సిటీబ్యూరో: ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్, అమీర్‌పేట్, షేక్‌పేట్, బండ్లగూడ, గోల్కొండ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల్లో బుధవారం ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 18న జేఏసీతో చర్చలు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నదని అయితే ఆ చర్చల్లో సమస్యల పరిష్కారం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ హెచ్చరించారు.
2023 నుంచి మెరుగైన ఫిట్మెంట్తో 2వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో అనుమతి ఇవ్వకపోయినా సరూర్‌నగర్ స్టేడియం అనుమతి పొందామని అయితే బుధవారం జేఏసీ నాయకులతో సీఎస్ సమావేశమై ఈనెల 18న తమ డిమాండ్లపై చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు. అందులో భాగంగా ప్రభుత్వం స్పందన ఆధారంగా ఈనెల 19న తమ ఉద్యమ కార్యాచరణ ఉండనుందని తెలిపారు.