నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్‌పై అత్యంత దుర్మార్గమైన, హేయమైన వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
ఎమ్మెల్యే శంకర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో పెద్ద ఎత్తున వినతిపత్రాలు సమర్పించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ్యయ్య తదితరులు ఏసీపీ భీమ్శర్మకు వినతిపత్రం అందజేశారు. లింగాలఘనపురం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పార్టీ నాయకులు, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలని వనపర్తి, పెబ్బేరు, పెద్దమందడి, గోపాల్పేట, అమరచింత, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, కౌకుంట్ల, నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు మక్తల్, మద్దూరు పోలీస్స్టేషన్లలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనంతోపాటు షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
భీమ్‌గల్, మోర్తాడ్, మెండోరా తదితర మండలాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే శంకర్‌పై ఠాణాల్లో ఫిర్యాదుచేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శంకర్ వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, హైదరాబాద్‌లోని కూకట్పల్లి, ఎల్బీనగర్ పరిధిలోని చైతన్యపురి, మేడ్చల్ జిల్లా బాచుపల్లి స్టేషన్లలో ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్వీ నాయకులు బైఠాయించారు.