సందర్భాలూ ఉన్నాయి. గత పన్నెండేండ్ల కాలంలో పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు ఎన్నోమార్లు ప్లకార్డులు పట్టుకొని సభాపతి పోడియం వద్ద ప్రదర్శించారు. చండీగఢ్‌లో గత నెల 27న జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు ఇచ్చారని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. నేడు పాలక పక్షాన ఉండి సభా మర్యాదల గురించి సుద్దులు పలుకుతున్నవారికి కూడా ఉల్లంఘనల ఘన చరిత్ర ఉన్నది. 2017లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆనాడు టీడీపీ సభ్యుడైన రేవంత్‌రెడ్డి గవర్నర్ ప్రసంగ సమయంలో నినాదాలతో సభా మర్యాదలను ఉల్లంఘించారు. 2018 మార్చిలో బీఆర్ఎస్ శాసనసభ, మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకొంటూ కాంగ్రెస్ సభ్యులు రైతుల ఆత్మహత్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ హంగామా చేశారు. అక్కడితో ఆగకుండా ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన హెడ్‌ఫోన్‌ను విసిరికొట్టగా అది సభాపతి స్వామిగౌడ్ కుడికంటికి తాకి కార్నియా దెబ్బతిన్నది.
తొలిరోజు తొక్కిసలాటలో బీఆర్ఎస్ అగ్రనేతలు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి కింద పడిపోవడం, పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం, ఈలోగా వారిపై కొందరు కాళ్లు వేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పట్టరాని కోపంలో ఒక సభ్యుడు ఆవేశంగా ఒక చెడ్డ మాట మాట్లాడారు. మీకు ఆదేశాలు ఇచ్చిందెవరు? అనే క్రమంలోనే ఆ మాట వచ్చింది. కానీ ఎవరి పేరును కూడా ఆయన ఎత్తలేదు. కానీ ఆ సభ్యుడు తన తప్పును అంగీకరించారు. అయితే అదే మాటను పట్టుకొని రాద్ధాంతం చేసి, కాంగ్రెస్ తమ పార్టీ శ్రేణులను రోడ్లపైకి దించింది. కులం కార్డుకు రెక్కలు తొడిగింది. ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం వైపు కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పింది.‘అసెంబ్లీలో చర్చిద్దాం రండి’ అని ప్రతి వేదిక నుంచీ సవాల్ విసిరే ముఖ్యమంత్రి సమయం వచ్చాక విమర్శను ఎదుర్కోలేక బీఆర్ఎస్ సభ్యుల ప్రవేశాన్ని నిరాకరించారు. చివరకు శాంతిభద్రతలపై చర్చ కోరిన ప్రధాన ప్రతిపక్ష సభ్యులను ఈ సమావేశాలకు రానీయకుండా చేశారు. అయితే, ప్రధాన విపక్షం లేని సభా సమావేశాలు నిష్ప్రయోజనమే. హామీల అమలుపై జవాబు లేని ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నది.
బద్రి నర్సన్