హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సాగునీరు కష్టాలు, కరెంట్ కోతలతోపాటు ఎన్నో లెక్కలేనన్ని ప్రజాసమస్యలను, పాలనను గాలికొదిలిన రేవంత్ సర్కార్.. కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. కేవలం కేసీఆర్, ఆయన కుటుంబంపై కక్షసాధించేందుకు ఒక కమిటీ వేసింది. ఎక్కడెక్కడ వారి పేరున ఉన్న భూములపై విచారణ చేపట్టాలని గురువారం ప్రత్యేకంగా జీవో కూడా చేసింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం భూములపై రేవంత్ సర్కార్ కుట్రలు బద్దలయ్యాయి.
కేసీఆర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధమని తేలిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో నాలుగు రోజులు సర్వే చేసిన అధికారులు అక్కడ ఒక్క అంగుళం అసైన్డ్ భూమి కూడా ఆక్రమించలేదని తేల్చడంతో రేవంత్‌రెడ్డి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. దీంతో కేసీఆర్‌ను బదనాం చేద్దామనుకున్న ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, కరెంట్ కోతలతో రైతులు రోడ్డెక్కడం, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలు నిలదీయడం, డిమాండ్ల కోసం ఉద్యోగుల నిరసనలు, పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై వేటు..
ఉప ఎన్నిక అనివార్యం కావడం, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా కత్తి వేలాడుతుండటంతో ఆయన మైండ్‌బ్లాంక్ అయ్యినట్టున్నది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తనకు తెలిసిన ‘డైవర్షన్ డ్రామా’ ఆయుధాన్ని మరోసారి బయటకు తీశారు. పాలనను గాలికొదిలేసి కేసీఆర్ కుటుంబమే టార్గెట్‌గా దిగజారుడు రాజకీయాలకు తీరతీశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు ఆక్రమించుకున్నారని, వాటిని తేల్చేందుకు అంటూ ఓ కమిటీ వేశారు.
కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములపైనే విచారణ కోసం నలుగురు ఐఏఎస్‌లతో ఒక కమిటీ వేశారు. ఈ మేరకు జీవో 134 జారీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా, జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఆయా జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములపైనే విచారణ చేయాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. అంతేకాదు.. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామంలో ఎవరి పేరున ఉన్న భూములపై విచారణ చేయాలో కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇంత పక్కాగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఉత్తర్వులివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉన్నదనే విమర్శలున్నాయి. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. ఆయా జిల్లాల్లోని మొత్తం భూ లావాదేవీలపై విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తన పాలనా వైఫల్యం బయటపడ్డ ప్రతిసారీ.. కేసీఆర్‌పై ఏదో ఒక ఆరోపణ చేయడం కొద్దిరోజులు పబ్బం గడుపటం రేవంత్‌కు పరిపాటిగా మారింది. ఇప్పటికే ధరణి, భూములు, ఫార్ములా వన్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అంశంలోనూ అవినీతి నిరూపించలేకపోయింది. ఒక్క ధరణిపైనే నాలుగు కమిటీలు వేసింది. తాజాగా వేసింది ఐదోది. ఆ నాలుగు కమిటీలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ‘ప్రజల దృష్టిని మరల్చేందుకు కమిటీలు వేయాలి.. కేసీఆర్ కుటుంబంపై విచ్చలవిడిగా ఆరోపణలు చేయాలి, బురద జల్లాలి ’ కాంగ్రెస్ సర్కార్ మూడేండ్లలో ఇదే టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి పాలన సాగుతున్నదనే ఆరోపణలున్నాయి.