వాషింగ్టన్, సెప్టెంబర్ 9 : అమెరికా వలసల చరిత్రలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంది.అమెరికా శాశ్వత వీసాగా పరిగణించే ఈబీ-5 విభాగం దరఖాస్తుదారులలో భారతీయులు అతిపెద్ద సమూహంగా అవతరించారు. ఈ విషయంలో వారు చైనీస్ దరఖాస్తుదారుల సంఖ్యను అధిగమించారు. గత మూడేండ్లలో 12,900 మంది భారతీయులు, 9,875 మంది చైనా పౌరులు ఈబీ-5 వీసాకు దరఖాస్తు చేశారు. ఈ వీసా అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశాన్ని కల్పిస్తుంది. దాని కోసం వారు అమెరికాలో సుమారు రూ.7.5 కోట్లను పెట్టుబడిగా పెట్టాలి.
దానికి అదనంగా కనీసం 10 మంది అమెరికన్లకు ఉపాధి కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఈబీ-5 వీసానే ఇన్వెస్టర్ వీసాగా కూడా పేర్కొంటారు. ఇది యూఎస్ గ్రీన్‌కార్డుతో సమానం. ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసాపై విధిస్తున్న ఆంక్షల కారణంగా పలువురు భారతీయులు ఈబీ-5 వీసా క్యాటగిరీలోకి మారి యూఎస్ పౌరసత్వం పొందుతున్నారు. కాగా, యూఎస్ పౌరసత్వం పొందేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో ట్రంప్ ప్రవేశపెట్టిన ట్రంప్ గోల్డ్‌కార్డ్ పథకం పూర్తిగా ఫ్లాప్ అయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ పథకంలో ఇన్వెస్టర్లు యూఎస్‌లో సుమారు రూ.9.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాలి.